Tuesday, November 19, 2024

ఎడిటోరియ‌ల్ – నితీష్ … ఇది అన్యాయం…..

ఆనంద మోహన్‌ సింగ్‌… బీహార్‌లో మాఫియా ముఠా నాయకుడు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల కాల్పుల్లో మరణించిన అతీఖ్‌వంటి వాడే. అతడికి రాజ కీయ వర్గా ల్లో మంచి పలుకుబడి ఉంది. దేశంలో ఇలాంటి వారిని పెంచి పోషించే ప్రభుత్వాలు ఉండటం వల్లనే ఇలాంటి ముఠా నాయకులు చెలరేగిపోతున్నారు. దాదాపు 20 ఏళ్ళ క్రితం నాటి హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆనందమోహన్‌ని బీహార్‌ ప్రభుత్వం ఇటీవల జైలు నుంచి విడుదల చేసింది. ఎక్కువ కాలం జైలు శిక్షను అనుభవించిన వారిని విడుదల చేసేందుకుఉద్దేశించిన నియమ నిబంధనలు ఇలాంటి వారికి వర్తించవు. ఇది క్షమాభిక్ష సూత్రాలకు వ్యతిరేకం. విధి నిర్వహణలో ఉన్న అధికారులను హత్య చేసిన వారికి ఈ నిబంధన వర్తించ దన్న నిబంధన ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఆ రూల్స్‌ను సడలించడం వల్ల ఆనందమోహన్‌ విడుదలకు వీలు కలిగింది. ఆనంద మోహన్‌ బీహార్‌లో బలాధిక్యత కలిగిన తోమార్‌ రాజ్‌పుట్‌ వర్గానికి చెందిన వాడు. చిన్నప్పటి నుంచి సొంత ముఠాను ఏర్పాటు చేసుకుని హత్యలు, దోపిడీలను ప్రోత్సహించేవాడు. అతడికి మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. లాలూకి ఆనంద మోహన్‌ ఒక్కడే కాదు, సయ్యద్‌ షహబుద్దీన్‌, పప్పూ యాదవ్‌వంటి ముఠా నాయకులతో సంబంధాలున్నా యి.

ఆనందమోహన్‌ సింగ్‌ గోపాల్‌ గంజ్‌ జిల్లాలో తన మాటను నెగ్గించుకునేవాడు.ఆ జిల్లాకు ఏ అధికారి వచ్చినా అతడు చెప్పినట్టు వినాల్సిందే. ఆ జిల్లా కలెక్టర్‌ (జిల్లా మేజస్ట్రేట్‌)గా వచ్చిన జి.కృష్ణయ్య స్వతంత్ర భావాలు కలవాడు. దళిత సామాజిక వర్గానికి చెందిన కృష్ణయ్య ప్రభుత్వ పథకాల్లో ఒక్క రూపాయి కూడా ఇతరుల జేబుల్లోకి వెళ్ళకుండా నిర్దేశిత వర్గాలకే చేరాల న్న అంకితభావమున్న అధికారి. ఆయన ఎవరి మాటా వినేవాడు కాడు. ఆనందమోహన్‌ గద్దింపులనూ, హూంకరింపులనూ అతడు లెక్క చేయలేదు. ఆయన అడ్డు తొలగించుకునేందుకు ఆనంద మోహన్‌ తన ముఠాను పురికొల్పి కృష్ణయ్యను 1994లో హత్య చేయించాడు. అతడి మనుషులు ఎంత క్రూరమైన వారంటే, కృష్ణయ్యను జీపులోంచి లాగి అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటనపై అప్పట్లో జాతీయ స్థాయిలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఆనందమోహన్‌ భార్య లవ్లీ సింగ్‌ కూడా ముఠా కార్యకలాపాల్లో పాల్గొనేవారు. ఆనందమోహన్‌కి కింది కోర్టులో మరణశిక్ష పడితే, అతడు హైకోర్టుకు అప్పీలు చేశాడు. అతడికి హైకోర్టు యావజ్జీవ ఖైదుగా శిక్షగా మార్చింది. బీహార్‌ రాజకీయాల్లో అప్పట్లో లాలూ ప్రత్యర్ధి అయిన జేడీయూ నాయకుడు నితీశ్‌ కుమార్‌ మొదట్లో ఇలాంటి ముఠాల కార్యకలాపాలను వ్యతిరేకిం చినా, తర్వాత రాజకీయంగా లాలూకి దగ్గరైనప్పుడు ఈ ముఠాల ఒత్తిళ్ళకు లొంగేవాడు. ప్రస్తుతం లాలూ కుమారుడు తేజస్వి యాదవ్‌ నితీశ్‌ కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతడి ఒత్తిడి మీద జైలు నిబంధనల్లో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మార్పులు చేశారు.

బీహార్‌లో నేరస్థుల ముఠాలే కాకుండా ముస్లిం లు అధిక సంఖ్యలో ఉన్నారు. నితీష్‌ కుమార్‌ ఎప్పటిక ప్పుడు వ్యూహాలు మార్చడంలో దిట్ట. సమయాను కూలంగా ఒత్తిడులకు తలొగ్గుతూ ఉంటారని బీజేపీ నాయకులు తరచూ ఆరోపిస్తూంటారు. బీజేపీతో నితీశ్‌ తెగతెంపులు చేసుకోవడానికి అదీ ఒక కారణం. రాష్ట్ర రాజకీయాల్లో నేరస్థుల హవా చెల్లుబాటు అవుతోంది. ఆనంద మోహన్‌ భార్య లవ్లీసింగ్‌, కుమారుడు అంద రూ ఎమ్మెల్యే పదవుల్లో ఉన్న వారే. ఆనందమోహన్‌ కోసం నిబంధనలను మార్చడాన్ని రాష్ట్రంలో అన్ని వర్గాలూ వ్యతిరేకించాయి. గురువారం నాడు ఆనంద మోహన్‌ విడుదలైనప్పుడు ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్య భార్య, కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని వాపోయారు. సుప్రీంకోర్టుకు అప్పీలు చేయమని బీజేపీ నాయకులు ఆమెకు సలహా ఇచ్చారు.

కృష్ణయ్య తెలంగాణలో మహ బూబ్‌నగర్‌ జిల్లాకి చెందిన వారు. తండ్రి వ్యవసాయ కూలీ. అట్టడుగు కుటుంబం నుంచి పైకి వచ్చిన కృష్ణయ్య హత్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ముక్కుసూటిగా వ్యవహరించడం వల్లనే కృష్ణయ్యను ఆనందమోహన్‌ సింగ్‌ ముఠా హత్య చేసింది. జిల్లా మేజస్ట్రేట్‌ హోదాలో ఉన్న అధికారికే రక్షణ లదని, బీహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. నితీశ్‌ కుమార్‌ ఈ పరిస్థితిని మారు స్తానని ప్రకటనలు చేసినా, అక్కడి రాజకీయ వ్యవస్థలో ముఠాలదేపై చేయి కావడం వల్ల ఆయన కూడా ఆ సుడిగుండంలో పడిపోయారు. నితీశ్‌కుమార్‌ ఆర్‌జేడీ నాయకుల ఒత్తిళ్ల లొంగిపోయి జైలు నిబంధనలను సవరించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఉండచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement