Saturday, November 23, 2024

కాచిన నీరు…. రోగ నివారిణి..!

భారీ వర్షాలకు వరదలు ఎంత సహజమో, వరదలు వచ్చినప్పుడు మంచినీటి కొరత అంత సహజం. చుట్టూ నీరు ఉన్నా, తాగడానికి గుక్కెడు మంచినీరు లేని పరిస్థితిలో జనం ఉంటారు. భారీ వర్షాలకు డ్రెనేజీలు పొంగి కుళాయిలకు సరఫరా చేసే గొట్టాల్లో కలిసి పోతున్నాయి. దాంతో మంచినీరు కలుషితంఅవుతోంది. కుళాయిల్లో వచ్చే నీరు మంచినీరే కదా అని అనుకుంటారు అమాయకంగా చాలా మంది. కుళాయిల్లో నీటిలో నలుసులు, పుల్ల ముక్కలు, చెత్త కూడా వస్తున్నాయి. వీటిని తొలగించి తాగేస్తే పర్వలేదనుకోవడం అంతకన్నాఅమాయకత్వం. ఇలాంటి నీటిని వడగట్టి తాగాలి. అప్పుడే మంచినీరు తాగినట్టు అవుతుంది. ఇంత ఓపిక,సమయం మనకు ఉందా? అంటే, ఉన్నాలేకపోయినా తప్పదు. వర్షాకాలం, వరదల కాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే వాంతులు, విరోచనాలతో మంచం ఎక్కక తప్పదు. పట్టణాలు, నగరాల్లోనే కాకుండా ఈ మధ్య పెద్ద గ్రామాలోకూడా గ్యాస్‌ సిలిండర్‌ సైజులో మంచి నీటిని ప్లాస్టిక్‌ డబ్బాల్లో మినరల్‌ వాటర్‌ పేరిట సరఫరా చేస్తున్నారు. ఈ డబ్బా నీరులో మినరల్స్‌ ఏమీ ఉండవు. అదొక సంతృప్తి మాత్రమే. నదులు, చెరువుల్లోంచి వచ్చే నీటిని వడగట్టి, పటిక కలిపి స్వచ్చమైన నీటిగా తయారు చేసే వ్యవస్థలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ, నగరపాలక, పురపాలక సంస్థలు వీటి నిర్వహణ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోక పోవడం వల్ల మంచినీరు కలుషితం అవుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. తమ హక్కులను సాధించు కునేందుకు ఇటీవల ఆందోళనకారులు వాటర్‌ ట్యాంకర్లపైకి ఎక్కి కింద పడిపోతామని బెదిరిస్తున్నారు. అది అక్కడితో ఆగకుండా వాటర్‌ ట్యాంకర్లలో పడుతున్నట్టుగా కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఎందుకంటే ఈ మధ్య వాటర్‌ ట్యాంకర్‌లో మృతదేహం పదిహేను రోజులు పైగా ఉన్నా దాని పర్య వేక్షక సిబ్బంది గుర్తించలేదు. ఇలాంటి వ్యవస్థలో నీటి కాలుష్యంకారణంగా రోగాలు పెరగడం సర్వసాధారణం. నీటిలో పురుగులు, క్రిములు చేరుతున్నాయి. వీటిని గుర్తించడం చాలా కష్టం. అందుకే, వడ గట్టిన నీటిని తాగడం శ్రేయస్కరం. జలమండలి, వాటర్‌ వర్క్స్‌ వంటి నీటి సరఫరా సంస్థలు సరఫరా చేసే నీటిని స్వచ్ఛమైనదిగా భావించడం ప్రజలకు అలవాటు. కానీ, ఈ నీటిలో పటిక కలుపుకుని లేదా, కాచి వడగట్టుకుని తాగడం శ్రేయస్కరం. అలాగే, ఇండుపు కాయలు నీటిలో వేస్తే మట్టి మురికి కిందికి దిగిపోతుంది. అలా తేటగా ఉన్న నీటిని తాగవచ్చు. ఇప్పటికీ గ్రామాలు, చిన్న పట్టణాల్లో అలాంటి పద్దతినే పాటిస్తూ ఉంటారు. మంచి నీటిని సరఫరా చేయడం నగర, పురపాలక సంస్థలు, గ్రామీణ మంచినీటి సరఫరా సంస్థలకు ఇప్పుడొక సవాలు. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు వందేళ్లలో కురవలేదంటున్నారు. ఎడతెరిపి లేకుండా వారం, పదిరోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఏది మంచి నీరో, ఏది కలుషితమైనదో తేల్చుకోవడం కష్టం. ఫిల్టర్‌ చేసిన నీటిని తాగడమే దీనికి పరిష్కారం. నీళ్ళు కాచుకోవడం ఇప్పుడు వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తరచూ పెరుగుతుండటం వల్ల పెద్దసమస్యగా తయారైంది.. పీల్చేగాలిలో, తాగే నీటిలో కాలుష్యం కారణంగా ఈ భూమి మీద బతకడమే ఒక సవాల్‌గా తయారైంది సామాన్యునికి.

అయినా సరే కొంత భారం పడినా నీటిని వేడి చేసుకునే తాగాలి. లేని పక్షంలో రోగాలు ప్రబలి ఆస్ప త్రులకు వేలకు వేలు చెల్లించాల్సి వస్తుంది. దాని కన్నాఈ ఖర్చే నయం. నిరవధిక వర్షాలవల్ల తడిసిన బట్టలను ఆరేసుకోవడం పెద్దసమస్య. మురికి వస్త్రాలు కుప్పలుగా పేరుకుని పోతుండటంతో దోమలు వ్యాపిస్తున్నాయి, ఈదోమల్లో డెంగీ దోమలు అత్యంత ప్రమాదకరమైనవి. దోమల బారి నుంచి రక్షణ కోసం మస్కిటో కాయిల్స్‌ను వాడినా ప్రయోజనం ఉండటం అంతంత మాత్రమే, దీంతో సామాన్యుని పరిస్థితి ఇంట్లో దోమల మోత, బయట కలుషిత నీటి మోతలా తయారైంది. వర్షా కాలంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి మనపెద్దలు సూచించిన ఆహార నియమాలను పాటిస్తే రోగాల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని స్వీకరించడం, వంటికి, కంటికి శ్రమ కలిగించని రీతిలో మసులుకోవడం అత్యవసరం. రోగ నివారణ కన్నా, రోగం రాకుండా చూసుకోవడం అత్యవసరం. అన్నింటికన్నా తాగే నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. వర్షాకాలంలో ప్రబలే రోగాల్లో సగానికి పైగా తాగే నీటి వల్లే వస్తాయన్నవిషయం మరిచిపోరాదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement