Wednesday, November 6, 2024

Editorial: ధరలు తగ్గితేనే బడ్జెట్‌కు సార్థకం!

ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్ట నున్న కేంద్ర బడ్జెట్‌లో నాలుగు వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం సూచన ప్రాయంగా తెలియ జేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే సంబంధిత వర్గాలతో చర్చలు, సంప్రదింపులు ప్రారంభించారు. ఇంతవరకూ 1200 పైగా సూచనలు వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది.

మరో వంక ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బీజేపీ మ్యానిఫెస్టో ఎలా ఉండా లో సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ఎవరు ఆర్థిక మంత్రిగా ఉన్నా, ప్రజల నుంచి సలహాలు కోరడం, చివరికి బడ్జెట్‌లో వాటికి చోటు లభిం చకపోవడం ప్రజలకు అనుభవమే. ప్రజాస్వామ్యంలో తాము ప్రజల సలహాల మేరకు పని చేస్తున్నామని ప్రభు త్వం చెప్పుకోవడానికే ఈ కసరత్తు ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఏయే వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలో, ఏయే రంగాల్లో పన్నులు పెంచాలో, తగ్గించాలో ముందే నిర్ణయాలు జరిగిపోతుంటాయి. ప్రభుత్వానికి ముఖ్యంగా, అధికార పార్టీకి అండగా నిలిచే వర్గాలకు ప్రయోజన కరంగా ఉండే ప్రతిపాదనలను మాత్రమే బడ్జెట్‌లో చేరుస్తూ ఉంటారు. ధరల తగ్గుదలకు దోహదం చేసే ప్రతిపాదనల జోలికి వెళ్ళరు. ఎన్నికల్లో బలహీన,అట్టడుగు వర్గాలకు రాజకీయ పార్టీలు ఉచితా ల పేరిట మిక్సీలు, గ్రైండర్ల దగ్గర నుంచి వంట సామగ్రి వరకూ అన్ని వస్తువులను అందిస్తూ ఉంటారు, గతంలో నగదు రూపంలో ఓట్లు కొనుక్కునే వారు ఇప్పుడు వస్తు, సామగ్రి ఎర చూపి ఓట్లు దండుకుంటున్నారు.

ఒకరిని చూసి మరొకరు ఈ విషయంలో పోటాపోటీగా వస్తువులను అందజేస్తున్నారు. ఇవన్నీ నిఖార్సుగా, నిజాయితీగా, లబ్ధిదారులకు చేరడం లేదన్నది వేరే విషయం. ఈసారి బడ్జెట్‌లో యువత, మహిళలు, రైతులు పేదలు.. ఈ నాలుగు వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని ఆదేశించినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. గతంలో బడ్జెట్‌ వస్తోందంటే మధ్యతరగతి, వాణిజ్య వర్గాలు భయపడేవి.ఇప్పుడు వాణిజ్య వర్గాలు నదురు బెదురు లేకుండా ఉంటున్నాయి. వస్తు,సేవల పన్ను (జీఎస్‌టీ) ప్రవేశపెట్టినతర్వాత ఆదాయం పెరిగిందని ప్రభుత్వమే చెబుతోంది. కార్పొరేట్‌ రంగానికి రాయితీలు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా పెరిగాయి. ఈ రంగంపై విధించే పన్ను తగ్గించారు. పేదలను ఉద్దరించ డమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందనీ,తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో పాతిక కోట్లమంది పైకి వచ్చారని ప్రధానమంత్రి చెబుతున్నారు.

- Advertisement -

అలాంటప్పుడు ఎన్నిక ల్లో ఉచితాల కోసం ఎగబడే ఓటర్ల సంఖ్య ఎందుకు తగ్గడం లేదు?ఈ ప్రశ్నకు సమాధానం చెబితే నిరుపేదల సంఖ్య తగ్గిందన్న ప్రభుత్వం మాటలను జనం నమ్ముతారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకూ, ప్రభుత్వం విడుద ల చేసే లెక్కలకూ చాలా తేడా ఉంటుంది.నిజంగా పేదరి కం తగ్గిందనడానికి కొలమానాలు ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడం.అలా జరుగుతోం దా? అన్న ప్రశ్నకు లేదన్న సమాధానం నిజాయితీగా వస్తుంది. నూనె గింజలు, పప్పుధాన్యాలు మినహా స్వయం సిద్ధిని సాధించినట్టు ఆర్థిక మంత్రి చెబుతున్నా రు. ఆహార ధాన్యాల ధరలు ఎందుకు మండిపోతున్నా యి. బియ్యం కిలో అరవైఆరు రూపాయిలకు పైనే పలుకుతున్నాయి. వంటనూనెల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గినా దేశంలో వాటి ధరలు మార్చి వరకూ తగ్గవని ప్రభుత్వమే ప్రకటించింది. పంటలు వచ్చేవరకూ వంటనూనెల ధరలను తగ్గించలేమని పరిశ్రమల ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేశారు. వంటనూనెలపై దిగుమతి సుంకాలను వచ్చే ఏడాది మార్చి వరకూ ప్రభుత్వం పొడిగించింది. ముడి చమురు విషయంలో కూడా ఇలానే జరుగుతోంది. చమురు ఉత్పత్తి దేశాలు ధరలను తగ్గిస్తున్నప్పటికీ, మనం దిగుమతి చేసుకునే ముడి చమురు ఎప్పుడూ ఎక్కువ ధరే పలుకుతోంది.

దానికి తోడు గల్ఫ్‌లోనూ, పశ్చిమాసియాలోనూ ఇటీవల యుద్ధాలు నిత్యకృత్యం కావడంతో దిగుమతుల భారం పెరిగింది. పేదలకు ప్రభుత్వం అందించే సాయం నేరుగా అందడానికి నగదు బదిలీ పథకంద్వారా 2.5 లక్షల కోట్ల నగదును బదిలీ చేసినట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. ఏ ప్రభుత్వంలో నైనా ధరల మంటల్లో మాడుతున్నది మధ్యతరగతి వర్గాలేనన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. పరిశ్రమల కు రాయితీలు,పెట్టుబడుల ప్రోత్సాహకాలను పెంచు తూపోతున్న ప్రభుత్వం రైతులకు మొక్కుబడి రాయితీ లు ప్రకటిస్తోంది. ఈ తేడాలను చక్కదిద్ద నిదే వ్యవసా యదారులు అప్పుల ఊబినుంచి బయట పడలేరు. ఎంపీ ల్లో ఎక్కువమంది కార్పొరేట్‌, పారిశ్రా మిక సంస్థ ల ప్రయోజనాల గురించే డిమాండ్‌ చేస్తూ ఉంటారు. అందువల్ల ఆర్థికమంత్రులు ఎన్ని కసరత్తులు చేసినా పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట లభించడం లేదన్నది అక్షర సత్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement