Friday, November 22, 2024

ఎడిటోరియ‌ల్ – బ‌డ్జెట్ లో నిర్మ‌ల‌త్వం ఎంత‌?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఐదోసారి లోక్‌సభకు సమర్పించిన బడ్జెట్‌ లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అనే తీరులో ఉంది.ఆదాయం పన్ను మినహా యింపు పరిమితిని పెంచడం,శ్లాబులను తగ్గించడం వల్ల ఉద్యోగులకు ఇది మేలు చేస్తుందని ప్రభుత్వమే చెబుతోం ది. ఇది అమృతకాల్‌ బడ్జెట్‌ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందిస్తున్నారు. నిజానికి ఈ బడ్జెట్‌లో అమృ తం పులిమిన చేదు గుళికలు ఉన్నాయి. ఉద్యోగులు ఎంతో కాలంగా కోరుతున్న దృష్ట్యా ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని పెంచారు. దాని వల్ల కూడా కొద్ది మందికి మాత్రమే లాభం. అలాగే, ప్రజలకు తిండి, బట్ట, వసతి వంటి నిత్యావసరాల లభ్యతలో రాయితీలు కల్పిస్తే ప్రయోజనం కానీ, టెలివిజన్‌ విడిభాగాలు, కెమెరా లెన్స్‌లపై కస్టమ్స్‌ సుంకం తగ్గింపు వంటి చర్యల వ ల్ల ఎగువ మధ్యతరగతి వర్గాలకే తప్ప దిగువ మధ్య తరగతి వారికి ఏమాత్రం ఉపయోగం లేదు. స్వాతం త్య్రం వచ్చిన తర్వాత మధ్యతరగతి వారికి నిజంగా మేలు జరిగిందంటే అది మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి హయాంలోనే. ఆయన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన జశ్వంత్‌ సింగ్‌ బడ్జెట్‌ని ప్రవేశపెడుతూ మధ్యతరగతి వారి చేతిలో డబ్బు ఉండే ట్టు ప్రతిపాదనలు ప్రవేశపెట్టినట్టు అన్నారు. అది ముమ్మాటికీ నిజం. నిత్యావసర వస్తువుల ధరలు అందు బాటులో ఉంటేనే మధ్యతరగతికి మేలు జరిగినట్టు. వాజ్‌ పేయి హయాంలో నిత్యావసర వస్తువులు అందుబాటు లో ఉండేవి ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు వెండి, బంగారం వస్తువులపై సంపన్నులు తప్ప సామాన్యులు ఎవరూ మోజు ప్రదర్శించడం లేదు. అందువల్ల వాటిపై రాయితీలు ఇవ్వడం వల్ల మధ్యతరగతి వర్గాలకు ఒరిగే ది ఏమీ లేదు.

ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రమే.. మహిళలకు స్వయం సేవా పథకాలకు తగిన నిధులు కేటాయించకుండా పొదుపు పథకాలను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. అసలు మహిళల వద్ద డబ్బుంటేగా పొదుపు చేయడానికి! మధ్య తరగతి ఎక్కువగా వినియోగించే వస్తువులపై సుంకాలు, పన్నులు తగ్గిస్తే వారికి ఊరట లభిస్తుంది. రానున్న ఎన్నిక లను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రతిపాదనలు చేశారు. వాటిలో అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు 5,300 కోట్లు కేటాయిం చారు. కర్నాటకలో త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ కేటాయింపు చేసినట్టు అందరికీ తెలిసిన విషయం. అయితే, ఈ నిధులు అక్కడ ఎన్నికల లోగా విడుదల అవుతాయా అన్నది సందేహమే. ఆంధ్ర ప్రదేశ్‌ విభజన చట్టంలో హామీ ఇచ్చిన ప్రకారం పోలవ రం ప్రాజెక్టును గడువు ప్రకారం పూర్తి చేయడానికి కేంద్రం ఎన్ని ఎత్తులను వేస్తోందో వేరే చెప్పనవసరం లేదు.ఇవే కాదు,ఎన్నికల ప్రాజెక్టులుగా ముద్ర పడిన ప్రాజెక్టులన్నీ దశాబ్దాలుగా పూర్తి కాకపోవడం చూస్తూనే ఉన్నాం. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని 20లక్ష్ల కోట్లకు పెంచినట్టు నిర్మలమ్మ పేర్కొన్నారు.నిజానికి వ్యవసాయ రుణాలు ఏటా పెంచుతూనే ఉన్నారు.అవి కార్పొరేట్‌ రైతులకే దక్కుతున్నాయి. పేద రైతులు సకాలంలో పెట్టుబడి వ్యయం లభించక గిలగిలలాడుతున్నారు. ముఖ్యంగా, బ్యాంకులు ఇచ్చే రుణాలన్నీ పెద్ద రైతులకేన న్నది నిరూపితమైన సత్యం.కోవిడ్‌ సమయంలో ఆకలి లేకుండా చేశామనీ, ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు లేకుం డా చేశామని ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు.నిజానికి చిన్న, లఘు, మధ్యతరగతి (ఎంఎస్‌ఎంఈ)లకు ఇచ్చిన రుణాలన్నీ పెద్ద పారిశ్రామిక వేత్తలకే దక్కాయన్న ఆరోప ణలు వచ్చాయి. ఈ సాయం పంపిణీలో పర్యవేక్షణ లేకపోవడం, బ్యాంకుల నుంచి రుణాలను పొందే విష యంలో చిన్న పారిశ్రామిక వేత్తలకు అనుభవం లేకపో వడం వల్ల వారిని అడ్డుపెట్టుకుని పెద్ద పారిశ్రామిక వేత్తలే లాభ పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నా యి. తన బడ్జెట్‌ని సప్తరుషి బడ్జెట్‌ అని నిర్మలమ్మ అభివ ర్ణించారు. సమ్మిళిత అభివృద్ధి, సమాజంలో చివరి వ్యక్తికి కూడా ప్రయోజనం చేకూర్చడం, మౌలిక సదుపాయాల ను పెంచడం, సామర్ధ్యాలను వెలికితీసి ప్రోత్సహించ డం, యువశక్తిని ప్రోత్సహించడం, హరిత వృద్ధి మొదలై న అంశాలపై దృష్టిని కేంద్రీకరించనున్నట్టు ఆర్థికమంత్రి చెప్పారు. వీటిలో చాలా మటుకు ఇప్పటికే రాష్ట్రాలు అమ లు జేస్తున్నాయి. వాటికి తగిన ప్రోత్సహం లేదని వాపో తున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్షను, సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని ఢిల్లిd ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వంటి ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఆరోపించారు. చైనా, పాక్‌ల నుంచి పెరుగుతు న్న సవాళ్ళను ఎదుర్కొనేందుకు రక్షణ బడ్జెట్‌ను 5.25 లక్షల కోట్ల నుంచి 5.94 లక్షల కోట్లకు పెంచారు. అలాగే, రైల్వేలకు కేటాయింపులను 1.89 లక్షల కోట్ల నుంచి రెండు లక్షల కోట్లకు పెంచారు. ప్రజాపంపిణీ వ్యవస్థను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గ్యాస్‌ సబ్సిడీని పూర్తిగా ఎత్తేసింది. ఈ నేపథ్యంలో నిర్మలమ్మగారి బడ్జెట్‌ మధ్యతరగతికి చేసిన మేలేమిటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement