పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండవ వారంలో కూడా రణగొణ ధ్వనులతో, సస్పెన్షన్లతో ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ అస్త్రాల ను ప్రయోగించడాన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా గర్హిస్తున్నారు, సోమవారం నాడు 19 మంది సభ్యులు రాజ్య సభ నుంచి సస్పెండ్ అయ్యారు. అయితే, వీరంతా ఒకే కారణంపై సస్పెండ్ కాలేదు.జీఎస్టీని పాలు వంటి నిత్యా వసరాలపై విధించడాన్ని వ్యతిరేకిస్తూ వీరిలో కొందరు నినాదాలు చేశారు.ప్రజల సమస్యలను పార్లమెంటులో మొరపెట్టుకునేందుకే తాము ఎన్నికయ్యామనీ, అత్యు న్నత ప్రజావేదికపై కాకుండా ప్రజల సమస్యలను ఇంకెక్కడ చెప్పుకోవాలంటూ నినాదాలు చేస్తూ వారంతా బయటికి వెళ్ళిపోయారు. ప్రభుత్వం తమ నోళ్ళను నొక్కేస్తోందంటూ ప్రతిపక్ష సభ్యులు కొత్త రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు సంయుక్తంగా ఒక లేఖ రాశారు. ఈ లేఖపై ప్రతిపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి తాము ప్రస్తా వించదల్చిన అంశాలను ప్రభుత్వం అడ్డుకుంటోందని రాష్ట్రపతికి వారంతా సంయుక్తంగా ఫిర్యాదుచేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై ఆర్థిక శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ), సీబీఐలను కేంద్రం ఉసిగొల్పు తోందనీ, పాత కేసులను తవ్వడమో, లేక కొత్త కేసులను అక్రమంగా బనాయించడమో చేస్తోందని వారు ఆరోపిం చారు. ప్రజా సమస్యలపై గళమెత్తిన వారిపైనే కేసులు పెట్టడాన్ని గమనించాలని కొత్త రాష్ట్రపతిని వారంతా కోరారు. తాము చేసిన ఆరోపణల్లో నిజానిజాలను జోక్యం చేసుకుని స్వయంగా నిర్ధారించుకోవాలని రాష్ట్రపతిని వారు కోరారు.
ప్రతిపక్షాల ఆగ్రహావేశాలు మిన్నంటడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ని సోమవారం మరోసారి ఈడీ రెండున్నర గంటలుపైగా ప్రశ్నించడం,ఆమె కుమారుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం,నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేయడం అన్నీ ఒకే రోజు న జరగడమేకారణం. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా పలు ప్రతిపక్ష ఎంపీలు, నాయకుల ఇళ్లపై దాడులు జరి పించడాన్ని కూడా ప్రతిపక్ష ఎంపీలు ఈ లేఖలో ప్రస్తా వించారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నాయకులపై పాత కేసులను తవ్వి తీసి నోటీసులు పంప డాన్ని కూడా ప్రతిపక్ష నాయకులు ఆ లేఖలో ప్రస్తావించా రు. కొత్త రాష్ట్రపతి మీద కోటి ఆశలు పెట్టుకున్నామనీ, ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాల హక్కులను కాపా డాల్సిన బాధ్యత దేశ ప్రథమ పౌరురాలైన మీపైనే ఉందని విపక్షాలు ఆ లేఖలో పేర్కొన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్, ఎస్పి, నేషనల్ కాన్ఫరె న్స్, ఆర్జేడీ, సీపీఎం నాయకుల ఇళ్ళపై ఈడీ అధికారు లు దాడులు చేయడాన్ని ఈ లేఖలో ప్రతిపక్ష ఎంపీలు ప్రస్తావించారు. ప్రతిపక్షాల ప్రతిష్టను దెబ్బతీయడమే ప్రధానోద్దేశంగా ప్రభుత్వం ఈ దాడులు జరిపిస్తున్నద నీ, ఈ దాడుల్లో కొత్తగా లభ్యమైన సమాచారం ఏదీ ఉండటం లేదనీ, అయినా పత్రికా ప్రకటనలు విడుదల చేయడం, మీడియాలో హోరెత్తించడం ద్వారా విపక్షాల ను దెబ్బతీసే కార్యక్రమాన్ని కేంద్రం అమలు జేస్తోందని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు.ఆజాదీకా అమృతోత్స వ్ పేరిట స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతు న్న తరుణంలో దేశంలో సీనియర్ సిటిజన్స్, స్వాతంత్య్ర యోధులకు సమకూర్చవల్సిన సౌకర్యాలు, సదుపాయా లపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదు.
ఈ దేశంలోని సంపద నంతా అదానీ, అంబానీ వంటి సంపన్నుల పరం చేయ డానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని ఎలుగెత్తి చాటిన ప్రతిపక్షాల ఎంపీలనూ, సీనియర్ నాయకులను ప్రభుత్వం కేసుల పేరిట వేధిస్తుండటాన్ని చూస్తే, ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు గుర్తుకుని వస్తున్నాయని ప్రతిపక్ష ఎంపీలు పేర్కొన్నారు.ప్రతిపక్ష ఎంపీలపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని వారు ఎండగట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత వరకూ ఏ ప్రభుత్వమూ విపక్షాల పట్ల ఇంత కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శించలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రతిపక్షాలు రాసిన లేఖపై కొత్త రాష్ట్రపతి ఎలా స్పంది స్తారో వేచి చూడాలి. ఈ పదవిని చేపట్టిన వెంటనే ప్రతి పక్షాల లేఖ అందుకోవడం ఆమెకు వింత అనుభవం వంటిదే. అయితే, దేశ ప్రథమ పౌరురాలుగా ఆమె తన బాధ్యతను ఇప్పుడే తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవ ల్సి ఉంటుంది.ఆమెకు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఓటు వేశారు. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి స్పందించిన దాఖలాలు లేవు. మొదటి నుంచి ప్రభుత్వానికి అను కూలంగా ఉండే వ్యక్తులే రాష్ట్రపతి పదవులను అధిష్టిస్తు న్నారు. ఈ విషయం ప్రతిపక్షాలకు తెలియదని కాదు. ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి కాక ఇంకెవరు దిక్కు? అందుకే ఆమెకు మొరపెట్టుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.