అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఒక విద్యాసంస్థపై నిన్న (శుక్రవారం) జరిగిన ఆత్మాహుతిదాడిలో మృతులంతా అభంశుభం తెలియని స్కూలు విద్యార్థినీవిద్యార్థులే. ఈ ఘటన తాలిబన్ల పాలనలో జరగడంతో నిస్సందేహంగా దీని వెనుక వారి హస్తం ఉండి ఉంటుంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అతి పెద్ద హింసాత్మక దాడి ఇది. తాలిబన్ల పాలన అంటే రాక్షస పాలన అన్న మాటల్లో అణుమాత్రం అత్యుక్తి లేదని ఈ ఘటన రుజువు చేస్తోంది. కాబూల్‌కి సమీ పంలో హజారా మైనారిటీ వర్గం వారు అధికంగా ఉండే ప్రాంతంలోనే ఈ దాడి జరగడంతో తాలిబన్ల హస్తం ఉందనడానికి వేరే ఆధారాలు అవసరం లేదు. హజారా కమ్యూనిటీపై తాలిబన్లు గడిచిన కొంత కాలంగా పగ బట్టినట్టు దాడులు చేస్తున్నారు. దాడుల్లో మరణించిన వారి సంఖ్య వంద వరకూ ఉండవచ్చని చెబుతున్నప్పటికీ పరీక్షలకు సిద్ధమవుతున్న స్కూలు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దళం సభ్యుడు ఈ దాడి జరపడాన్ని బట్టి చూస్తే తాలిబన్ల వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదని స్పష్టం అవుతోంది. ఆడపిల్లలు చదువుకోరాదన్నది తాలిబన్ల వైఖరి. చదువుకునేందుకు గడపదాటి బయటికి రావల్సి వస్తుందని ఆడపిల్లల చదువుపై తాలిబన్లు గతపాలనలో నిషేధం విధించారు. ఇప్పుడు కూడా అమలులోకి వచ్చినట్టు అనిపిస్తోంది.
ఈ దాడిలో తాలిబన్లతో పాటు ఐసిస్ ఉగ్రవాదులు కూడా పాల్గొన్నట్టు సమాచారం. వారి అజెండా కూడా తాలిబన్ల అజెండాను పోలినదే. అఫ్గాన్‌లో విద్యాసంస్థలపై దాడులు జరగడం ఇది మొదటి సారి కాదు. తాలిబన్లు మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించిన దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన దాడిని ఐక్యరాజ్య సమితి, అమెరికా తదితర దేశాలు ఖండించాయి. ఆడపిల్లల చదవు విషయంలో తాలిబన్లు అనుసరిస్తున్న మొండి వైఖరిని ప్రపంచ దేశాలు ఖండి స్తున్నా, వారి వైఖరిలో మార్పు రావడం లేదు. మహిళలు విద్యావంతులైతే తమ ఆధిపత్యం దెబ్బతింటున్నది వారి బెదురు. అంతేకాకుండా ఆడవారిని కుటుంబ అవసరా లకు మాత్రమే వినియోగించుకోవాలన్న మూఢ నమ్మకం వారిలో ఉంది. కాబూల్ సమీపంలో దషత్ ఎ బర్చీ అనే ప్రాంతం ఉంది. అక్కడ ఎక్కువగా మైనారిటీ వర్గీయులే నివసిస్తుంటారు. వారికి మెరుగైన సౌకర్యాలు గల ప్రాంతాలకు రానివ్వరు. తాలిబన్ల కాలం లోనే కాకుండా, అంతకు ముందు కూడా వారి పట్ల వివక్ష కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో ఇళ్ళల్లోకి చొరబడి తాలి బన్లు దాడులు చేస్తుంటారు. పాఠశాలలను మూసివేయి స్తారు. తాలిబన్లు వస్తున్నారంటే హజారా కమ్యూనిటీకి చెందిన మహిళలు, పిల్లలు భయంతో వణకిపోతుంటారు.
అక్కడి పిల్లల్లో చదవుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంది. వారిలో ప్రపంచం గురించిన అవగాహన పెరగ కుండా రేడియోలు, టీవీలను ముందే నిషేధించారు. అఫ్గాన్‌లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనల ఉపసంహరణ జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్తలో తాలిబన్లు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టు కోవడం లేదు.ఒక వంక ప్రపంచ దేశాలు తమ ప్రభు త్వాన్ని గుర్తించాలని కోరుతున్న తాలిబన్లు ఆధునిక నాగరికత వ్యాప్తికి కిటికీల తలుపులు మూసేయడాన్ని వివిధ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. అనేక ఇస్లామిక్ దేశాల్లో విద్యావ్యాప్తికి ఎంతో ఖర్చు చేస్తున్నాయి. మహిళల చదవు కోసం కొత్త విద్యా సంస్థలను నెలకొల్పుతు న్నాయి.ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తు న్నాయి. పాకిస్తాన్‌లోని స్వాత్ లోయలో తాలిబన్లకు పట్టు ఉంది. కొన్నేళ్ళ క్రిందట అక్కడ బాలికల విద్యను ప్రోత్సహించాలని ప్రచారం చేసినందుకు మలాలా అనే బాలికపై తాలిబన్లు దాడి చేసిన విషయం తెలిసిందే. బాలికలు చదువుకోవాలన్న లక్ష్యంతో ఆమె చేస్తున్న పోరాటానికి గాను ఆమెకు ఐక్యరాజ్య సమితి నోబెల్ బహుమతి కూడా లభించింది. దాడుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా రక్షణ కల్పించడం కోసం ఏర్పాటైన సంస్థ సేకరించిన వివరాలు ప్రకారం 2015 నుంచి 2019 వరకూ విద్యార్థినులపైన, ఉపాధ్యాయినిలపైనా వెయ్యికిపైగా దాడులు జరిగాయి.
కొంతమంది అంగవైకల్యం చెందారు. ఐక్యరాజ్య సమితి మానవ హ క్కుల విభాగం అఫ్గాన్‌లోనూ, ఇతర ఇస్లామిక్ దేశాల్లోనూ బాలికల విద్యపై గోష్టులు, సెమినార్లు నిర్వహించింది. అయినప్పటికీ తాలిబన్లలో మార్పు శూన్యం. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న పరిణామాల గురించి విద్యార్ధినీవిద్యార్ధులకూ, యువకులకూ తెలియనీయకుండా తాలిబన్లు వార్తాప్రసార సాధనాలపై నిషేధం ప్రకటించారు. సామాజిక మాధ్యమాల సంగతి సరేసరి. తాలిబన్లు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వైఖరిలో మార్పు వస్తుందేమోనని ఆశిం చిన వారు ఇప్పుడు నిరాశ చెందుతున్నారు.