Tuesday, November 26, 2024

పేదల కోటాపై భిన్నవాదనలు!

రిజర్వేషన్లు అంటేనే తేనె టీగల తుట్టె. వాటిని కదిలిస్తే దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమవుతాయి.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పుణ్యమా అని అణగారిన వర్గాలకు 15 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి. ఆ తర్వాత బలహీన వర్గాలు తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళన సాగించడంతో వారికి రిజర్వేషన్ల కోసం మాజీ ప్రధాని వీపీ సింగ్‌ హయాంలో మండల్‌ కమిషన్‌ నివేదికను ఆమోదించడం జరిగింది. ఇతర బలహీన వర్గాలకు (ఒబీసీలకు) 27 శాతం రిజర్వేషన్లను వచ్చాయి. రిజర్వేషన్లను ప్రభుత్వాలు ప్రకటించినప్పుడల్లా వాటికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరగడం, వాటిని కోర్టుల్లో సవాల్‌ చేయడం మామూలే. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల విషయంలో రాజీవ్‌ గాంధీ, పీవీ, వాజ్‌పేయ్‌ల హయాంలలో కొంత ప్రయత్నం జరిగింది. కానీ, వీటిని సమాజ్‌వాదీ, ఆర్‌జెడీ పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు ఆర్థికంగా పేదలకు నరేంద్రమోడీ ప్రభుత్వం10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్లను పొడిగించుకుంటూ పోతే సామాజిక న్యాయం దెబ్బతింటుందన్న వాదన బయలుదేరింది. అన్నిరకాల రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు ఆంక్ష విధించడంతో రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూలులో చేర్చి తమిళనాడు, కర్నాటకలు పరిధికి మించి రిజర్వేషన్లు కల్పించాయి. దీంతో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల కోసం ఆందోళనలు ప్రారంభమయ్యాయి.

దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసులో సోమవారం నాడు తీర్పు వెలువరించింది. ఈ ఐదుగురు సభ్యుల్లో ముగ్గురు సభ్యులు అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లను సమర్ధించగా, చీఫ్‌ జస్టిస్‌ లలిత్‌, మరో న్యాయమూర్తి వ్యతిరేకించారు. ఈ తీర్పుపై మిశ్రమ స్పందన వెలువడుతోంది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల వల్ల బీసీలకూ, ఇతర బడుగువర్గాలకూ లభిస్తున్న రిజర్వేషన్లలో కోత పడుతుందనే వాదన బయలుదేరింది. తమిళ నాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ కూడా ఈ వాదనను బలపరుస్తున్నారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను మోడీ ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు తీసుకుని వచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రిజర్వేషన్లు కల్పించింది. ఈ సవరణతో ప్రభుత్వం రాజ్యాంగం మూల సూత్రాలను ఉల్లంఘించలేదని సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి స్పష్టం చేశారు. ఆయన వాదనతో జస్టిస్‌ బేలా త్రివేదీ కూడా అంగీకరించారు. రిజర్వేషన్లు కల్పించడం వల్ల సమాజంలో అట్టడుగు వర్గాలు ఇప్పటికే విద్యా, ఉద్యోగ రంగాల్లో సమాన హక్కులను పొందుతున్నారనీ, ఉన్నత పదవులలో రాణిస్తున్నారనిఆయన అన్నారు. కాగా, చదువుకోవడా నికి తగిన నిధులు లేకపోవడంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఎన్నో బాధలు అనుభవిస్తున్నా రనీ, వారి కోసం పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికే తమ పార్టీ ఈరిజర్వేష న్లు తెచ్చిందనీ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతం, ప్రధాని నరేంద్రమోడీ సబ్‌కా సాథ్‌- సబ్‌కా వికాస్‌ అనే నినాదానికి అనుగుణంగానే ఈ రిజర్వేషన్లను తీసుకుని రావడం జరిగిందని బీజేపీ వాదిస్తోంది.

పూర్వపు ప్రభుత్వాలు అగ్రవర్ణాల పేదలకోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ అంటున్నది. అయితే, అగ్రవర్ణాల్లో చదువుకున్న వారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నవారూ ఎంతో మంది ఉన్న దృష్ట్యా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లుఅవసరం లేదనీ, ఈ రిజర్వేషన్లతో పాత కుల వ్యవస్థ తిరిగి వస్తుందనే వాదన వినిపిస్తోంది. అయితే, జస్టిస్‌ బేలా త్రివేదీ ఈ వాదనను తోసిపుచ్చారు. సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు జరుపుతున్న వారు కూడా ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల సామాజిక న్యాయంకోరే వారికి అందవలసిన రిజర్వేషన్లు తగ్గి పోతాయన్నది వారి వాదన. మహిళల రిజర్వేషన్ల విషయంలో కూడా ఇదే తరహా వాదన వినిపించింది. మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే చదువుకున్న వారికే ప్రయోజనం కలుగుతుందనీ, చదువుకున్న మహిళలంతా అగ్రవర్ణాలకు చెందిన వారని లాలూ ప్రసాద్‌యాదవ్‌, ములాయంసింగ్‌ యాదవ్‌ వాదించడంతో మహిళా రిజర్వేషన్లను యూపీఏ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అటకెక్కించింది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల విషయంలో కూడా అదే వాదన వినిపిస్తున్నారు, అయితే, ప్రధాని మోడీ పట్టుబట్టి ఈ రిజర్వేషన్లు తీసుకుని వచ్చారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్న సమయంలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలెక్కడివని కొందరు వేస్తున్న ప్రశ్న సహేతుకమైనదే, కానీ రిజర్వేషన్లను కొన్ని వర్గాలు ఆత్మాభిమానంగా పరిగణిస్తున్నాయి. రిజర్వేషన్లపై సమాజంలో చర్చజరగాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement