Saturday, November 23, 2024

Editorial – శ‌ర‌ద్ ప‌వార్ లో ప‌వ‌ర్ త‌గ్గిందా…

మ హారాష్ట్ర స్ట్రాంగ్‌మ్యాన్‌గా పేరొందిన శరద్‌ పవార్‌ పెంచి పెద్దచేసిన పార్టీ కళ్ళముందే చీలిపోవడం ఆయనకు బాధాకరమే. ఇది స్వయంకృతాపరాథమా, కాలానుగుణంగా వచ్చిన మార్పుల ప్రభావమా అనేది త్వరలోనే తేలుతుంది. ఆయన వయసును గుర్తు చేస్తూ ఇక చాలు విశ్రాంతి తీసుకోండి అని అజిత్‌ పవార్‌ అంటున్నాడు. మీరే మా దైవం అం టూనే పార్టీ పగ్గా లనూ, ఎన్నికల గుర్తునూ తనదేనని వాదిస్తున్నాడు. తన కు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనీ, తనదే అసలైన నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అనీ తమ పార్టీనే అసలైన ఎన్సీపీగా గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి అర్జీ పెట్టుకున్నాడు. మహారాష్ట్రలో రాజకీయ పరిణా మాలు ఎప్పటికప్పుడు మారుతున్నా, శరద్‌ పవార్‌ గౌరవం, హోదా ఏమాత్రం తగ్గలేదు. ఆయన వయసు రీత్యా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ పాలు పంచుకుం టున్నారు.

బీజేపీయేతర పార్టీలన్నీ ఇటీవల పాట్నాలో నిర్వహించిన సమావేశానికి పవార్‌, ఆయన ముఖ్య అనుచరుడు ప్రఫుల్‌ పటేల్‌ హాజరయ్యారు. తమ మద్ద తును ప్రకటించారు. ఆయనను తమవైపు తిప్పుకో వడా నికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాలాసార్లు స్వయంగా పిలిపించి మాట్లాడారు. మోడీ పట్ల గౌరవం ఉన్నా, సైద్ధాంతికంగా బీజేపీతో చేతులు కలపలేనని పవా ర్‌ నిర్మొహమాటంగా స్పష్టం చేశారు. అయితే, విచిత్ర మేమంటే శరద్‌ పవార్‌ మొదటిసారి ముఖ్య మంత్రి అయింది బీజేపీ మద్దతుతోనే. అప్పట్లో వసంత రావు నాయక్‌ మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్న పవార్‌ బీజేపీ అండతోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి దగ్గరైన దాఖలాలు లేవు. కాంగ్రెస్‌ నాయ కునిగా ఆయన కేంద్రంలో వివిధ పదవులను నిర్వహిం చారు. సోనియాగాంధీ జాతీయత అంశంపై విభేదించి కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చి నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)ని 23 ఏళ్ళ క్రితం నెలకొల్పారు. కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో భాగ స్వామి అయ్యారు.

కేంద్రంలో వ్యవసాయంవంటి ముఖ్య శాఖలను నిర్వహించారు. యూపీఏ కూటమి వ్యవహారాల్లో చురుకుగా పాలు పంచుకున్నారు. ఆయన ఇప్పటికీ జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న నాయకునిగా తన గుర్తింపును కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయన బలం మహారాష్ట్రకే పరిమితం అయినప్పటికీ బీహార్‌, తదితర రాష్ట్రాల్లో కూడా ఎన్సీపీ సభ్యులు ఉన్నారు. ఎన్సీపీలో ఆయన కుమార్తె సుప్రియా సూలే, అజిత్‌ పవార్‌లు రెండో స్థానం కోసం చాలాకాలంగా పోటీ పడుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేనను బాల్‌థాకరే గట్టి పునాదులతో నిర్మించి తానున్నంత వరకూ బలమైన పార్టీగా నడిపించారు. అదే మాదిరిగా ఎన్సీపీ కూడా ఇప్పటికీ గట్టి పునాదులతో బలమైన పార్టీగా కొనసాగుతోంది.

- Advertisement -

అయితే, రాష్ట్రంలో ఇటీవల కొంతకాలం అధికారంలో ఉన్న మహారాష్ట్ర అగాఢి కూటమికి శరద్‌పవార్‌ కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి బీజేపీకి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నడిపించారు. కమ్యూ నిస్టు లను కూడా ఈ కూటమిలో చేర్చుకోవడం అజిత్‌ పవార్‌కి ఇష్టం లేదు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ధాకరే నేతృత్వం లో చేరకుండా బీజేపీ కూటమిలో చేరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలనుకున్నారు. అయితే, అప్పట్లో ఎన్సీపీపై పవార్‌ పట్టు సడలకపోవడం వల్ల, ఎమ్మెల్యేల్లో అధిక భాగం పవార్‌ వెంటే ఉన్నారు. అందువల్ల అజిత్‌ ఎత్తు పారలేదు. ఇప్పుడు పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలను కూడగట్టుకుని ఏకనాథ్‌ షిండే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో చేరారు. ఏకనాథ్‌ షిండే శివసేన చీలిక వర్గం నాయకుడు. ఆయన బాల్‌థాకరే హయాం నుంచి అత్యంత విధేయునిగా ఉంటూ ఆయన మరణానంతరం బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుని శివసేన పార్టీని రెండుగా చీల్చారు.

ఉద్ధవ్‌ థాకరేకి రాజకీయంగా ఎత్తులు, పై ఎత్తులు చేతకాకపో వడంవల్ల ఏకనాథ్‌ షిండే పాచిక పారింది. మహారాష్ట్రలో గతంలో బీజేపీ శివసేన సంకీర్ణ ప్రభుత్వం కొనసాగింది. అసెంబ్లిd ఎన్నికల అనంతరం ముఖ్య మంత్రి పదవి కోసం బీజేపీ పట్టుపట్టడం వల్ల రెండు పార్టీ లమధ్య దూరం పెరిగింది. అప్పటి నుంచి శివసేనను దారిలోకి తెచ్చు కోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు ఏకనాథ్‌ షిండే రూపంలో ఫలప్రదం అయ్యాయి.అదే మాదిరిగా ఎన్సీ పీని చీల్చేం దుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఇప్పటికి ఫలవంతం అయ్యాయి. రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వా లనూ, లేదా ఆ పార్టీ అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కోసం కమలనాథులు సాగిస్తున్న యత్నాలు మణిపూర్‌తో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే, రాజకీయ చాణక్యునిగా పేరున్న శరద్‌ పవార్‌ దెబ్బతిన్న బెబ్బులిగా ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుం టారో వేచి చూడాలి. వయసు పైబడటంవల్ల ఆయన ఇక విశ్రాంతి తీసుకోవాలన్న అజిత్‌ పవార్‌ మా టను నిజం చేస్తారో లేక తిరగబడతారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement