Friday, November 22, 2024

Editorial – న్యాయం కావాలి…

న్యాయం కోసం సామాన్యులు కోర్టులు చుట్టూ తిరిగి విసుగు చెంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు గురించి విన్నాం, కానీ, సాక్షాత్తూ ఒక మహిళా న్యాయ మూర్తే తనకు న్యాయం జరగడం లేదనీ, చనిపోయేందు కు అనుమతి ఇవ్వమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌కి రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. చట్టసభల్లో మహిళల కు 33 శాతం రిజర్వేన్ల బిల్లును లోక్‌సభ ఆమోదించిన కొద్ది రోజులకే ఇలాంటి లేఖ వెలువడటం దురదృష్టకరం. తనను సీనియర్లు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారం టూ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో తన ఆవేదనను వెలిబుచ్చారు. అవమాన భారం మోయలేక రోజూ చచ్చేకంటే, గౌరవప్రదంగా ఆత్మహ త్య చేసుకోవాలనుకుంటున్నట్టు ఆమె పేర్కొన్నారు. తనకు అనుమతి ఇవ్వాలని సిజెఐ ని కోరారు.

భారత ప్రజాస్వామిక వ్యవస్థలో ఇలాంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆమె ఫిర్యాదుపై దర్యాప్తు ఏ దశలో ఉందో తెలియజేస్తూ ఒక నివేదిక సమర్పించాల్సిందిగా అలహాబాద్‌ హైకోర్టు పాలనా యంత్రాంగాన్ని సీజేఐ ఆదేశించారు. ఆమె ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో పని చేస్తు న్నారు. తాను బారాబంకీలో పని చేసినప్పుడు ఇలాంటి వేధింపులకు గురి అయినట్టు ఆమె ఆ లేఖలో పేర్కొన్నా రు. దేశంలో మహిళ పట్ల పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు సర్వసాధారణమైపోతున్నాయి. ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు అడ్డుకట్ట వేయాలనీ, ఇందుకు తగిన చట్టాలను రూపొందించాలని మహిళా సంఘాలు తరచూ డిమాండ్‌ చేస్తుంటాయి. అయితే, చట్టాలు లేక కాదు, ఉన్న చట్టాలను అమలు జరిపే చిత్తశుద్ధి, సంక ల్పం పాలకుల్లో లేకపోవడంవల్లనే ఇలాంటి ఘటనలు తామర తంపరగా చోటు చేసుకుంటున్నాయి. సాటి ఉద్యోగినులను చూడగానే వెకిలి నవ్వులు, ఉద్దేశ్యపూర్వ కంగా తాకడం వంటి చేష్టలకు పాల్పడుతున్న వారిపై మొగ్గను తుంచినట్టు ఆదిలోనే కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట పడి ఉండేది. ఇలాంటి ఘటనలను తేలికగా తీసుకోవడం వల్లనే అడ్డూ, అదుపూ లేకుండా జరుగుతున్నాయి. సినిమాల్లో, సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఘటనలు చూసి మరీ పురుషు లు రెచ్చిపోతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి.

గౌరవ ప్రదమైన కుటుంబాలకు చెందిన మహిళలు సహో ద్యోగులు తమను వేధించిన సంఘటనలపై ఫిర్యాదులు చేయకుండా తలొంచుకునిపోతుండటంవల్ల కూడా ఇవి పెరిగిపోతున్నాయి. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారి పై శిక్షలు అమలు జరగకుండా రాజకీయ నాయకులు వత్తాసు పలుకుతుంటారు. రాజకీయ జోక్యం పెరగడం వల్లనే నేరాల అదుపు సాధ్యం కావడం లేదని పోలీసులు, శిక్షలు అమలు జరపాల్సిన వారూ ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తూ ఉంటారు. చట్టాలు చేసే ప్రజాప్రతినిధులే ఆ చట్టాల అమలుకు మోకాలడ్డుతుంటే, ఇక వాటి ప్రయో జనం ఏమిటని సమాజ హితైషులు ప్రశ్నిస్తున్నారు. అలాగే, పిల్లలు చేసిన నేరానికి తల్లిదండ్రులను శిక్షించడం న్యాయమేమిటని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల కర్నాటకలో బెళగావి జిల్లాలో కాకతి పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన సంఘటన సభ్యసమాజం తలదించు కునేలా ఉంది. పెళ్ళికి నిశ్చితార్థమైన ఒక యువతిని ఒక యువకుడు అపహరించుకుని పోగా, అతడి తల్లిని పోలీసులు వివస్త్రను చేసి ఊరేగించడం, జైలులో ఉంచ డంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. అయినా పోలీసుల చర్యను ఖండించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం సమాజం ఎటుపోతోందోనన్న సందేహాలను సమాజ హితైషులు వ్యక్తం చేస్తున్నారు. పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులకు పోలీసుల అడుగులకు మడుగులొత్తడం కూడా సర్వసాధారణ మైంది.ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎవరితో చెప్పుకోలేక బాధిత మహిళ లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి.

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో మహిళా జడ్జి చదువుకున్న మహిళ కనుక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. మూగ వేదనను అనుభవిస్తున్న మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా, సంస్కరణలను తెచ్చినా, సమాజంలో మహిళలు ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నా, వారికి లైంగిక వేధింపులు తప్పడం లేదనడానికి ఉత్తరప్రదేశ్‌ సంఘటన తాజా ఉదాహరణ. జాతీయ మహిళా కమిష న్‌ వంటి సంస్థలు స్పందించి దీనిపై ఆందోళన చేపట్టాలి. దేశంలో మహిళా సంఘాలను జాగృతం చేయడానికి, దేశ వ్యాప్తంగా ఉద్యమాలను నిర్మించడానికి పూనుకోవా లి. మహిళలను గౌరవించే సమాజమే వృద్ధి చెందుతుం దన్న ఆర్యోక్తిని గౌరవిద్దాం. న్యాయమూర్తులకు సమాజం గౌరవం ఇవ్వాలన్నది ఈ సంఘటనతో మరింత బలంగా రుజువు అవుతోంది. మహిళలైనా, పురుషులైనా న్యాయమూర్తి పదవుల్లో ఉన్నవారు తమ హోదాకు తగ్గట్టుగా వ్యవహరిస్తే గొడవలుండవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement