కరోనా నియంత్రణ కోసం కేంద్రం తీసుకున్న చర్యల్లో భాగంగా దేశంలో191కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని ప్రభుత్వం చాలా ఆత్మవిశ్వాసంతో చెబుతున్న సమయంలోనే నాల్గవ దశ ఆనవాళ్ళు ఆందోళన కలిగిస్తున్నాయి.కరోనా పూర్తిగా తొలగిపోలేదనీ,అది మళ్ళీ విజృంభించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది.రెండు మూడునెలలుగా రోజుకు పది మాత్రమే నమోదు అయ్యే కరోనాకేసులు కొద్ది రోజులుగా మళ్ళీ విజృంభించాయి. కేసుల నమోదులో గతంలో మాదిరి ఈసారి మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ ముందు వరుస లో ఉన్నాయి. తమిళనాడు, కర్నాటకలలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసు లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కరోనా పోయింద న్న ధీమాతో జనం మాస్క్లు పెట్టుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం మానేశారు. ఇప్పుడు అవి తప్పక పాటించాలని వైద్య,ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.కరోనా టెస్ట్ ల సంఖ్య తగ్గించడాన్ని తెలంగాణ హైకోర్టు తాజాగా తప్పు పట్టింది. మహానగరాలకు వచ్చి పోయే జనం అత్యధికంగా ఉంటారు.కనుక టెస్టులు నిరంతరం జరగాలని హెచ్చరించింది. ఆమాట నిజమే. హైదరాబాద్ లోనూ, తెలంగాణలోనూ వ్యాపించిన కరోనా కేసులన్నీ బయటి నుంచి వచ్చినవే.కొత్తగా వ్యాపిస్తున్న కేసుల్లో అనారోగ్య లక్షణాలు లేకపోవడం మంచి పరిణామమే కానీ, అంత మాత్రాన నిర్లిప్తంగా ఉండటం ఎంత మాత్రం తగదు.కోవిడ్ నిబంధనలను తప్పని సరిగా పాటించాల్సిందేనని ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చ రిస్తోంది. ప్రజల్లో కరోనా పట్ల తేలిక భావం ఏర్పడుతోందన్న అనుమానం కలగడం వల్లనే ఆరోగ్య శాఖ ఈ హెచ్చరికలు చేస్తోంది. రెండేళ్ళ క్రితం కరోనా వ్యాపించినప్పుడు అది వస్తుందని తెలియకపోవడం వల్ల దాని నుంచి తప్పించుకునే మార్గాలు తెలియక జనం సిద్ధంగా లేని మాటనిజమే. కానీ, కరోనా రెండుదశల్లో కలిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
వర్షాకాలం ప్రవేశిస్తున్న దృష్ట్యా వ్యాధి కారక క్రిములు గాలిలో, నీళ్ళలో వ్యాపించే ప్రమాదం ఉంది. అందువల్ల మూతికి గుడ్డ కట్టుకోవడం, కాచిన నీళ్ళను తాగడం వంటిజాగ్రత్తలు తీసుకోవాలి. దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో నూ టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. జూన్, జూలై నెలల్లో ఇంటింటికీ వెళ్ళి సర్వే చేయాలనీ, వ్యాక్సినేషన్ జరగని వారికి వెంటనే వ్యాక్సిన్ అందజేయాలని ఆదేశించింది. ప్రభుత్వం జాగ్రత్తలనూ, హెచ్చరికలను మాత్రమే జారీ చేయగలదు కానీ, వ్యక్తి గతంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతిపౌరునిపై ఉంది. ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం లేదని పెద్దలు ఏనాడో చెప్పారు. మహాత్మా గాంధీ కూడా వెన్ హెల్త్ ఈజ్ లాస్ట్ సమ్థింగ్ లాస్ట్ అన్నారు. భారత దేశంలో అనాదిగా పెద్దలు పాటించిన ఆరోగ్య సూత్రాలే ఆరోగ్య దీపికలై ప్రజలను కాపాడుతున్నాయి. ఆధునిక రీతుల పేరిట అలవాట్లను, దైనందిన జీవితం లో అనుసరించాల్సిన కార్యకలాపాలను పూర్తిగా నిర్ల క్ష్యం చేయడం వల్లనే అనారోగ్యం పట్టి పీడిస్తోంది. నేటి తరం వారికి ఇవన్నీ చాదస్తంగా కనిపించినా, అనారో గ్యం బారి నుంచి మనల్ని కాపాడుతాయని మన పూర్వీ కులు నిరూపించారు,ఏడు పదులు దగ్గర పడుతున్నా గట్టిగా తుమ్మనివారు, దగ్గని వారు ఇప్పటికీ మన ఇళ్ళల్లో చాలా మందిని చూస్తూఉంటాం.అలాగే,కళ్ల జోళ్లు లేకుండానే చీమల్లాంటి అక్షరాలను చకచకా చదివేసే వారున్నారు.
ఆరోగ్య సూత్రాలనేవి పెద్దలుపాటిస్తే పిల్లలకు అలవాటు అవుతాయి.పెద్దలను పిల్లలు అనుకరిస్తారు. కనుక, పెద్దలుఎప్పుడూ ఆదర్శప్రాయంగా ఉండాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చు కోవడం, యోగా, వ్యాయామం చేయడం వంటి అలవాట్లు మన శరీరాన్ని అదుపులో ఉంచుతాయి.పదిమంది గుమిగూడిన ప్రదేశాల్లో గాలి పీల్చడం వల్ల శ్వాస కోశమై న ఇబ్బందులు తలెత్తుతాయి. కరోనా జాగ్రత్తల్లో ముఖ్య మైనది సమూహాల ను కలవద్దనేది. అలాగే, మూతికి గుడ్డలేనిదే బయటకురావద్దని. ఆరోగ్య సూత్రాలు మనకు శ్రీరామరక్ష వంటివి. మహానగరాల్లో పదిమంది తో కలవడం అనివార్యం అవుతుంది కనుక, మాస్క్ ధార ణను ఎట్టి పరిస్థితులలోనూ విస్మరించరాదు. ఆఫీసుల ముందు నో మాస్క్ -నో ఎంట్రీ అనే బోర్డులు ప్రత్యక్ష మిస్తున్నాయి. మాస్క్ లేనిదే విమానాల్లో ప్రయాణం చేయనివ్వడం లేదు. అమెరికాలో కూడా కరోనా జాగ్రత్త లను మళ్ళీ కఠినతరం చేశారు. కనుక, ఎవరి మటుకు వారు జాగ్రత్తలను పాటిస్తే కరోనా ముప్పు ను ఎదుర్కో వచ్చు. అదే సందర్భంలో కరోనా పుకార్లు వ్యాపింపజేసే జనం ఉంటారు. వారి పట్ల జాగ్రత్త గా వ్యవహరించాలి. సమాజంలో అందరితో కలిసి మెలిసి ఉంటూనే మన జాగ్రత్తల్లో మనం ఉండటం ఎంతైనా శ్రేయస్కరం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.