చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మనదేశంలో పర్యటనకు వచ్చినప్పుడు లడఖ్ ప్రాంతంలో చైనీస్ సైనికుల ప్రవేశం అప్పట్లో తీవ్ర సంచలనాన్ని కలిగించింది. చైనీస్ సైనికుల కదలికలపై మన ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో తమ సైనికులను జిన్‌పింగ్ వెనక్కి వెళ్ళమని ఆదేశించారు. భారత రక్షణ బలగాలను తక్కువగా అంచనా వేసి చైనా మరోసారి అదే తరహాలో తోక జాడించింది. సరిహద్దు దేశమైన భారత్‌ని అన్ని విషయాల్లో తక్కువగా అంచనా వేస్తున్న చైనా రెండేళ్ళ క్రితం లడఖ్ తూర్పు ప్రాంతంలో గాల్వాన్ ప్రాంతంలోకి చొచ్చుకుని వచ్చి ఘర్షణకు దిగింది. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించారు. అటువైపు ఇంకా రెట్టింపు మంది మరణించి ఉంటారని అంచనా. అదేమీ లేదంటూనే చైనా ఈ మధ్యనే తమ సైనికుల మరణాలు వాస్తవమేనని ఒప్పుకుంది. ఇప్పుడు తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఈనెల 9వ తేదీన భారత సైన్యానికి భారీ నష్టాన్ని కలిగిద్దామని చైనా వ్యూహం పన్నింది. అయితే, మన సైన్యం ముందు చూపు కారణంగా చైనా వ్యూహం పటాపంచలైంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మన ప్రధాని నరేంద్రమోడీతో జి-23 శిఖరాగ్ర సమావేశాల్లో కలుసుకున్న కొద్ది రోజులకే ఆ ప్రాంతంలో చైనా సేనల కదలికలు పెరిగాయి. దీనిని మన సేనలు పసిగట్టి భారత బెటాలియన్ కమాండర్లు ఉన్నతాధికారులకు తెలియజేయడం, వారు అప్ర మత్తమై మన సేనల సంఖ్యను పెంచడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ క్రమంలోనే యాంగ్జే ప్రాంతంలో హిమపాతం ఎక్కువగా ఉండటంతో చైనా తన సేనలను క్రమంగా మన దేశంలోకి చొప్పించేందుకు ప్రయత్నించింది. యాగ్జే ప్రాంతంలో భారత సైనికులు ఎక్కువ ఉండకపోవచ్చని తక్కువ అంచనా వేసిన చైనా హిమపాతం మాటున తమ సేనలను మన దేశంలోకి పంపడం మొదలు పెట్టింది. దీనిని పసిగట్టిన మన భద్రతా దళాలు క్విక్ రియాక్షన్ టీమ్‌లను రంగంలోకి దింపింది. భారత్ బలగాలను చూసి చైనా సైనికులు నివ్వెరపోయారు. భారత్ వైపున ఇంత మంది సైనికులు దూసుకుని వస్తారని చైనా కమాండర్లు ఊహించలేకపోవడమే కారణం. చైనా సైనికులు తోకముడి చినప్పటికీ మన జవాన్లు వెంటపడి చితకబాదారు. ఇదంతా గమనిస్తున్న చైనా కమాండర్లు గాలిలోకి కాల్పులు జరిపారు. చైనా వ్యూహం ఫలించి ఉంటే మన సేనలు అధిక సంఖ్యలో హతమయ్యేవి. చైనా వ్యూహం బెడిసి కొట్టింది. ఆర్థికంగా ఎంతో పురోభివృద్ధిని సాధించామని చెప్పుకుంటున్న చైనా సైనికంగా మన దేశంతో తలపడే శక్తిని కలిగి లేదని ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి. గాల్వాన్‌లో ఎదురుదాడికి సిద్ధపడిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఎ) దళాలు యాగ్జే ప్రాంతంలో మాత్రం చావు దెబ్బతిన్నాయి. టిబెట్‌లోని బాంగ్డా ఎయిర్‌బేస్‌లో భారీ సంఖ్యలో డ్రోన్లనూ, జెట్లనూ చైనా మోహరించింది. ఇందుకు సంబంధించి అత్యంత శక్తివంతమైన ఉపగ్రహ చిత్రాలు లభ్యం కావడంతో మన సేనలు మరింత అప్రమత్తమయ్యాయి.
మొత్తం మీద చైనా వ్యూహాన్ని తిప్పికొట్టడంలో మన వారి యత్నాలు ఫలించాయి. చైనా ఆర్థికంగా బాగా ఎదిగిన మాట వాస్తవమే. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పదకొండువేల కోట్ల డాలర్ల పైనే ఉంటుంది. ఇందులో బీజింగ్ నుంచి భారత్‌కి పెరిగిన దిగుమతులే ఎక్కువ. భారత్‌కి దిగుమతుల్లో చైనా వాటా 15 శాతం ఉంది. ఈ వాపును బలుపు అనుకుంటూ భారత్‌ని ఎలా గైనా దెబ్బతీయాలని చైనా ఇలాంటి సందర్భాలను వినియోగించుకుంటోంది. చివరికి అప్రదిష్ట పాలవు తోంది. భారత ప్రధానిని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలుసుకున్న తర్వాత కొద్ది రోజులకే ఇలాంటి పరిణా మాలు ప్రతీసారి చోటు చేసుకోవడాన్ని బట్టి చైనా తన తడఖా ఏమిటో చూపాలని అనుకుంటున్నట్టు తెలు స్తున్నది. అయితే, భారత్ సైనిక శక్తిని అంచనా వేయ డంలో మొదటి నుంచి చైనా అంచనాలు తలకిందుల వుతున్నాయి.అంతర్జాతీయంగా కూడా భారత్‌ని బలహీ నపర్చేందుకు ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి వంటి వేదికలను చైనా ఉపయోగించుకుంటోంది. చైనా పోకడలను ఎప్పటికప్పుడు మన సేనలు పసిగడుతూ పిీఎల్‌ఏ దళాలను తరిమి కొట్టడం వల్ల చైనా వ్యూహాలు చెల్లాచెదరవుతున్నాయి. భద్రతామండలిలో కూడా చైనా తన వీటో పవర్‌ని ఉపయోగించి భారత్‌ని బలహీనపర్చేందుకు చాలా సార్లు ప్రయత్నించింది. సైని కంగా, దౌత్యపరంగా భారత్‌ని ఎదిరించడం కష్టమనిమ చైనా తెలుసుకునేట్టు మన ప్రభుత్వం చేయగలిగింది. మరో వంక చైనాలో మళ్ళీ విజృంభించిన కరోనా వల్ల అసంఖ్యాకంగా జనం మృత్యువాత పడుతున్నారు. తైవాన్‌లో పరిస్థితికూడాచైనాకు ప్రతికూలంగానే ఉంది.ఇన్ని ప్రతికూలతలు వెంటాడుతున్నప్పటికీ చైనా మేకపోతు గాంభీర్యాన్ని ప్రద ర్శిస్తోంది.