సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులు కావడం తెలుగువారందరికీ గర్వకారణం. ఏభౖౖె ఐదేళ్ళ తర్వాత తెలుగుతేజానికి ఈ అరుదైన అవకాశం లభించినందుకు ఆనందించని తెలుగువారుండరు. 1966లోజస్టిస్ కోకా సుబ్బారావు ప్రధానన్యాయమూర్తిగా నియమితులైన తొలి తెలుగు తేజం కాగా, ఇప్పుడు జస్టిస్ ఎన్వీరమణ రెండవ వారు. జస్టిస్ కోకా సుబ్బారావు న్యాయవాదుల కుటుంబానికి చెందిన వారు.జస్టిస్ రమణ వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. కృష్ణా జిల్లాకు చెందిన జస్టిస్ రమణ అంచలంచలుగా స్వయంకృషితో ఉన్నత స్థితికి చేరుకున్నారు. జస్టిస్ ఎన్వీరమణ నిబద్ధత,నిరాడంబరతకు మారుపేరు. సామాజిక చైతన్యం కలిగిన ఆయన యువకునిగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన కొంతకాలం జర్నలిస్టుగా పని చేశారు. ఎన్ని వివాదాలు ముసురుకున్నప్పటికీ తొణకని మనస్తత్వం ఆయనది. ఆయన ఇచ్చిన తీర్పుల్లో పలు కీలకమైన కేసులు ఉన్నాయి. మానవహక్కుల అంశాలలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు. న్యాయవాదిగా ఆయన నేర, రాజ్యాంగ, నదీజలాల కేసుల్లో వాదించి మంచి పేరు సంపాదించారు. న్యాయసేవ అందించేందుకు ఉద్దేశించిన ప్రాథికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎంతో మందికి సాయపడ్డారు. సామాన్యునికి న్యాయం అందా లన్న తపనతో ఆయన పని చేశారు. నిర్దిష్ట వర్గాల వారికే కాకుండా అవసరమైన వారందరికీ న్యాయ సేవలందించే సంస్కృతికి ఆయన శ్రీకారం చుట్టారు. జస్టిస్ రమణ ఆర్బిట్రేషన్, కన్సీలేషన్ చట్టం రూపొందించడంలో 1995లో తన తోడ్పాటును అందించారు. కోకా సుబ్బారావు ప్రధానన్యాయమూర్తిగా బాధ్యతలను నిర్వహించేనాటికీ, ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా, ఎమర్జెన్సీ సమయంలో మన న్యాయ వ్యవస్థ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆ తర్వాత కూడా చెదురుమదురుగా ఆరోపణ లు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో న్యాయమూర్తి,ప్రధాన న్యాయమూర్తుల పదవులను అలంకరించే వారి విధులు కత్తిమీద సాములా తయారయ్యాయి. ప్రపంచం లోనే మన న్యాయ వ్యవస్థ ఎంతో మెరుగైనదన్న ప్రశంసలు ఇప్పటికీ వస్తున్నాయి. పొరుగు దేశాలతోనే కాకుండా, అభివృద్ధి చెందినదేశాల్లో కూడా న్యాయవ్యవస్థలు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్న తరుణంలో మన న్యాయవ్యవస్థ తన స్వతంత్రతనూ,విశ్వసనీయతనూ కాపాడుకోవడం గర్వకారణమే. అలాగే, ప్రజల్లో చైతన్యంతో పాటు, వ్యాజ్యాలు పెరిగాయి. అపరిష్కృతంగా ఉన్నకేసుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. సుప్రీంకోర్టు నుంచి దిగువ కోర్టుల వరకూ అన్ని న్యాయస్థానాల ముందున్న ప్రధాన సమస్య అదే. కేసుల పరిష్కారానికి మధ్యవర్తి పరిష్కార వ్యవస్థలు ఏర్పడినా అవి ఇంకా పెరిగిపోతున్నాయే కానీ, తగ్గడం లేదు. ముఖ్యంగా, కుటుంబ పరమైన వివాదాలు, పర్యవసానంగా నేరాలు బాగా పెరుగుతున్నాయి. అలాగే, రాజకీయ పరమైన వివాదాలు కూడా నానాటికీ పెరిగిపో యి కోర్టుల్లో వ్యాజ్యాల సంఖ్య పెరుగుతోంది. అందరికీ న్యాయం చేయాలన్న లక్ష్యంతో మన న్యాయ వ్యవస్థ పని చేస్తోంది. ఇందుకు కక్షిదారుల సహకారం చాలా అవసరం. కోర్టుల్లో మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని జస్టిస్ రమణ పలు సందర్బాల్లో స్పష్టం చేశారు కనుక, త్వరలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని భావించవచ్చు. అలాగే, హైకోర్టులో న్యాయమూర్తుల పదవుల ఖాళీలను భర్తీ చేయాల్సిన ప్రధాన బాధ్యత కూడా ప్రధాన న్యాయమూర్తిపై ఉంది. ప్రభుత్వంతోసంప్రదింపులు జరిపి ఈసమస్యకు పరిష్కా రం కనుగొనాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గతంలో పనిచేసిన జస్టిస్ టిఎస్ ఠాకూర్ ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమక్షంలోనే ఈ అంశాన్ని లేవనెత్తారు. హైకోర్టుల్లో పనిచేసి ఉన్నందున జస్టిస్ రమణకు హైకోర్టులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కరతలామలకం.న్యాయవ్యవస్థలో సమస్యల పరిష్కారానికి ఆయన అనుభవం తోడ్పడ వచ్చు. అంతేకాక న్యాయశాస్త్ర విషయాల్లో ఆయనకున్న పరిజ్ఞానం కేసుల పరిష్కారంలో ఆయనకు కొండంత అండగా నిలవచ్చు. ఆయన ఎన్నో కేసుల్లో తన ప్రతిభను చాటుకున్నా రు. ఆయన చేపట్టిన కేసులన్నీ విజయవంతమయ్యాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement