ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్లమెంటు కొత్త భవనం సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవం ఎవరు చేయాల న్నదానిపై ఏర్పడిన వివాదం నగుబాటు కలిగిస్తోంది. ఈ కొత్త భవన సముదాయం నిర్మాణాన్ని 2020లో కేంద్ర గృహనిర్మాణ శాఖ చేపట్టింది.ఈ భవన సముదాయం విస్తీర్ణం 98 వేల చదరపు మీటర్లు. దీని నిర్మాణానికి జరిగిన వ్యయం ఇప్పటికే 1210 కోట్ల రూపాయిలకు చేరుకుంది.ఈ భవనం శంకుస్థాపన దగ్గర నుంచీ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. వాటిని దాటుకుని దీని నిర్మాణం ఇప్పటికి పూర్తి అయింది. ఆదివారం ఈ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తాన్ని నిర్ణయించా రు. ఇప్పుడు దీనిని ఎవరు ప్రారంభించాలనే దానిపై కొత్త వివాదం బయలుదేరింది. ఈ భవన నిర్మాణానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించడం ఎంతో సముచితమని అధికార పార్టీ, ప్రభుత్వ వర్గాలూ వాదిస్తున్నాయి.
రాజ్యాంగానికీ, పార్లమెంటుకూ అవినాభావ సంబంధం ఉన్నందున, రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి చేత ప్రారంభింపజేయడం ఎంతో సమంజసమని ప్రతిపక్షా లు వాదిస్తున్నాయి. అంతేకాదు, ఈ ప్రారంభోత్సవాన్ని ప్రధాని చేత జరిపిస్తే, తాము బహిష్కరిస్తామంటూ 19 పార్టీలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. మోడీ అధికారం చేపట్టిన తరువాత, ఇన్ని ప్రతిపక్షాలు ఇలా ఏకతాటిపై నిలవడం ఇదే మొదటి సారి. వీటిలో కాంగ్రెస్, డిఎంకె, ఆప్, శివసేన (యూబీటీ), ఉభయ కమ్యూనిస్టులు, తదితర పార్టీలు ఉన్నాయి. తన నిర్ణయా న్ని గురువారం ప్రకటిస్తామని భారతీయ రాష్ట్రపతి ప్రక టించింది. ఈ భవన సముదాయాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభింపజేయడం వీలు కుదరకపోతే కనీసం స్పీకర్ చేత ప్రారంభింపజేయాలని ఎంఐఎం డిమాండ్ చేస్తోం ది.
ఈ కార్యక్రమానికి స్పీకర్ ఓం బిర్లాను కూడా ఆహ్వాని స్తున్నారు. అయితే, ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వారు గతంలో పార్లమెంటు విస్తరణ భవనాన్నీ, గ్రంథాలయా న్ని ప్రారంభించిన సంప్రదాయం ఉందని కేంద్రం స్పష్టం చేస్తోంది. 1985లో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ, 1987లో ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఈ రెండింటినీ ప్రారంభించిన సంగతిని కేంద్రం గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం బ్రిటిష్ కాలం నాటిది. ఇప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబిం బించే రీతిలో కొత్త భవనాన్ని నిర్మించారు. అయితే, ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తోందనీ, ప్రజా సమస్యలను లేవనెత్తిన సభ్యులపై అనర్హత వేటు వేస్తోం దని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ భవన నిర్మాణాని కి తాము వ్యతిరేకం కాదనీ,ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగానే ఈ కార్యక్రమాన్ని బహిష్కరిం చాలని నిర్ణయించామని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.
అంతేకాకుండా రాజ్యాంగానికి అధిపతి అయిన రాష్ట్ర పతి చేత ఈ కొత్త భవనాన్ని ప్రారంభింపజేయడం ఎంతో సమంజసమన్నది ప్రతిపక్షాల వాదన. పార్లమెంటు సంయుక ్తసమావేశాలను, బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేది రాష్ట్రపతేనని, పార్లమెంటు ఆమోదించే బిల్లులను రాష్ట్రపతి ఆమోదిస్తేనే అవి చట్టాలు అవుతాయ ని, రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడనీ, రబ్బరు స్టాంపు కానేకాదని వాదిస్తున్నాయి.అన్ని ప్రభుత్వ వ్యవహారాలు రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతాయని.. అందువల్ల రాష్ట్రపతి చేత పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభింప చేయడం గౌరవంగా ఉంటుందని సూచిస్తున్నాయి. అదీ గాక, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన మహిళ కనుక, ఆమె చేత ఈ కొత్త భవనాలను ప్రారంభింపజేయ డం ఎంతో సమున్నతంగా ఉంటుందనీ, దేశ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందని వాదిస్తున్నాయి. ప్రజా స్వామ్య సూత్రాలను వల్లిస్తూ వాటిని గాలికి వదిలేస్తున్న ప్రభుత్వానికి గట్టి గుణ పాఠం చెప్పేందుకే, ఈ కార్యక్ర మాన్ని బహిష్కరించదల్చామని ప్రతిపక్ష నాయకులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా పార్లమెంటు కొత్త భవనం వివాదాలకు, విమర్శలకు అతీతంగా శుభసూచి కంగా ప్రారంభం కావాలన్నది తమ ఆకాంక్ష అని ప్రతి పక్షాలు పేర్కొన్నాయి.
అయితే, ప్రతిపక్షాలుతమ నిర్ణ యాన్ని మరోసారి పున:పరిశీలించుకోవాలని పార్లమెం టరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. కోట్లాది ప్రజల అభిమానాన్ని చూరగొన్న మోడీ విదేశాల్లో కూడా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నారనీ, కొద్ది రోజుల క్రితం ఆయన జరిపిన ఐదు రోజుల పర్యటనలో లభిం చిన ఆదరణ ఇందుకు నిదర్శనమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అడ్డంకులు లేకుండా ఆదివారం ప్రారంభోత్సవానికి సంసిద్ధమవుతున్న తరుణంలో ప్రతిపక్షాలు తమ వైఖరిపై పున:పరిశీలన జరుపుకోవా లని ప్రభుత్వం కోరుతోంది. సహకరించాలని ప్రతిపక్షా లకు ప్రభుత్వ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. నిజానికి రాష్ట్రపతి చేత ప్రారంభోత్సవం జరిగేలా మోడీ చొరవ తీసుకుంటే అటు భారత్ ఇటు ప్రధాని పేరు ప్రతిష్టలు మారు మోగుతాయి.