Saturday, November 23, 2024

నేటి సంపాద‌కీయం – ఎన్నిక‌ల మ‌ధ్య‌లో ఐటి రైడ్స్…

పోలింగ్‌ ఇంకా నాలుగైదు రోజుల్లో జరుగనుండగా,ప్రధాన ప్రత్యర్ధుల బంధువుల ఇళ్ళపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు జరపడం అనుమానాలకు దారి తీయడం సహజం.ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉన్నవారి ఇళ్ళపై ఐటి శాఖ దాడులు చేయడం కొత్త కాదు.కానీ, పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న తరుణం లో దాడులు నిర్వహించడాన్ని రాజకీయ కక్షగా ప్రత్యర్ధులు ఆరోపిస్తే తప్పు పట్ట లేం. ఆదాయానికి మించిఆస్తులుకలిగిఉన్న వారు దేశమంతటా ఉన్నారు. వారి నుంచి ముక్కు పిండి బకాయిలు వసూలు చేయడానికి ఆదాయం పన్ను శాఖ ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని అమలు జేయాలి. సాధారణంగాఅలాగే చేస్తోందని జనం భావిస్తారు. ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్న నాయకులను కదలనివ్వకుండా చేయడానికి కేంద్రం ఐటి అస్త్రాన్ని ప్రయోగిస్తోందన్న ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. ఇవి కొత్త కావు. కేవలం ఇప్పటి ప్రభుత్వంలో మాత్రమే జరుగుతున్నవీ కావు.కొద్ది రోజుల క్రితం తృణమూల్‌ అధ్యక్షురాలు,పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంధువుల ఇళ్ళపై ఇదే మాదిరిగా ఐటి దాడులు జరిగాయి.కర్నాటకలో ఎన్నికల ముందు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు డికె శివకుమార్‌ బంధువుల ఇళ్ళపై దాడులు జరిగాయి.బీహార్‌లో ఆర్‌జెడి నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ ఇంటిపై జరిగాయి. కాంగ్రెస్‌ హయాంలో ఇలాంటి దాడులు తరచూ జరిగేవి. అప్పుడు వాటిని విమర్శించిన బీజేపీ ఇప్పుడు అదే దారిలో పయనిస్తోంది. తమిళనాడు ఎన్నికలలో పోటీ చేస్తున్న రాజకీ య నాయకుల బంధువుల ఇళ్ళపై మార్చినెలలో వరుసగా నాలుగైదు సార్లు ఐటి దాడులు జరిగాయి. తాజాగా డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌ ప్రచారవ్యూహాలతో నిమగ్నమై ఉన్న తరుణంలో ఆయన కుమార్తె, అల్లుడు ఇళ్ళపై ఐటిశాఖ అధికారులు దాడులు నిర్వహించ డంపై ఆయన తీవ్రంగాస్పందించారు. ఆయన ఇంతవరకూ రాజకీయ ప్రత్యర్ధులపై తీవ్రమై న భాషను ఎన్నడూ ప్రయోగించలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని వ్యక్తిగతంగా దూషించలేదు. ఆయన అనుసరిస్తున్న విధానాలను మాత్రం రాజీలేని రీతిలో విమర్శిస్తు న్నారు. సాగు చట్టాలపై రైతుల ఆందోళనకు మద్దతు ఇవ్వడమే కాకుండా, కేంద్రం ఆ చట్టాల ను తెచ్చిన తీరును తప్పుపట్టారు. డిఎంకె దశాబ్దాలుగా సిద్ధాంత పరమైన అంశాలపైనే పోరాటం చేస్తోందనీ, తన తండ్రి ఎం కరుణానిధి చివరి వరకూ రాజకీయ వి లువలకూ, సిద్ధాంతాల కోసం పోరాడారనీ, ఆయన బాటలోనే తాను సాగుతున్నానని స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు,నల్లచట్టాలను తెచ్చినప్పుడు తమ పార్టీ ధైర్యంగా నిలిచి పోరాడిన కరుణానిధి కుమారుడిననీ, ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చు కుని, ఇప్పుడు వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్నామనీ, తమను అణగ తొక్కేందుకు ప్రయత్నిస్తే ప్రజలే తమకు అండగా ఉంటారని అన్నారు. ఈసారి తమిళనాడులో డిఎంకె కే విజయావకాశాలు ఉన్నాయంటూ వెలువడిన సర్వే నివేదికలు ఆయనలోఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉండవచ్చు. అంతేకాకుండా రాష్ట్రంలో అన్నాడిఎంకెవర్గాల్లో అసమ్మతి స్వరాలు తమకు మేలు చేస్తాయన్న దృఢవిశ్వాసంతో ఆయన ఈ ప్రకటన చేసి ఉండవచ్చు.ఈసారి వంతు తమ పార్టీదేనన్న ధీమా స్టాలిన్‌లో కనిపిస్తోంది. జయలలిత అస్తమించిన తర్వాత అన్నా డిఎంకె చీలిపోయే పరిస్థితి వచ్చినా, ఆ అవకాశాన్ని స్టాలిన్‌ ఉపయోగించుకోలేదు. అధికారం కోసం తాను వెంపర్లాడటం లేదన్న నమ్మకం ప్రజలకు కలిగించడం కోసం వెనక్కి తగ్గారు. ఆ నైతిక బలంతోనే ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. తమిళనాడులో డిఎంకె గాలి ఉందని గ్రహించడం వల్లనే శత్రువును బలహీనపర్చే ఎత్తుగడలను కేంద్రం లోని బీజేపీ అనుసరి స్తోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఐటీ, సీబీఐ దాడులు రాజకీయ ప్రత్యర్ధులను అధికారంలో ఉన్నవారు ప్రయోగించే అస్త్రాలని ప్రజలు ఇప్పటికే గ్రహించారు. అందువల్ల వీటి ప్రభావం ఓటర్లపై ఉండదు.ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో వారు ముందే నిర్ణయానికివచ్చారు. గతంలో కాంగ్రెస్‌ ప్రయోగించిన అస్త్రాలనే ఇప్పుడు బీజేపీ తన ప్రత్యర్ధులపై ప్రయోగిస్తోందన్న మాటమిగిలిపోతుంది తప్ప ఆ పార్టీకి అదనంగా కలిగే ప్రయోజనం ఏమీఉండదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement