Saturday, November 23, 2024

Editorial – స‌మాజంలో మేధావులకు చోటేది…

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌పై కేసు నమోదు చేయ డం సమాజంలో మేధావులు, విద్యావంతులు, సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించేవారిని ఆశ్చర్యపర్చింది. ఆయనపై మోపిన అభియోగాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. వరంగల్‌ జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో పోలీసులు జరిపిన కూంబింగ్‌లో మావోయిస్టులు పారిపోగా, అక్కడ దొరికిన పత్రాల్లో హరగోపాల్‌ పేరుం దని అభియోగం. వెంటనే తాడ్వాయి పోలీసులు ఏడాది క్రితమే కేసు పెట్టినా అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. హరగోపాల్‌తోపాటు152మంది పేర్లు ఉన్నాయి. వీరిలో పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ మూవ్‌ మెంట్‌ అధ్యక్షుడు చంద్రమౌళిపై రెండు నెలల క్రితం కేసు నమోదు అయిం ది. ఇప్పుడు హరగోపాల్‌ పేరు బయటికి వచ్చింది.

ప్రొఫెసర్‌ వరవరరావు, సాయిబాబా, ప్రమీలా నరసింగి, సుధాభరధ్వాజ, స్టాన్లీ స్వామి తదితర మేధావులు, కవులపైకూడా ఇదే మాదిరి కేసులు పెట్టారు. వీరిలో స్టాన్లీ స్వామి జైలులోనే మరణించారు. వీరిపై సరైన ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టారు. కోర్టుల చుట్టూ తిప్పి వరవరరావును ఈ మధ్య విడుదల చేశారు. హర గోపాల్‌ సమాజంలో గౌరవప్రదమైన అధ్యాపకవృత్తిలో ఉన్నారు. అధ్యాపక వృత్తిలో ఉంటూనే సమాజంలో పరిస్థితుల గురించి తరచూ విశ్లేషిస్తుంటారు.అది మేధావుల లక్షణం. సమాజాన్ని గురించి మేధావుల పట్టించుకోకపోతే మరిఎవరు పట్టించుకుంటారు. సమాజంలో మార్పులపై మేధావులు తరచూ తమ అభి ప్రాయాలను వార్తాప్రసార సాధనాల ద్వారా తెలియజే స్తుంటారు. వారికి ఉద్దేశ్యాలనూ, ఇజాలను అంటగట్ట డం న్యాయం కాదు. వామపక్ష తీవ్రవాదులతో సంబం ధాలున్నాయని అరెస్టులు చేయడం మొదలు పెడితే సమాజంలో మేధావులు ఎవరూమిగలరు. ఇప్పటికే మేధావులు ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటు న్నారు. ఇప్పుడు చట్ట సభలకు ఎన్నికవుతున్న వారిలో మేధావుల సంఖ్య చాలా తక్కువ. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో లాయర్లు, డాక్టర్లు, విద్యావంతులు రాజకీ యాల్లో ప్రముఖ పాత్ర వహించేవారు.

ఇప్పుడు అలాంటి వారంతా రాజకీయాలకు దూరంగా ఉండ టమే కాకుండా, సమాజంలో జరిగే పరిణామాలను గురించి పట్టించుకోకుండా మనకెందుకు లెమ్మనమని ఊరుకుంటున్నారు. చట్టాలను రూపొందించే చట్టసభ ల్లో మేధావుల కొరత ఉండటం వల్లనే చట్టాల్లో లొసుగు లు ఉంటున్నాయన్నది జనాభిప్రాయం. ముఖ్యంగా, హింస, దౌర్జన్య కాండలకు సంబంధించిన ఘటనల్లో అసలైన నిందితులకు శిక్ష పడకుండా వారు తప్పించు కోగలుగుతున్నారనీ, ఇందుకు కారణం చట్టాల్లో లొసుగులేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఇది అసత్యం కాదు. చట్టాల్లో లొసుగులను ఎత్తి చూపే విద్యావంతులు,మేధావులు జరిపే విశ్లేషణ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది.అయితే, ఇప్పుడు విశ్లేషణ ను కూడా ప్రభుత్వంపై ధిక్కారంగా పరిగణించే రోజులొ చ్చాయి. అధ్యాపక వృత్తిని వదిలి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమంలో చేరారు. వారిలోకొందరు వయో భారంతో ఇప్పుడు క్రియాశీలంగా వ్యవహరించక పోవచ్చు కానీ, వారి భావాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నా యి.

- Advertisement -

అటువంటి కోవకు చెందిన వారే ప్రొఫెసర్‌ హర గోపాల్‌. ఆయన కేంద్ర విశ్వవిద్యాలయం,విదేశీ విశ్వ విద్యాలయం, ఇంకా పేరెన్నికగన్న ప్రైవేటు విశ్వవిద్యాల యాల్లో ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఇప్పటికీ విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యూనివర్సిటీలలోనే గౌరవ అధ్యాపకత్వం వహిస్తున్న ఆయనపై మావోయిస్టు సన్నిహితుడన్న కేసు పెట్టడానికి పోలీసులకు చిక్కిన ఆధారాలేమిటి? తాడ్వాయి పోలీసులకు దొరికిన మావోయిస్టుల సాహిత్యం, పుస్తకాల్లో ఆయన పేరుం దని కేసు పెట్టామంటున్నారు. స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది మేధావులు, వీరులు పాల్గొన్నారు. వారి పేర్లు పుస్తకాల్లో లిఖితమై ఉన్నాయి. వారిపై బ్రిటిష్‌ వారు కేసులు పెట్టలేదు.స్వతంత్ర భారత దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉపయోగించుకోవడం కూడా నేరమైతే, ఇంక రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రాధాన్యత ఏముంది? మన ప్రాథమిక హక్కుల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. వాటిలో వేటికైనా రక్షణ ఉందా? అని ప్రశ్నించుకుంటే, లేదని చెప్పుకోవచ్చు. అయితే, ఆ విషయాన్ని బహిరంగంగా కాకుండా, మనలో మనం నసుగుతూ చెప్పుకుంటు న్నాం. స్వతంత్య్రభారత దేశంలో పౌరులకు ఇలాంటి పరిస్థితి వస్తుందని రాజ్యంగ రచయితలు ఊహించి ఉండరు. ఇంతకీ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మోపిన అభియోగాలేమిటో వెల్లడి కాలేదు. అలాంటి సాత్వికు డు, మృదుభాషి అయిన విద్యావంతునికే ఇలాంటి కష్టాలు తప్పనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏమిటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement