Friday, November 22, 2024

న్యాయపీఠం – రమణీయం…

కరోనా బీభత్సం,వ్యవసాయ చట్టాలపై ఆందోళన వంటి తీవ్రమైన పరిస్థితులు దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో తెలుగు వ్యక్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అధిష్టించారు. న్యాయవ్యవస్థలో ఆయన ఎన్నో పదవులు అవలీలగా నిర్వహించినా ఈకొత్త పదవి ఆయన సమర్ధత, చాకచ క్యం,నైపుణ్యానికి పదును పెట్టే పరీక్ష వంటిదే. ఐదున్నర దశాబ్దాల తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆ కీలక పదవికి తెలుగువ్యక్తి ఎంపిక కావడం తెలుగువారందరికీ గర్వకారణమే అయినా, ఆయనకు మాత్రం కత్తిమీద సాము వంటిది.మన దేశంలో న్యాయస్థానాలు ప్రజా సమస్యలపై స్పందించే తీరు అంతర్జాతీ యంగా న్యాయకోవిదుల ప్రశంసలను అందుకుంది. ఏభై ఐదేళ్ళక్రితం జస్టిస్‌ కోకా సుబ్బారావు ప్రధానన్యాయమూర్తిగా గొప్ప వరవడిని సృష్టించారు.ఆయన బెంచ్‌కీ, బార్‌కీ మధ్య సమన్వయం కోసంఎంతో కృషి చేశారు. కేసుల సత్వర పరిష్కారానికి సమన్వయం అత్యవసరమని ఆయన గతంలోపలు సందర్భాల్లో స్పష్టం చేశారు.ఆనాటి సామాజిక పరిస్థితులు వేరు,సమస్యలూ వేరు.మన సమాజం ఎంత పురోగమించినా, చిక్కుముళ్ళతో కూడిన సమస్యలు ముసురుకోవడం వల్ల తీర్పు చెప్పే న్యాయమూర్తుల బాధ్యత మరింత గురుతరంగామారుతోంది.
ఈ నేపథ్యంలో జస్టిస్‌ రమణ తనకు ముందు ఈ పదవిని నిర్వహించిన మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఏర్పరిచిన సంప్రదాయాలను పాటిస్తూనే,ఆధునిక సమాజం ఎదుర్కొం టున్న సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి తన ప్రతిభను వినియోగించాల్సి ఉంటుంది.ప్రధాన సమస్యలపై రాజకీయ పార్టీల మధ్య, సామాజిక శాస్త్రవేత్తలు, హితైషులమధ్య భిన్న ధోరణులు ముసురుకుంటున్నాయి. న్యాయం అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దానిని విశ్లేషించడంలో, విడమర్చి చెప్పడంలో న్యాయవాదులు గతంలో కన్నా ఎంతో ఆరితేరారు. వారిని నొప్పించకుండా, వారి వాదాలను నిశితంగా పరిశీలిం చి తీర్పులిచ్చేందుకు న్యాయశాస్త్రంపైనే కాకుండా, సామాజిక పరిస్థితులపైనా, ఆధునిక పోకడలపైనా న్యాయ మూర్తులకు సంపూర్ణ అవగాహన ఉండాలి.ఆ విషయంలో జస్టిస్‌ రమణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తన సమర్ధతను ఇదివరకే రుజువు చేసుకున్నారు.
జస్టిస్‌ రమణ సంప్రదాయ న్యాయమూర్తిగా కనిపిస్తారు. ఆయనలో ఆధునిక భావాలు మెండుగా ఉన్నాయి. ఆయన గతంలో మైలు రాయి అనదగిన పెక్కు తీర్పులు ఇచ్చారు. జమ్ము-కాశ్మీర్‌ లో కమ్యూనికేషన్‌ బ్లాకౌట్‌ కోసం ప్రభుత్వం తీసుకున్న అతి సున్నితమైన అంశంపై ఇంటర్నెట్‌ ప్రజలకు అందుబాటులో ఉంచకుండా ఆంక్షల పొడిగింపు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకువస్తుందని ఆయన తీర్పు ఇచ్చారు. అనురాధా భాసిన్‌, మీడియా ఫౌండేషన్‌ ప్రొఫెషనల్స్‌ కేసులో ఆయన తీర్పు ఇచ్చారు. అలాగే, కాశ్మీర్‌లో కర్ఫ్యూల విషయంలో కొన్ని పరిమితులను నిర్దేశించారు.ఐదుగురు కంటే మించి వ్యక్తులు నిర్వహించే సమావేశాలను నిషేధించే క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని 144వసెక్షన్‌,ప్రజాస్వామ్య హక్కులు,అభిప్రాయాలు లేదా మనోవేదన లేదా ఎక్సర్‌సైజ్‌ ను చట్ట సమ్మతమైన వ్యక్తీకరణను అణచివేయడానికి ఉపయోగిం చకూడదని ఆయన స్పష్టంచేశారు. అలాగే, సుభాస్‌ చంద్ర అగర్వాల్‌ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో సభ్యునిగా సమాచార హక్కు, గోప్యత హక్కు సమాన ప్రాతి పదికపై ఉన్నాయని స్పష్టం చేశారు. స్వరాజ్‌ అభియాన్‌ వెర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులోజాతీయ ఆహార భద్రతా చట్టం అమలులోసహకార సమాఖ్య అవసరం గురించి నొక్కి వక్కాణించారు.ఫిరాయింపుదారులపై రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ కింద విధించే అనర్హత వేటు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయడానికి అడ్డంకి కాదని కర్నాటక వ్యవహారంలో న్యాయపరమైన పరిస్థితిని వివరించే స్పష్టమైన తీర్పును ఇచ్చారు. అదే సమయంలో స్పీకర్‌ తటస్థంగా ఉండటం రాజ్యాంగ బద్దమైన విధి అనీ, దానికివ్యతిరేకంగా వ్యవహ రిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తిని వ్యక్తంచేశారు. బీమా క్లయిముల కేసులో ఏ రాబడి లేని గృహిణులకు నోషనల్‌ ఆదాయాన్ని నిర్ణయించాలని గత జనవరిలో ఆదేశిం చారు. న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలను మెరుగు పర్చాలనీ, కేసుల పరిష్కారానికి ఇది ముఖ్యమైన అంశమని ఆయన సూచించారు.
జడ్జీల భర్తీ: శుక్రవారం నాడు పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే తన 14 మాసాల పదవీ కాలంలోఒక్క న్యాయమూర్తినికూడా నియమించలేదు. ఆరుగురు న్యాయమూ ర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయి.
వాటిభర్తీ విషయమై జస్టిస్‌ రమణ తీసుకునే నిర్ణయంపై అందరి దృష్టి కేంద్రీకృతం అయి ఉంది. జస్టిస్‌ రోహింటన్‌,ఎఫ్‌ నారిమన్‌, అశోక్‌ భూషణ్‌, నవీన్‌ సిన్హాలుకూడా ఈ ఏడాది చివరినాటికి రిటైర్‌ కానున్నారు. వారి స్థానాలను కూడా భర్తీ చేయాల్సి ఉంది.జస్టిస్‌ రమణ కేసుల పరిష్కారంలో ఇంతవరకూ తీసుకున్న శ్రద్ధ వేరు.ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా తీసుకోవల్సిన శ్రద్ధ వేరు. ఇకపైనఆయన చురుకైన నిర్ణయాలను తీసుకోవల్సిఉంటుంది. ఆయన సమర్ధత, ముందు చూపు,సామర్ధ్యాలకు ఈ పదవి ఒక గీటు రాయి వంటిది.
తెలుగంటే ప్రాణం: జస్టిస్‌ రమణకు తెలుగంటే ప్రాణం.ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా తెలుగులో మాట్లాడేందుకు బిడియపడరు. ఇతర రాష్ట్రాల వారితో, దేశాలవారితో మాట్లాడేటప్పుడు మాత్రమే ఆంగ్లంలోమాట్లాడటం ఆయనకు అలవాటు. తెలుగు మీద మమకారం ఎంత వరకు వెళ్ళిందంటే తెలుగులోనే తీర్పులు ఉండాలని ఆయన పలు సందర్భాల్లో సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో న్యాయవాదులు తెలుగులోనే వాదోపవాదాలు చేయాలనీ, దానివల్లకక్షిదారులకు భాష సులభంగా అర్ధం అవుతుందనీ,న్యాయవాదులపైనా, న్యాయస్థా నాలపైనా గౌరవం పెరుగుతుందని ఆయన పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.తెలుగులో వాదించడానికి న్యాయవాదులు సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన పలు వేదికలపై స్పష్టం చేశారు.చైనా, జపాన్‌లలోఆంగ్లానికి ప్రాధాన్యం లేదనీ, అయినా ఆ దేశాలు ఎంతో అభివృద్ధిని సాధించాయని ఆయన ఒక సభలో స్పష్టం చేశారు. అంతేకాకుండా మాతృ భాషకు ఎదురవుతున్నని రాదరణ పట్ల పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు,.ఆయన తెలుగు ప్రసంగాలు ఎంతో ఆకర్షణీయంగా, జనాన్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement