Tuesday, November 26, 2024

నేటి సంపాద‌కీయం – విన్యాసాలు వ్యూహాత్మ‌క‌మా…

అమెరికాతో రక్షణ ఒప్పందం వ్యూహాత్మకమైనదని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఈ ఒప్పందాన్ని ఆసరాగా తీసుకుని అమెరికా మన సాగర జలాల్లోకి ముందుగా చెప్పకుండా తననౌకలను పంపిస్తోంది. దీనినేమనాలి? అతిక్రమణ అనా? లేక అతి అనా? దీనిపై మన ప్రభుత్వ స్పందన ఇంకా వెలువడలేదు. ప్రత్యేక ఆర్థిక మండల ప్రాంతమైన లక్ష్యదీవుల సమీపంలో అమెరికానౌకాదళం మూడు రోజు ల క్రితం విన్యాసాలను నిర్వహించింది.ఈ విషయం తెలియగానే ఆశ్చర్య పోవ డం మన ప్రభుత్వం వంతు అయింది. అయితే, అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమకు ఆ హక్కు ఉందని అమెరికా వాదిస్తోంది. అమెరికా లక్ష్యం భారత్‌ కాకపోవచ్చు కానీ, మిత్రదేశంగా పరిగణిస్తున్న భారత్‌కి ముందుగా తెలియజేయకుండా ఇంత పెద్ద ఎత్తున విన్యాసాలు జరపడం కూడా తప్పిదమే. అమెరికా అధ్యక్షునిగా మూడు నెలల క్రితం ప్రమాణం చేసిన డెమోక్రాటిక్‌ పార్టీ నాయకుడు జో బిడేన్‌ ప్రకటనలను బట్టి ఆయన మనతో సత్సంబంధాలను కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది. ఇప్పుడు కూడా మన దేశానికి హాని తలపెట్టేందుకు ఈ విన్యాసాలను అనుమతించారని అనుకోవడానికి వీలులేదు. దక్షిణ చైనా సాగర జలాల్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఇటీవల అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలి యా, భారత్‌లు వర్చువల్‌ సమావేశం నిర్వహించి క్వాడ్‌ ఏర్పాటు అంశాన్ని చర్చించారు. ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. దీంతో చైనా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసింది. నిజానికి క్వాడ్‌ ఏర్పాటు ముఖ్యోద్దేశ్యం చైనాకు ముకుతాడు వేయడమే అయినప్పటికీ, ఈ సమావేశంలో ఆ విషయాన్ని ప్రకటించలేదు. అయితే, భారత్‌ పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి స్థాపన తమ ఉద్దేశ్యమని క్వాడ్‌ భాగస్వామ్య దేశాలు స్పష్టం చేశాయి. ప్రత్యేక ఆర్థికమండలి విషయంలో భారత్‌ ప్రకటనలు పొంతన లేకుండా ఉన్నాయనీ, అందువల్ల తమ నౌకాదళం లక్ష్య దీవులకు 130 నాటికల్‌ మైళ్ళ దూరంలో విన్యాసాలాను నిర్వహించడం తప్పులేదని అమెరికా సమర్ధించుకుంది. అమెరికా చర్యపై మన ప్రభుత్వం ఇంత వరకూ స్పందించలేదు. ఎన్నికల హడావుడి, కరోనా విజృంభణ కారణంగా కావచ్చు. బిడెన్‌ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి, చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు నిదానం గా చర్యలు తీసుకుంటున్నారు. దక్షిణ చైనా ప్రాంతంలో కూడా వియత్నాం, పిలిప్పీన్స్‌ తదితర దేశాల అభ్యర్ధన మేరకు చైనాకు దీటుగా తమ నౌకలను దించుతున్నారు. దీంతో చైనాకు గుర్రుగా ఉంది. అమెరికా పూర్వపు అధ్యక్షుడు ట్రంప్‌ కేవలంమాటలతోనే చైనాను బెదిరించేవారు. కానీ, బిడెన్‌ చేతలతో చైనాను హడలెత్తిస్తున్నా రు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మాటల్లో చాలా మార్పు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ భారత్‌ అనుకూలుడనే అభిప్రాయంతో జిన్‌పింగ్‌ ఇటీవల భారత్‌పై విమర్శల జోరును తగ్గించారు. అంతేకాక, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ భారత సంతతి వారు కావడం వల్ల ముఖ్యమైన నిర్ణయాలలో అమెరికా భారత్‌ వైపే మొగ్గుచూపుతుందన్న అభిప్రా యం చైనా నాయకుల్లో ఏర్పడింది. అంతేకాకుండా. చైనాలో అంతర్గతంగా వచ్చిన మార్పు ల వల్ల కూడా జిన్‌పింగ్‌ ఈమధ్య విమర్శల జోరు తగ్గించారు. లడఖ్‌ తూర్పు ప్రాంతంలో సేనల ఉపసంహరణ విషయంలో చైనా చిత్తశుద్దిని మనదేశమే కాకుండా, ఇతర దేశాలు సందేహిస్తున్నాయి. అయితే, లడఖ్‌ తూర్పు ప్రాంతంలోని గాల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో చైనా సైనికుల ప్రాణనష్టం మన దేశానికి చెందిన వారి కన్నాఎక్కువఉంది.ఆ విషయాన్ని చైనా ఆలస్యంగా అంగీకరించింది. దీనిపై స్వదేశంలో జిన్‌పింగ్‌ విమర్శలను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్‌ విషయంలో ట్రంప్‌ మాదిరిగా బిడెన్‌ చైనాపై ధ్వజమెత్తకుండా చేయవల్సింది చేస్తున్నారు. ఆయన తీసుకుంటున్న చర్యల వల్లచైనా ఒంటరి అయింది. అమెరికాలో కరోనా వైరస్‌ను తుదముట్టించడానికి ప్రతిన చేసిన బిడెన్‌ ఆ పని పూర్తి చేసిన తర్వాత ఈ విషయం లో చైనా జోలికి వెళ్ళాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద బిడెన్‌ ఇటు మిత్ర దేశాల తో మైత్రినికొనసాగిస్తూనే కొంత కరకుగా ఉంటున్నారు. అదే సందర్భంలో శత్రు దేశాలపై దూకుడుప్రదర్శించకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బిడెన్‌ అనుసరిస్తున్న విధానం వ్యూహాత్మకమే కావచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement