Tuesday, November 26, 2024

మాన్‌కి చేదు ఫలితం!

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన సత్తాచాటింది. దేశ వ్యాప్తంగా మూడు లోక్‌సభ స్థానాలకూ, ఏడు అసెంబ్లి స్థానాలకూ జరిగిన ఎన్నికల్లో పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లలో లోక్‌సభ స్థానాల ను బీజేపీ కైవసం చేసుకోవడం చెప్పుకోగదిన విషయమే. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ ఖాళీ చేసిన సంగ్రూర్‌ లోక్‌సభ స్థానాన్ని ఆప్‌ కోల్పోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఆయన అధికారం చేపట్టి న తర్వాత అవినీతి వ్యవహారంలో ఒక మంత్రిని బర్తరఫ్‌ చేసి దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించారు. ఆయన ప్రదర్శించిన దూకుడే దెబ్బకొట్టిందేమోనన్న అనుమా నాలు ఉన్నాయి. పంజాబ్‌లో ఇటీవల అసెంబ్లి ఎన్నికల్లో సాధించిన విజయంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉత్తరాదిన పలు రాష్ట్రాలలో విస్తరిం చాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా, త్వరలో జరగనున్న గుజరాత్‌లో తమ పార్టీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమై ఉన్న దశలో సాక్షాత్తూముఖ్యమంత్రి ఖాళీ చేసిన ఎంపీ స్థానాన్ని ఆప్‌ కోల్పోవడంతో ఆ పార్టీలో అంతర్మథనం ప్రారంభమైం ది. అయితే, ఢిల్లిలో రాజేంద్ర నగర్‌ అసెంబ్లి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోఆప్‌ అభ్యర్ధి దుర్గేష్‌ పాఠక్‌ బీజేపీ అభ్యర్దిపై విజయం సాధించడంతో ముఖ్యమంత్రి కేజ్రీ వాల్‌ తన పట్టును నిలబెట్టుకున్నట్టు అయింది.

ఉత్తర ప్రదేశ్‌లో మాత్రం మాజీ ముఖ్యమంత్రి,సమాజ్‌ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌కి అత్యంత సన్నిహి తుడైన అజాం ఖాన్‌ ఓటమితో ఆ పార్టీ కంగుతిన్నది. అజామ్‌ ఖాన్‌ ములాయంసింగ్‌ యాదవ్‌ హయాంలో కూడా సమాజ్‌వాదీ పార్టీలో కీలక పాత్ర వహించారు. రాంపూర్‌ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ములాయం సింగ్‌ యాదవ్‌ హయాంలో ఈ నియోజక వర్గం నుంచి సినీనటి జయప్రద సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధినిగా గెలుపొందారు. ఇప్పుడు ఆ స్థానాన్ని సమాజ్‌ వాదీ కోల్పోవడం అఖిలేష్‌ యాదవ్‌కి వ్యక్తి గతంగా ఎదురు దెబ్బ.ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి ఘనశ్యామ్‌ లోఢీ ఘనవిజయం సాధించారు.ఈ స్థానాన్ని అఖిలేష్‌ ప్రతిష్టాత్మకంగా పరిగణించి విస్తృతం గా ప్రచారం చేశారు. అలాగే, ఆయన గతంలో ప్రాతి నిధ్యం వహించిన అజాంగఢ్‌ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ కోల్పోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధి దినేష్‌ లాల్‌ యాదవ్‌ గెలుపొందా రు. రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో ఉత్తరప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాలను సమాజ్‌ వాదీ పార్టీ కోల్పోవ డంతో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధికి పడే ఓట్లు తక్కువ అవుతాయి.ఇప్పటికే ఎన్‌డిఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు వైసీపీ, బిజూ జనతాదళ్‌, జనతాదళ్‌(ఎస్‌) వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి. అలాగే, పంజాబ్‌ లోని సంగ్రూర్‌ ఉప ఎన్నికలో ఆప్‌ పరాజయానికి పోలింగ్‌ తక్కువ శాతం నమోదు కావడమే కారణం.

బీజేపీకి వచ్చిన మెజారిటీ కూడా 11వేలు మాత్రమే కావడాన్ని బట్టి జనం ఎక్కువ ఆసక్తి చూపలేదని స్పష్టం అవుతోంది.సంగ్రూర్‌లో ఓటమితో ఆప్‌కి లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి భగవం త్‌ మాన్‌ ఖాళీ చేసినందున ఉప ఎన్నిక జరిగిన ఈ నియోజకవర్గంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసిన గుర్మయిల్‌ సింగ్‌ ని శిరోమణి అకాలీదళ్‌ అభ్యర్ధి చేతిలో 5,800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పార్లమెంటు స్థానా ల్లో పదివేల లోపు మెజారిటీతో ఎన్నిక కావడం పెద్ద విశేషమేమీ కాదు. అందువల్ల అటు సంగ్రూర్‌లోనూ, ఇటు రాంపూర్‌లోనూ బీజేపీ గెలుపును గొప్పగా చెప్పు కోవడానికి ఏమీ లేదని ఆప్‌ సారథి, ఢిల్లి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. త్రిపురలో నాలుగు అసెంబ్లి స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా మూడింటిని బీజేపీ దక్కించుకుంది. కాంగ్రెస్‌కి ఒక స్థానం దక్కింది. కాగా, త్రిపుర ముఖ్యమంత్రి పదవినుంచి విప్లవ్‌ దేబ్‌ని తప్పించడంతో ఆ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరిపించాల్సి వచ్చింది. విప్లవ్‌ కుమార్‌దాస్‌ వివాదాస్పద ప్రకటనలు, ఇతర ఆరోపణలు ఆయన పదవికి చేటు తెచ్చాయి. ఆ స్థానానికి మాణిక్‌ సాహాని మే నెలలో బీజేపీ ఎంపిక చేసిం ది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చ డం ఈ మధ్యలో సర్వసాధారణం అయింది.గుజరాత్‌,ఉత్తరాఖండ్‌,కర్నాటక.అసోంలలో ముఖ్యమంత్రులను బీజేపీ మార్చిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరిని పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి వినియోగించు కునేందుకు రాజీనామా చేయించారు. త్రిపుర రాజధాని అగర్తలాలో కాంగ్రెస్‌ అభ్యర్ధి విజయం వెనుక తృణ మూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఉంది.జార్ఖండ్‌లో మందర్‌ అసెంబ్లి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధించడానికి జార్ఖండ్‌ ముక్తి మోర్చా మద్దతు ఇవ్వడమే కారణం. మొత్తం మీద ఈ ఉప ఎన్నిక ల ఫలి తాలను బీజేపీ విజయాలనడం కన్నా, స్థానిక పరిస్థితులే కారణమని పేర్కొనడం వాస్తవం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement