Tuesday, November 26, 2024

నేటి సంపాద‌కీయం – మ‌ళ్లీ ఉపాథి స‌మ‌స్య‌..

వివిధ రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసుల సంఖ్య పెరగడం, లాక్‌డౌన్‌ విధించడంతో రోజువారీ శ్రామికులు, తాత్కాలిక ఉద్యోగులు పనులు కోల్పోయారు.వారంతా స్వస్థలాలకు బయలుదేరి వెళ్ళేందుకు రైల్వే స్టేషన్లకు చేరుకోవడంతో అవి కిక్కిరి సిపోతున్నాయి. మంగళవారం సికిందరాబాద్‌,నాంపల్లి స్టేషన్లలో దృశ్యాలే ఇందుకు నిదర్శనం. లాక్‌డౌన్‌ వల్ల వలస కార్మికుల సమస్య పునరావృతం అవుతుందని రాష్ట్రాలు చాలా కాలం తటపటాయించి ఎట్టకేలకు తప్పని సరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నాయి.ఇప్పటికే ఢిల్లిd, మహా రాష్ట్ర,కర్నాటక తదితర రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఆంక్షల వల్ల తెలంగాణలో లాక్‌డౌన్‌ వల్ల పట్టణ ప్రాంతాలో నిరుద్యోగిత 12 శాతానికి పెరిగింది.లాక్‌ డౌన్‌ల వల్ల ఆర్థిక కార్యకలాపాలు బంద్‌ అవుతుండటంతో దాని ప్రభావం ఉద్యోగ మార్కెట్‌ పై పడింది. గ్రామాల్లో సైతం ఉపాధి అవకాశాలు బాగా సన్నగిల్లాయి.ప్రభుత్వం అమలు జేసే జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల కోత వల్ల పనిదినాల సంఖ్య బాగా తగ్గింది. పట్టణాల్లో,నగరాల్లో అయితే, అద్దెలు కట్టాల్సి వస్తుందని ఉద్యోగాలు కోల్పోయిన వారు స్వస్థలాలకు క్యూ కడుతున్నారు.అక్కడైతే,స్వంత ఇళ్ళల్లో గంజి తాగైనా బతకవచ్చని చాలా మంది స్వస్థలాలకు వెళ్తున్నారు.ఈ పరిస్థితి తెలంగాణలోనే కాదు,ఇతర రాష్ట్రాల్లోనూ ఉంది.ఉపాధి లేని వారికి పనులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలమీద ఉంది.అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలు లాక్‌డౌన్‌ కాలంలో ఉపాధిలేని వారికి సాయం అందించే పరిస్థితిలోలేవు.చాలా రాష్ట్రాలు ఆక్సిజన్‌ కొరత,వ్యాక్సిన్‌ కొరత కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఆర్థిక సమస్యలు వాటిని వెంటాడుతున్నాయి. సంక్షేమ పథకాలకు చేసిన కేటాయింపులను వ్యాక్సిన్‌ కొనుగోలు కోసం మళ్ళిస్తున్నాయి. ముందు ఈ గండం నుంచి గట్టెక్కితే తర్వాత సంక్షేమ కార్యకలాపాల సంగతి చూసు కోవచ్చని భావిస్తున్నాయి. ఈ తరుణంలో లాక్‌ డౌన్‌ వల్ల పనులు కోల్పోయిన వారికి జీవనొ పాధి కల్పించడం క్లిష్టమైన పనే.అలాగే,ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు రోజుల తరబడి వ్యాపారాలు లేకపోవడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోతున్నాయి . బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించలేకపోతున్నాయి. అన్నింటికీ మించి సిబ్బందిని కొనసాగించాలా వద్దా అనే విషయమై అవి స్పష్టమైన నిర్ణయాలు తీసుకో లేకపోతున్నాయి. పట్టణాలు,నగరాల్లో నిరుద్యోగం గత నెల చివరి వారంలో 9.75 శాతం ఉండగా, ఈనెల మొదటి వారానికి అది దాదాపు 12 శాతానికి పెరిగింది.అయితే, నిరుద్యోగిత పెరగడానికి లాక్‌డౌన్లు మాత్రమే కారణం కాదనీ, ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా కేసులు పెరగడానికి కారణం రాజకీయపరమైన కార్యకలాపాలు పెరగడమే కారణమని వారు పేర్కొంటున్నారు. రాజకీయ సమస్యలే ఆర్థిక సమస్యలకు మూల కారణం. ఆర్థిక సమస్యల కారణంగానే వ్యాపార సంస్థలు,పారిశ్రామిక సంస్థలు మూత పడటం,నిరుద్యోగం పెరగడం జరుగుతోంది. ఇదంతా ఒక విష చక్రం.అందువల్ల కరోనారెండవ దశ లో కేసులు పెరగడానికి,లాక్‌డౌన్‌ ప్రకటనకూ బాదరాయణ సంబంధం ఉంది. మన దేశంలోనే కాకుండా కోవిడ్‌ బారిన పడిన దేశాల్లో లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించి ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కూరుకుని పోయింది. కొత్త ఉద్యోగాల సృష్టి మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలే ఊడే పరిస్థితులు కోవిడ్‌ వల్ల దాపురించాయి. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. మన దేశంలో ఉపాధి రంగంలో సాంప్రదాయక వృత్తులపైనే ఆధారపడే వారే ఎక్కువ మంది ఉన్నారు. నైపుణ్యకలిగిన ఉద్యోగులు చాలా తక్కువ.ఈ కారణంగా కూడా ఉపాధి కల్పన పెను సవాల్‌గా తయారైంది. చాలా రాష్ట్రాల్లో చిన్న, లఘు పరిశ్రమల ప్రోత్సాహానికి మోడీ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ కార్యక్రమం ద్వారా వేల కోట్ల రూపాయిలను సమకూ రుస్తోంది.ఈ రంగంలో ఉపాధి లభిస్తున్న మాటనిజమే కానీ, కొత్తగా నిరుద్యోగులుగా తయారైనవారికి ఉపాధి కల్పించే స్థితిలో ఇవి లేవు. అందువల్ల ప్రభుత్వం ఉపాధి కోల్పోయిన వారి విషయమై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement