Tuesday, November 26, 2024

ఎడిటోరియ‌ల్ – బిబిసిపై నిషేధ‌మా?

బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ (బీబీసీ) ప్రతిష్టాత్మకమై న ప్రసారాల సంస్థ. ఆ సంస్థ చేసే ప్రసారాలు విశ్వసనీ యమైనవనీ, నమ్మదగినవని ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారు. అటువంటి సంస్థ కార్యకలాపాలను భారత్‌లో పూర్తిగా నిషేధించాలనికోరడం సమంజసం కాదు. అందుకే, హిందూసేన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇరవై ఏళ్ళ క్రితం గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఘటనలపై బీబీసీ డాక్యుమెంటరీని రూపొం దించింది. అది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ ఫిర్యాదులు రావడంతో ఆ డాక్యు మెంటరీ ప్రదర్శనను కేంద్రం నిషేధించింది.దానిపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది.అది వేరే విష యం. ఒక ప్రత్యేక కార్యక్రమంపై నిషేధం విధించాలని కోరడం వేరు, అసలు ఆ సంస్థ ప్రసారాలనే నిషేధించాల ని కోరడం వేరు. ఈ తేడాను సుప్రీంకోర్టు తీర్పు గుర్తు చేసి నట్టు అయింది. ప్రపంచ వ్యాప్తంగా బీబీసీకి ఉన్న ప్రాము ఖ్యత, గుర్తింపును దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

నిజానికి ఇది మతంతో సంబం ధం ఉన్న డాక్యుమెంటరీ కానే కాదు. ఆనాటి ఘటనల గురించి నేటి తరం వారికి గుర్తు చేయడమే ఆ సంస్థ ఉద్దే శ్యం కావచ్చు.అయితే,జస్టిస్‌ సంజయ్‌ ఖన్నా, జస్టిస్‌ సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ వాదన పూర్తిగా అసంబద్ధమని స్పష్టం చేస్తూ,ఇలాంటి పిటిషన్‌ ల వల్ల కోర్టు సమయం వృధా అవుతోందని పేర్కొంది. ఇలాంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు అసహనాన్ని వ్యక్తం చేయడం ఇదిమొదటి సారి కాదు.ప్రజాప్రయోజనం లేని అంశాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌) దాఖలు చేయడం ఈ మధ్య అలవాటైందని ఆ మధ్య సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు పిటిషనర్‌ని మంద లించడమే కాకుండా పిటిషనర్‌కి జరిమానా కూడా విధించారు. అయితే, ఈ ప్రత్యేక పిటిషన్‌లో ప్రధాన మంత్రి ప్రస్తావన ఉండటం,గతంలోఆయన నిర్వహిం చిన పదవి కాలంలో జరిగిన సంఘటనల గురించి ప్రస్తా వించడం వల్ల వివరాలను తెలియజేయాల్సిందిగా కేంద్రానికి కోర్టు నోటీసులు ఇచ్చింది.మోడీ-ద క్వెశ్చన్‌ పేరుతో తీసిన ఈ డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిషేధించ డంపై కోర్టు స్పందించి ఈ నోటీసులు జారీ చేసింది.మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఘటనలను ఇప్పుడు గుర్తు చేయడం ఎందుకని ప్రభుత్వం భావించి ఉండవచ్చు.గుజరాత్‌ అల్లర్ల గురించి ఇప్పుడు కొత్తగా చూపించేందుకు ఏమీ లేద ని భావించవచ్చు.పాత విషయాలను తవ్వుకోవడం వల్ల సమాజంలో మళ్ళీ కలహాలు,ఘర్షణలు జరుగుతా యన్న అనుమానంతోనే నిషేధించి ఉండవచ్చు. విష్ణు గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌లో బీబీసీ ప్రసారాలను నిలిపి వేయాలని ఆదేశించమనడం సమంజసంగా లేదు కనుకనే ఆయన పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించి ఉండవచ్చు. మనదేశంలో వాక్‌ స్వేచ్చ,భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన ఈ స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంది, కనుకనే గుప్తా పిటిషన్ను కొట్టి వేసి ఉండవచ్చు.
ఈ డాక్యుమెంటరీని బ్లాక్‌ చేయడంతో పాటు సామాజిక మాధ్యమాల నుంచి లింక్‌లను తీసివేసేందుకు అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని జర్నలిస్టు రామ్‌, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌,తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మోయిత్రాలు తమ పిటిషన్‌లలో సవాల్‌ చేశారు. మోయిత్రా తదితరులు ఈ నిషేధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు.అయితే, సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తూనే పిటిషనర్లు బయట ప్రదర్శనలు నిర్వ హించడం ఎంత వరకూ సమంజసమన్న ప్రశ్న ఉత్పన్న మవుతోంది. ప్రధానమంత్రి మోడీ తీసుకుంటున్న ఇతర నిర్ణయాలను వ్యతిరేకించే వారు ఆనాటి ఘటనలపై లఘు చిత్రాన్ని తీసినందుకు బీబీసీ ప్రసారాలను పూర్తిగా నిషేధించాలనడం సమంజసం కాదు.బీబీసీ ప్రసారాలపై ఆధారపడిన వారు, వాటిని ప్రామాణికంగా తీసుకునే వారు మన దేశంలోచాలా మందిఉన్నారు.అలనాడు ఎమర్జెన్సీలో వార్తలపై నియంత్రణ ఉన్నప్పుడు ఎక్కువ గా బీబీసీపైనే ఆధారపడే వారు.మిగిలిన సంక్షోభాల సమయంలో కూడా భారత్‌లో ప్రసారం కాని వార్తలను బీబీసీ ద్వారా వినే వారు. బీబీసీపై భారతీయులకు గల విశ్వసనీయతకు ఇది నిదర్శనం.ఒక వేళ తొందరపడి బీబీసీ ప్రసారాలను మొత్తంగా నిషేధిస్తే బ్రిటన్‌లో మన వార్తా ప్రసారాలను నిషేధించే ప్రమాదం ఉంది.అప్పుడు యావత్‌ ప్రపంచంముందు మన దేశంపై వ్యతిరేక ప్రచా రం జరిగే ప్రమాదం ఉంది.ప్రజాస్వామ్యంపై మచ్చ పడే ప్రమాదమూ ఉంది.అన్నింటి కన్నా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది.అందువల్ల ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేయడం సబబే.

Advertisement

తాజా వార్తలు

Advertisement