రాజకీయ అస్థిరతకు చిరునామా పాకిస్తాన్. అన్ని రకాల అవ్వస్థలకు అడ్డం పాకిస్తాన్. అనిశ్చితి నుంచి అనిశ్చితిలోకి పయనించడం తప్ప నిశ్చలత్వానికి అది ఆమడధూరం. అందుకే, పాక్ పార్లమెంటు రద్దుకు ప్రధా ని షెహబాజ్ షరీఫ్ సిఫార్సు చేయడం, దేశాధ్యక్షుడు అల్వీ ఆమోదించడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఈ పరిణామాలు ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.ప్రస్తుత ప్రధాని షరీఫ్ పద వీ కాలం ముగిసే సమయంలోనే ఆయన పార్లమెంటు రద్దుకు సిఫార్సు చేశారు. గడువుకు కొన్ని గంటల ముందే పార్లమెంటు రద్దయింది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్ళారు. ఆయనపై ఆరోపణలు వచ్చిన కారణంగా పదవి నుంచి దిగిపోవడం షరీఫ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలను స్వీకరించ డం జరిగింది.దేశంలో కొత్తగా ఎన్నికలను నిర్వహించేందుకు వెసులుబాటు కలిగినప్ప టికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.ఇమ్రాన్ ఖాన్ ఐదేళ్ళపాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని ఎన్నికల సంఘం నిర్దేశించడం వల్ల పరిస్థితి క్లిష్టంగా మారింది. పాక్ జనాభా 16 శాతం పెరిగింది. ఇరవై కోట్ల నుంచి 24 కోట్లకు చేరింది. కొత్తగా పెరిగిన జనాభాతో నియోజక వర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఈ తతంగం అంతా పూర్తి అయ్యే సరికి నాలుగైదు నెలలు పడుతుంది.
షెడ్యూలు ప్రకారం నవంబర్‌లో ఎన్నికలు జరుగుతా యని అనుకున్నారు.కానీ,నియోజకవ ర్గాల పునర్విభజన పూర్తి అయ్యేటప్పటికి ఆలస్యం జరగవచ్చునని పేర్కొం టున్నారు. దేశంలో ఈ ఏడాది ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని పాక్ మంత్రి రాణా సనావుల్లా కూడా ప్రకటించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా లేకపోవడం ప్రధాన కారణం. ఈలోగా ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటు కావల్సి ఉంది.ఆపద్ధర్మ ప్రధానిపై అధికార, ప్రతిపక్ష సభ్యులు ఏకాభిప్రాయానికి రావల్సి ఉంది. అభ్యర్ధి పేరును పార్లమెంటరీ కమిటీ సూచించాలి. ఏకాభిప్రాయానికి రాలేకపోతే అభ్యర్ధుల జాబితాను ఎన్నికల సంఘానికి పంపిస్తారు. రెండు రోజుల్లో ఎన్నికల సంఘం అభ్యర్ధిని నిర్ణయిస్తుంది. కాగా, పాక్ తాత్కాలిక ప్రధానిగా మాజీ ఆర్థిక మంత్రి హఫీజ్ షేక్ పేరు వినిపిస్తోంది.ఆయన మాజీ ప్రధాని నవాజ్ హయాంలో ఆర్థిక శాఖ కార్యదర్శి గా వ్యవహరించారు. ఆపద్ధర్మ ప్రధాని పదవిపైనే ఏకాభి ప్రాయం కుదరకపోతే పరిపాలన అంతిమంగా సైన్యం చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది.
పాక్‌లో సైనిక పాలన సర్వసాధారణమే. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రంలో పాక్‌లో ప్రజా ప్రభుత్వాలు మూడు సార్లు మాత్రమే పూర్తి కాలం కొనసాగాయి. ఇమ్రాన్ నేతృత్వంలో ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని అనుకున్నారు.ఆయన చేసుకున్న తప్పిదాలే ఆయన పదవికి చేటు తెచ్చాయి. తోషా ఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ళ జైలు శిక్ష పడింది.తోషా ఖానా అంటే ఆయన ప్రధానిగా ఉన్నప్పు డు వచ్చిన బహుమతులను సొంతం చేసుకున్నారన్న ఆరోపణలపై జైలు శిక్ష పడింది.ఈ శిక్ష కారణంగా ఎన్నిక ల సంఘం ఆయనపై ఐదేళ్ళ అనర్హత వేటు వేసింది. దానిపై ఆయన ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీలు చేశారు.కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు.కాగా,తనను మాజీ ప్రధానిగా కాకుండా సాధారణ ఖైదీగా కూడా చూడటం లేదని ఇమ్రాన్ జైల్లో వాపోతున్నారు.
రాజకీయ పరంగా తనను ఎదుర్కోలేక వ్యక్తిగతంగా హింసిస్తున్నారనీ, పురుగులు ఉన్న గదిని తనకు కేటాయించారనీ, వార్తా పత్రికలు, ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేదని ఆక్రోశిస్తు న్నారు. పాకిస్తాన్‌లోమాజీ ప్రధానులకు సరైన గౌరవం దక్కక పోవడం మామూలే.నవాజ్‌షరీఫ్‌ని ఇదే మాదిరి గా ఇమ్రాన్ అవమానించారు. ఆయన లండన్‌కి ప్రవాసం వెళ్ళిపోయారు. పాక్ లో ఆర్థిక వ్యవస్థ కునారిల్లడం వల్లనే అక్కడ మాజీలకు సరైన సౌకర్యాలు దక్కడం లేదన్న వాదన ఉంది. అది నిజమే కావచ్చు. పాకిస్తాన్‌కి రుణాలిచ్చేందుకు ఏ దేశమూ ముందుకు రావడం లేదు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రావల్సి న వాయిదా సొమ్ముఅందలేదు. గతంలో మాదిరిగా సౌదీ అరేబియా పాక్‌కి సాయం అందించడం లేదు.చైనా పాక్‌ని తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నదే తప్ప ఆర్థికంగా సాయపడటం లేదు. ప్రస్తుత పరిస్థితులో పాక్‌లో బలవంతునిదే రాజ్యం సామెత చందంగా పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ ఖాన్ హయాంలో పాక్ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే పాక్‌లో అనిశ్చిత స్థితి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది.ఇమ్రాన్ విడుదల కాకుండానే పార్లమెంటుకు ఎన్నికలు జరిపించే అవకా శం ఉంది.