ఇది భారతీయుల విక్రమమే… ఇస్రో సాహసకార్యమే. ఒక విజయం ఇచ్చే స్ఫూర్తి అనంత మైతే.. వెయ్యి విజయాలు ఒక్కటై చంద్రయాన్ -3 రూపంలో వరిస్తే ఆ ఉద్వేగానికి ఏమని పేరుపెట్టాలి! సరిగ్గా ఈ ద్వైదీమాన చేతనావస్థలో భారతదేశం ఉబ్బితబ్బిబ్బవతూ నిండు ప్రపంచం ముందు విజయగర్వంతో నిలబడి ఉంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇది అపూర్వ విజయం. యావత్ ప్రపంచాన్ని కొద్ది నిమిషాల సేపు ఉత్కంఠలో ముంచి తేల్చిన ఇస్రో విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా చంద్రుణ్ణి మనిషికి మరింత దగ్గరగా చేర్చింది. జాబిలి ఒడిలో భారత్ చేరింది. మున్ముందు భారత్ చేతిలో జాబిలి ఒదిగిపోయుంది. చంద్రుని రహస్యాల తోపాటు చంద్రుని లోగుట్టు, అంతర్భాగంలోని అంతర్మథనాన్ని ఛేదించి జాబిలిపై సాధికారితను సాధించేందుకు విక్రమ్ వేసే అడుగులే కీలకం కాబోతున్నాయి. ఇదంతా సఫ లమై భారతదేశానికి రెండు భూమండలాలు సిద్ధిస్తే ఆశ్ఛర్యపోనవసరం లేదు.
చంద్రయాన్ -3 విజయంతో భారతకీర్తి ఆచంద్ర తారార్కం నిలిచిపోతుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశ ప్రతిష్ఠను దిగంతాలకు వ్యాపింపజేసింది. ఇస్రో ఇంతవరకూ సాధించిన విజయాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇస్రో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ అనుకున్న సమయానికి కాలు మోపడం మరో ఎత్తు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ప్రపంచంలో అగ్రదేశాల సరసన భారత్‌కు తిరుగులేని స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఈ ఘనవిజయం సాధించడంలో ఇస్రో శాస్త్రజ్ఞులకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ స్ఫూర్తిగా నిలి చారనడంలో అతిశయోక్తి లేదు. చంద్రయాన్-2 వైఫల్యం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో చంద్రయాన్-3 విజయవం తం కావడానికి ఇస్రో శాస్త్రజ్ఞులు రేయింబవళ్ళు కృషి చేశారు. చంద్రయాన్-3 ల్యాండింగ్‌కి అనువుగా, విస్తీర్ణం ఎక్కువగా ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేశారు.
చంద్రయాన్ సక్సెస్‌పై భారత్‌ని ప్రపంచ దేశాలు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఇంతవరకూ చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద కు ఏ దేశమూ అడుగుపెట్టలేదు. అమెరికా, చైనా, రష్యాలు ప్రయత్నించాయి. కానీ, భారత్ మాదిరిగా విజయాన్ని అందుకోలేకపోయాయి. విక్రమ్ ల్యాండర్‌ను లోపరహితం గా తీర్చిదిద్దడాన్ని ఇస్రో శాస్త్రజ్ఞులు ఒక సవాల్‌గా తీసుకున్నారు. కసితో పనిచేశారు. చంద్రయాన్ 2 విఫలమైనప్పుడు ఇస్రో ఆనాటి చైర్మన్ శివన్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓదార్చారు. చంద్రయాన్-3 ప్రయోగం లో ఇస్రో తప్పక విజయాన్ని సాధిస్తుందన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. అదే ఇస్రో సిబ్బందికి ఇంధనమైంది. ఉత్ప్రేరకం అయింది. ఇప్పుడది నిజమైంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా రాజధాని జోహన్నెస్‌బర్గ్ పర్యటనలో ఉన్న మోడీ చంద్రయాన్ ల్యాండింగ్ ప్రక్రియను వర్చువల్‌గా వీక్షించారు. ఇస్రో ప్రస్తుత చైర్మన్ సోమనాథ్‌ను అభినందించారు.
ఇది భారత్ విజయమే కాదు, మానవాళి అందరిదీనని ఆయన అన్నారు. చంద్రయాన్ చారిత్రక విజయంతో తన జీవితం ధన్యం అయిందని అంటూ ఉప్పొంగిపోయారు. ఈ అపూర్వమైన విజయానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట లాంచింగ్ పాడ్ కావడం తెలుగువారందరికీ గర్వకారణమ న్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటల్లో అతిశయోక్తి లేదు. చంద్రయాన్-2 వైఫల్యానికి కారణమైన ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించి మళ్ళీ అలాంటి లోపాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంది. ఇంజన్లకు అదనపు సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలను జోడించారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై అలా అడుగుపెట్టగానే ఇస్రో శాస్త్రజ్ఞుల కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జలజల రాలాయి. తమ కళ్లముందు ప్రాణం పోసుకున్న బిడ నడుస్తున్నట్టే అనుభూతి చెందారు. తమ కృషి ఫలించినందుకు వారిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది.
సేఫ్ ల్యాండింగ్ తర్వాత ఇస్రో శాస్త్రజ్ఞులు చప్పట్లు కొడుతూ చిన్న పిల్లల మాదిరిగా ఆనందాన్ని పంచుకున్నారు. చంద్రునిపై అడుగిడేందుకు ఇస్రో రూపొందించిన ప్రణాళిక సజావుగా సాగిందనీ,ఎందుకయినా మంచిదని ప్రత్యామ్నాయంగా రూపొందిం చిన ప్లాన్-బీ అవసరం లేకుండా అంతా సవ్యంగా సాగిపోయిందంటూ ఇస్రో శాస్త్రజ్ఞులు ఆనందంతో ప్రకటించారు. పరిస్థితి అనుకూలంగా లేకపోతే విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయాలనుకున్నారు. ఆ అవసరం లేకుండా తొలుత రూపొందించిన ప్రణాళిక ప్రకారం విక్రమ్ సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ప ట్టరాని ఆనందాన్ని పత్రికల వారితో పంచుకున్నారు. విక్రమ్ ల్యాండింగ్ విజయవంతం కావాలని దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ మతాల వారు తమ సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. దీనిని బట్టి జాతి, మత, కుల, ప్రాంత బేధం లేకుండా దేశ ప్రజలు యావ న్మంది విక్రమ్ ల్యాండింగ్ విజయవంతం కావాలని కోరుకున్నట్టు స్పష్టం అవుతోంది.
అంతరిక్ష పరిశోధనా కార్యక్రమానికి ప్రత్యేకతను సాధించింది మానవులేనని జర్మనీలోని యూరోపియన్ స్పేస్ సెంటర్ పేర్కొనడం భారత్‌కి గర్వకారణం. ప్రాచీన కాలం నుంచి అంతరిక్షం పై భారతీయ శాస్త్రజ్ఞుల పట్టు అసామాన్యమైనది. ఖ గోళ శాస్త్రానికి పుట్టినిల్లు భారత్. భారత్ నుంచి జర్మనీ, తదితర దేశాలు ఖగోళ రహస్యాలను తెలుసుకున్నారు. ఇప్పుడు జరుపుతున్న అంతరిక్ష ప్రయోగాలకు మూలమైన శాస్త్ర విజ్ఞానమంతా మన ఖగోళ శాస్త్రాల్లో నిబిడీకృతమై ఉంది. ఇతర దేశాలు జరుపుతున్న ఖగోళ శాస్త్ర పరిశోధన లన్నింటికీ వరహమిహురుని బృహత్ సంహితలో చంద్ర, సూర్య గ్రహణాల గురించి వివ రించాడు. చంద్రుని ఉపరితలంపై ఇప్పుడు జరుపుతున్న ప్రయోగాలన్నీ బృహత్ సంహిత లో పేర్కొన్న అం శాల ఆధారంగానే సాగుతున్నాయి. చంద్రునికి మనిషికి ఉండే సంబంధం గురించి కూడా ఆ గ్రంథంలో వివరించాడు.
పాశ్చాత్యులు మన పూర్వకవుల గ్రంథాలను పట్టుకుని పోయినట్టు మన పెద్దలు చెబుతూ ఉంటారు. వాటి ఆధారంగానే గ్రహాలపై పరిశోధనలు జరుపుతున్నారు. ముఖ్యంగా చంద్రుడు, అంగారక గ్రహాలపై ప్రయోగాలన్నీ మన ప్రాచీన రుషుల గ్రంథాల్లోని నిక్షిప్తమై ఉన్న అంశాల ఆధారంగానే సాగుతున్నాయి. అందువల్ల చంద్రునిపై ప్రయోగాల్లో ఇప్పుడు, విక్రమ్ ల్యాండింగ్ మన దేశానికి కీర్తి తెచ్చింది. కానీ, ఖగోళ శాస్త్రపరంగా మొదటి నుంచి మనదేశమే తన ఆధిక్యతను చాటు కుంటున్నది. పౌర్ణమినాడు చంద్రుని కాంతిలో పాలు సేవిస్తే దీర్ఘకాలిక రోగాలు నయమ వుతాయనే నమ్మకం మన వారిలో ఉంది. చంద్రుడు చల్లదనాన్నిఇచ్చి మన లను చల్లబరు స్తాడు. చంద్రుని రహస్యాలు తెలుసుకోవడానికి విక్రమ్ ల్యాండింగ్, రోవర్ ప్రజ్ఞాన్ పరిశోధ న దోహదం చేయగలదని ఆశిద్దాం.