పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత నాలుగు రోజులుగా ఒక్క గంట కూడా చర్చ జరగకుండా రోజూ వాయిదా పడుతుండటానికి అసలు కారణం ప్రతిపక్షాలు ప్రస్తావించే వ్యక్తిగత అంశాలు లేదా ఆయా పార్టీలు లేవనెత్తే సమస్యలు కావు. దేశంలో కోట్లాది పిల్లలకు ఆహార మైన పాలపై వస్తు, సేవా పన్ను (జీఎస్టీ)ని విధించినందుకు నిరసన తెలపడానికే ఎంపీ లు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద భైఠాయింపు చేస్తున్నారు. పాల ప్యాకట్లపై జిఎస్టీని విధించడా న్ని దేశంలో ప్రతిపక్షాలే కాకుండా, ఏ పార్టీకీ చెందని వారు సైతం విమర్శిస్తున్నారు. జీఎస్టీ మండలి 24వ సమావేశంలో పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. జున్ను పాలు, ప్యాక్ చేసిన పెరుగు మొదలైన ఉత్పత్తులపై కూడా పన్ను విధించాలని నిర్ణయించింది. దేశంలో ప్రస్తుతం పాలకొరత లేదు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు శ్వేత విప్లవం ఎంతో విజయవంతం అయింది. తిండి లేకపోయినా పాలు, మజ్జిగ ఏది లభిస్తే అది తాగి కడుపు నింపుకునే వారు దేశంలో కోట్లలో ఉన్నారు. పాలలో నీళ్ళు కలిపి అమ్ముకుని కోట్లు గడిస్తున్న వారు, పాలు దాచి పెట్టి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న వారు ఉన్న మాట నిజమే కానీ, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
పాల కల్తీ విషయంలో చర్యలు తీసుకోవల్సిన ప్రభుత్వ,పురపాలక ఆరోగ్య విభాగాల వారు చూసీ చూడనట్టుగా వ్యవహరించడం వల్ల ప్రజలకు నాణ్యమైన పాలు లభించడం లేదు. అందుకోసం ప్యాకెట్లలో పాలు సరఫరా చేసే పద్దతిని ప్రవేశపెట్టారు. అయితే, ఈ ప్యాకెట్ల పాలులోనూ కల్తీ జరుగుతోంది. ఈ వ్యాపారంలోకి పెద్ద సంస్థలు కూడాప్రవేశించాయి.ఆ సంస్థల వ్యాపారాలు భారీగా జరుగుతున్న దృష్ట్యా వాటి పై జీఎస్టీ విధిస్తే ఎక్కువ రాబడి రావచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమై ఉండవచ్చు. పార్లమెంటు వర్షాకాల సమావే శాల ప్రారంభం రోజునే ఈ కొత్త పన్ను అమలులోకి వచ్చి నందున ప్రతిపక్షాలు దీనిని ప్రధాన అస్త్రంగా చేసుకున్నాయి. జీఎస్టీ పై పన్ను, పన్ను రేట్ల పెంపు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. సామాన్యులు వినియోగించే వస్తువులపై తక్కువ రేట్లు విధించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వి షయమై పార్లమెంటులోనూ, వెలుపలా ప్రతిపక్షాలు ఆందోళనలు సాగించాయి. ఇప్పటికీ సాగి స్తున్నాయి. కానీ, ప్రభుత్వం ప్రజల మొర ను ఆలకించడం లేదు.
దేశమంతటా ఒకే పన్ను విధానం అమలు జేయడం కోసం జీఎస్టీని ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వం తరచూ ఊదరగొడుతూ ఉంటుంది. అయితే, దీనిలోని లోపాల ను సరిదిద్దేందుకు మాత్రం వెనకాడుతోంది.జీఎస్టీ వచ్చిన తర్వాత నెలవారీగా జీఎస్టీ ఆదాయాన్ని ప్రభుత్వం వెల్లడిస్తోంది. జీఎస్టీ ద్వారా పన్ను రాబడి పెరిగిందని ఆర్థిక మంత్రి తరచూ ప్రకటిస్తూ ఉన్నారు.అది అసత్యం కాదు. నెలకు లక్షా నలభైవేల కోట్ల రూపాయిలు పైనే వసూళ్ళు జరుగుతున్న మాట నిజమే. అయితే,పన్ను అనేది సంపన్నులపైనా, ఉన్నత ఆదాయ వర్గాలపైనా విధించాలన్నది ప్రాథమిక సూత్రం,అసలు సమాజంలో ఏ వర్గం పైనా పన్ను విధించకుండా పాలన సాగిస్తే అది ఆదర్శవంతమైన పాలన అవుతుంది. కానీ ,ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఆదర్శ పాలనను ఆశించడం అత్యాశే అవుతుంది. భారాన్ని మోపేటప్పుడు కూడా మధ్యతరగతి, సామాన్యుల కష్టనష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే వంటగ్యాస్ సిలిండర్ ధరను ఈ ఏడాదిలో పదిపదిహేను సార్లు పెంచారు. ఎల్‌ఈడీ లైట్లపై గతంలో పన్ను లేదు. వాటిపై ఇప్పుడు 18 శాతం విధించారు. ఎల్‌ఈడీ లైట్లను వినియోగించా లని ఒక వంక ప్రభుత్వమే ప్రజలకు సలహాఇస్తోంది.
ఆ లైట్లపై పన్ను విధించడం ఆ లైట్ల వినియోగదారుల నుంచి కూడా డబ్బు గుంజడం కోసమే.ఆస్పత్రుల్లో హెచ్చు అద్దె వసూలు చేసే యాజమాన్యాల నుంచి అధిక రేట్లు వసూలు చేయడాన్ని అర్ధంచేసుకోవచ్చు కానీ, పెన్సిల్ షార్పనర్లు,పేపర్ కటింగ్ కత్తెరలు. స్పూన్‌లు,కేక్ సర్వర్లు వంటి వాటిపై కూడా జీఎస్టీని 18 శాతం విధిం చడం సామాన్యులపై భారం మోపడమే.ఇదీ అదీ అనేది లేదు అన్ని వస్తువులపైనా జీఎస్టీని విధించడం ద్వారా సామాన్యులపై పెనుభారం మోపడం వల్లనే ఎంపీలు పార్లమెంటు వేదికగా ఆందోళన సాగిస్తున్నారు. దేశంలో పాల ఉత్పత్తి పెరగడానికి వర్ఘీస్ కురియన్ ఎంతో కృషి చేశారు. ఆయనను అందుకే శ్వేత విప్లవ పితామహుడని అంటారు. విదేశాలకు కూడా పాల ఉత్పత్తులను ఎగుమతి చేసే సామర్థ్యాన్ని అముల్ సంస్థ సాధించింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆ సంస్థ శాఖలను విస్తరింప జేసేందుకు ప్రధాని మోడీ సహకరిస్తున్నారని ప్రతిపక్షా లు ఇటీవల ఆరోపించాయి. అయితే అముల్ సంస్థ ప్రమాణాలను పాటించడం వల్లే ఆ సంస్థ ఉత్పత్తులకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని ప్రభుత్వం వివరించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.