మండు వేసవిలో వర్షాలు… రాకాసి వర్షాలు… సరికొత్తగా కొద్ది కాలంగా మొదలైన చేదు అనుభవం. వర్షపు నీరైనా, కాలువనీరైనా గంగకు ప్రతీకే.దేశంలో ఓ వైపు గంగా పుష్కరాలు ఘనంగా జరుగుతున్న తరుణం లోనే ఇటువైపు రైతుల పాలిట ఈ అకాల వర్షాలు పెను శాపాలయ్యాయి. రైతులు కష్టించి పండించిన పంట నేలపాలైంది.రాకాసి వర్షాలు సగటు మనిషిని నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. మరోవైపు వర్షపు నీటితో జనం రోగాలు పాలవుతున్నారు. గంగాస్నానం కామితార్థ ప్రదాలను కలిగిస్తుంది. అయితే,పరిమితిని మించి నీరు ప్రవహిస్తే జనజీవనానికి ఇబ్బందే. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో ఇలాంటి పరిస్ధితి నెలకొంది. మామిడి కాయలు రాలిపోయాయి. వేసవి పేరు చెబితే గుర్తొచ్చే మామిడి ఈసారి కరవైంది. ఏడాది పొడవునా వాడుకునే ఆవకాయ,తదితర పచ్చళ్ళకు ఈసారి కాయలు కనుమ రుగై పోయాయి. ఆకాశం నుంచి వచ్చి పడుతున్న రాకాసి వర్షాలు సామాన్యులకు మేలు చేయకపోగా, అనేక విధాలుగా ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. అయితే, వీటి వల్ల మెట్ట ప్రాంతాల్లో పంటలకు మేలు జరుగుతుం దని అంటున్నారు. కాని అత్యధిక ప్రాంతాల్లో భారీవర్షా లు తెచ్చిన నష్టం అంతా ఇంతా కాదు. చాలా చోట్ల దశాబ్దాల క్రితం నాటి భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొత్తగా వేసిన రోడ్లు కొట్టుకుని పోయాయి. జాతీయ రహదారులన్నీ నదుల్లా కనిపిస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. రోడ్ల మీద, మార్కెట్ యార్డు ల్లో వరిధాన్యం తడిసి నీళ్లల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు గుండె తరుక్కుపోయేలా చేస్తున్నాయి. మామూలుగా అయితే, ఈ సమయంలో నీటి చుక్క కరవై జనం విలవిలాడుతూ ఉండేవారు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో వద్దంటే నీరు ప్రవహిస్తోంది. చాలా చోట్ల చెక్‌డ్యామ్‌లు కూలిపోయాయి. రహదారులన్నీ కాలువలైపోయాయి. ప్రజలు నిత్యావసర వస్తువులు అందక అవస్థలు పడుతు న్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సాయం గ్రామాల్లో మారుమూల ప్రజలకు ఏమాత్రం సరిపోవడం లేదు. మధ్యలో కరెంట్ కట్ అవడంతో చీకటిలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.హైదరాబాద్ వంటి మహా నగరంలోనే ఇక్కట్లు తప్పలేదంటే ఇక గ్రామాలు, పట్టణాల్లో పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు.చుట్టూ నీరు ఉన్నా ప్రజలకు మంచినీరు కరవు అవుతోంది. కాలువలూ, పబ్లిక్ కుళాయిల్లో నీరు కలిసిపోవడం వల్ల ఏది మం చినీరో,ఏది మురికి నీరో నిర్ధారించుకోలేక జనం అల్లాడుతున్నారు.
ఇంకోవైపు గొంతులు ఎండిపోతుండ గా, జనం అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం,పురపాలక సంఘాలు గతంలో ట్యాంకర్ల ద్వారా నీళ్ళు పంపించేవి. ఇప్పుడు అరకొరగా ట్యాంకర్ల నీరు సరఫరా అవుతోంది. ప ట్టణాలు, నగరాల్లో మ్యాన్ హోల్‌లో పడి పిల్లలు ప్రాణా లు కోల్పోతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మ్యాన్ హోల్‌లను చూసుకుని నడవాలని హెచ్చరికలు జారీ అవుతున్నా, పిల్లలు పాలప్యాకెట్లకో, నిత్యావసరా లకో బయటికి వస్తున్నారు. ప్రధాన రహదారులన్నీ నదుల్లా కనిపిస్తున్నాయి. వాహనదారుల ఇక్కట్ల సంగతి చెప్పనవసరం లేదు. కొన్నిచోట్ల గుంతల్లో వాహనాలు ఇరుక్కుని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇంత భారీ వర్షంలోనూ వాహన చోదకులు యమ స్పీడ్‌లో బండ్లు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు మీద కాలుమోపడమే ఓ భయానకమన్నట్లు ప్రమాదానికి దారి తీసే పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వైపు వర్షం, మరో వైపురోడ్డుపై గుంటలతో సామాన్యులు బయటకు రావాలంటే భయపడుతున్నారు.
వర్షాలు పడతాయని వాతావరణ వేత్తలు ప్రకటించగానే వాటి బారి నుంచి ఎలా తప్పించుకోవాలని తంటాలు పడుతు న్నారు. మరో గంటలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున, అందరూ త్వరగా ఇళ్లకు చేరుకోండి. అత్యవరమైతే తప్ప బయటికి రావద్దు అని వాతావరణ శాఖ నిత్యం ప్రకటిస్తున్నదంటే ఈ అకాల వర్షాల ముప్పు నుంచి బయటపడే అవకాశమే లేదా అన్న నిస్పృహ మిగులుతున్నది! వర్షాల వల్ల సామాన్య ప్రజలు అష్టకష్టాలకు లోనవుతున్నారు. ప్రజలకు ధరలు అందుబాటులో లేవు. మంచినీటి కోసం ప్రజలు అలమటించి పోతున్నారు. చాలా చోట్ల మంచినీటి ట్యాంకర్లు వచ్చిన కొద్దిసేపటికే వెనక్కి వెళ్లిపోతున్నాయి. దీనికి కారణం కొంత మంది నీటిని ముందే పట్టేసుకుని కొరతను సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. వేసవి కాలం వల్ల బడులు మూసివేయడం పిల్లలకు కలిసొచ్చిన అంశం. అయితే పిల్లలను వర్షపు నీటిలో తడుస్తూ రోగాలు తెచ్చుకుంటున్నారు. అదుపు చేయడం తల్లిదండ్రులకు కష్టంగా ఉంది. ఆడుకోవడానికి ఆట స్థలాలు లేక పిల్లలు ఇంటి పట్టున ఉండవలసి రావడంతో వారిలో నిరుత్సాహం పెరిగిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు సమాజంలో ఏ వర్గానికి సంతోష పెట్టడం లేదు. ఈ వర్షాల వల్ల రైతులే కాదు.. సామాన్యులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.