Monday, November 18, 2024

Editorial: పండుగ పాట్లు

పండుగల్లో పెద్ద పండుగగా పరిగణించే సంక్రాంతికి సొంతూళ్ళకు వెళ్ళాలంటే తెలుగువారు భయపడుతున్నారు. సెలవు దొరక్కా కాదు, డబ్బులు లేకా కాదు. వెళ్ళే దారి లేక. సంక్రాంతికి రైల్వేశాఖ , రోడ్డు రవాణా సంస్థ (రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు) ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నా, అటు రైల్వే స్టేషన్‌లూ, ఇటు బస్టాండులూ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల బస్టాండుల్లో మహిళలు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. పండుగకు ఉద్యోగులు స్వస్థలాలకు వెళ్ళడం కొత్త కాదు. ఏ యేటికాయేడు పెరిగే ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకుని సర్వీసులను పెంచుతున్నప్పటికీ సరిపోవ డం లేదు. మహిళలు ముందుగా బస్సు ఎక్కి, కిటికీల్లోం చి చంటి పిల్లలను తీసుకుంటున్న దృశ్యాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే, వృద్ధులనూ, పెద్దవారినీ తోసేసుకుంటూ ముందుగా రైళ్ళు, బస్సులు ఎక్కుతున్న యువతరం ప్రతినిధులు దృశ్యాలు కూడా అన్ని చోట్లా ఉమ్మడిగా కనిపిస్తున్నాయి. వరుసగా సెలవులు రావడంతో హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడవంటి నగరాల్లో జనం స్వస్థలాలకు బయలుదేరారు. హైదరాబాద్‌, విజయవాడ ప్రధాన బస్టాండ్లలో ఊహించవీలులేని విధంగా ప్రయాణీకులు చేరుకుంటున్నారు. బస్సుల్లో టికెట్లు దొరకని వారి రాక కోసం బస్సు స్టాండ్ల సమీపం లోనే ప్రైవేటు బస్సులను నిలిపి ఉంచుతున్నారు.

ప్రభు త్వ రవాణా వాహనాల కన్నా కొద్దిగా చార్జీలు ఎక్కువైనా, అనుకున్న గడువులో గమ్యాన్ని చేరుకోవచ్చన్న ఉద్దేశ్యం తో ప్రయాణీకులు ప్రైవేటు బస్సులను ఎంచుకుంటున్నా రు. ప్రైవేటు బస్సుల్లో చార్జీలు గూబగుయ్‌ మంటున్నా యి. ప్రైవేటు బస్సులపై ప్రభుత్వానికి మామూలు రోజు ల్లోనే అజమాయిషీ లేదు. పండుగ రోజుల్లో అసలు చెప్ప నవసరం లేదు. బస్సుల్లో సీట్లు భర్తీ అయినా, బస్సుల్లో నడిచేందుకు ఉన్న సన్నని దారిలోనూ కుర్చీలు వేసి అధిక చార్జీలను వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆర్టీసి యాజమాన్యం గడిచిన రెండు మూడు రోజుల నుంచి రోజుకు మూడు, నాలుగు వందల వంతున ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అవసరమైతే ప్రయాణీకుల సంఖ్యను బట్టి బస్సుల సంఖ్యను పెంచు తామని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు. అటు రైళ్ళ ల్లోనూ రద్దీ మామూలు రోజుల్లో కన్నా ఎక్కువగా ఉం టోంది. రిజర్వేషన్‌ లేని బోగీల్లోకి ప్రయాణీకులు లగేజీ తో ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఇతర ప్రయాణీకులను తోసేస్తున్నారు. రైళ్ళను మామూలు రోజుల్లో కన్నా కొంచెం ఎక్కువ సేపు ఆపమన్నా ఆపకుండా నడిపేస్తుం డటం వల్ల ప్రయాణీకులు కిందపడిపోతున్న సందర్భా లు చాలా ఉన్నాయి. ఇలాంటివి ఎవరిమటుకు వారికి అనుభవమే తప్ప మీడియా దృష్టికి రావు. అలాగే, నగరాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ స్వస్థలాలకు బయలుదేరిన వారు ప్రైవేటు బస్సుల్లో ఎక్కువ చార్జీల ను చెల్లించేందుకు వెనుకాడటం లేదు.

వీరి మూలంగా సామాన్య, మధ్యతరగతి వర్గాలు ఎక్కువ చార్జీలు చెల్లించలేక బస్సుస్టాండ్‌ వరకూ వచ్చి వెనక్కి వెళ్ళిపోతు న్న వారు ఎక్కువే. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమకు వెళ్ళేవారి సంఖ్య ఎక్కువ. వీరిలో చాలా మంది ఉద్యోగులు. మామూలు పండుగల్లో కూడా వీరు వెళ్తుంటారు. పెద్ద పండుగకు ముందే చేరుకోవాలన్న ఆత్రుతతో బయలుదేరుతూ ఉంటారు. సంక్రాంతికి గ్రామాల్లో ఉండే వాతావరణం వేరు. అక్కడి కుటుంబా ల్లో వేర్వేరు ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిన వారు పెద్ద పండుగకు తప్పని సరిగా వస్తారు. అందువల్లే ఈ రద్దీ. తెలంగాణ నుంచి, ప్రత్యేకించి హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారు వెళ్లే వాహనాల సంఖ్య వేలల్లో ఉంటాయి. ఈ పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి ఈ పండుగ పాట్లు తప్పడం లేదు. హైదరాబాద్‌ – విజయవాడ రోడ్డుమార్గంలో వాహనాల రద్దీని గమనిస్తే.. పంతంగి, కీసర వంటి టోల్‌గేట్ల నిలిచే వాహనాల బారులు గుండెగాబారాకు కారణమవుతా యి. వాటిని చూస్తే ప్రయాణికుల పాట్లు కళ్లకు కడతాయి. ఎన్నికష్టాలుపడ్డా.. పాడి పంటలు చేతికొచ్చేవేళ.. అయిన వారిని, పుట్టిన ఊరిని చూసేందుకు తహతహలాడటం తెలుగువారికి ఇష్టమే. ఏడాదంతా ఎక్కడెక్కడ ఉన్నా.. మూడురోజుల ముచ్చటైన పండుగకు వెళ్లడంలోఉండే ఆనందంముందు ఈ కష్టాలు చిన్నవే. కానీ, ఆ చిన్నకష్టం కూడా లేకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత. అప్పుడే పండుగ ఆనందం ఆర్ణవమవుతుంది. ప్రస్తుతం మాత్రం ప్రయాణికులు అధిక చార్జీల భారం మోయలేక అవస్థలు పడుతున్నారు. ఊరికి వెళ్లాలన్నా ఆకాంక్ష ఉన్నప్పటికీ లోలోపల మనస్తాపానికి గురవుతున్నారు. ప్రయివేటు బస్సుల్లో లగేజీల భారం కూడా ప్రయాణికులకు ఇబ్బందికరంగా పరిణమించింది. కార్గో బస్సులు ఉన్నప్పటికీ ప్రయాణికులు బస్సుల్లో సరకు రవాణా జరగడమే ఇందుకు కారణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement