Saturday, November 23, 2024

నేటి సంపాద‌కీయం – ఎగ‌వేత‌దారులు వ‌స్తున్నారు..

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీని భారత్‌కి అప్పగించేందుకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రభుత్వ హోం మంత్రి అంగీకరించినట్టు సీబీఐ తెలిపింది.దీంతో కోట్లాది రూపాయిల రుణాల ఎగవేతకేసులో ప్రధాన నిందితుణ్ణి స్వదేశానికి తీసుకుని వచ్చేందుకు మార్గం సుగమమైంది. విదేశాల్లో తలదాచుకున్న ఇతర ఎగవేతదారులను కూడా ప్రభుత్వం ఇదే మాదిరిగా తీసుకుని రాగలదన్ననమ్మకం ప్రజలకు ఏర్పడు తుంది. నీరవ్‌ మోడీని అప్పగించాలంటూ భారత్‌ పంపిన వారంట్‌ ను పురస్క రించుకుని లండన్‌ మెట్రో స్టేషన్‌లో ఆయనను 2019లోనే అక్కడిపోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సుదీర్ఘవిచారణ అనంతరం గత ఫిబ్రవరి 25వతేదీన వెస్ట్‌ మినిస్టర్‌ మేజస్ట్రేట్‌ కోర్టు నీరవ్‌ మోడీని భారత్‌కి అప్పగించాలని ఆదేశించింది. అయితే, చివరి వరకూ నీరవ్‌ మోడీ తనకున్న పరిచయాలను పురస్కరించుకుని తప్పించుకోవాలని ప్రయత్నించారు. కానీ, అక్కడి నిబంధనలప్రకారం నీరవ్‌ని అప్పగించేందుకు యూకె హోంశాఖ ఎట్టకేలకు అంగీకరించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి తీసుకున్న దాదాపు 14వందల కోట్ల రూపాయిల రుణాల ఎగవేతకేసులో నీరవ్‌ మోడీపైనా, ఆయన సమీప బంధువు మెహుల్‌ చోక్సీపైనా 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. నీరబ్‌ మోడీని అప్పగించేందుకు భారత్‌లో పరిస్థితులు అనుకూలంగా లేవనీ, మానవ హక్కుల ఉల్లంఘ న జరుగుతోందనీ, కోవిడ్‌ వ్యాప్తి కారణంగా ముంబాయి నగరంలో నిరవధిక కర్ఫ్యూ సాగుతోందని ఆయన తరఫున న్యాయవాదులు గట్టిగా వాదించినా మేజస్ట్రేట్‌ ఆ వాదనల ను తోసిపుచ్చారు. ముంబాయిలోని జైలులో భారీ భద్రత మధ్య నీరవ్‌ని ఉంచేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించారు. చివరికి ఆయనను స్వదేశానికిపంపేందుకు బ్రిటన్‌ హోం మంత్రి అంగీకరించారు. లాంఛనాలు పూర్తికాగానే ఆయనను తీసుకుని రానున్నారు. బ్యాంకులకు భారీగా రుణాలను ఎగవేసివిదేశాల్లో తల దాచుకున్న ఆర్థిక నేరస్థులను స్వదేశానికి రప్పించి విచారణ జరిపించేందుకు నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అయితే, నీరవ్‌ మోడీని కాపాడేందుకు నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్‌ నాయకులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఈపరిణామంతో రుజువైంది. నీరవ్‌కి ముందే లండన్‌కి చెక్కేసి అక్కడే స్థిర నివాసం ఉంటున్న విజయ్‌ మాల్యాని కూడా స్వదేశం రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే, సాంకేతిక పరమైన అంశాలను అడ్డుపెట్టుకుని మాల్య తప్పించుకోగలుగుతున్నారు.ఒక దశలో తాను బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని మాల్యా ప్రకటించారు.నీరవ్‌ మోడీని రప్పించి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కేసును పరిష్కరిస్తే దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థపై పడిన మచ్చ తొలగిపోతుంది. నిజానికి అన్నివేల కోట్ల రూపాయిలరుణాలను ఎలా ఇచ్చారని సామాన్యు డు సైతంప్రశ్నించే పరిస్థితులను ఈకేసు సృష్టించింది. నీరవ్‌, చోక్సీల మాదిరిగానే బ్యాంకుల రుణాలను ఎగవేసిన వారందరినీ చట్టప్రకారం విచారణ జరిపించి వారికి తగిన శిక్షలు పడేట్టు చేయాలనీ, అప్పుడే బ్యాంకింగ్‌ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని బ్యాంకు ఉద్యోగుల సంఘాల వారుకూడా ఈ మధ్య పదేపదే డిమాండ్‌ చేస్తున్నారు.దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ పై అనుమానాలు వ్యక్తం కావడానికి ఇలాంటి మొండి బకాయిలే కారణ మన్న మాట ప్రతి నోటా వినిపిస్తోంది.ప్రభుత్వం ఇలాంటి ఎగవేత దారుల పట్ల మెతకగా వ్యవహరించడం వల్లనే ఎన్‌పిఏలు (నిరర్ధక ఆస్తులు) పెరిగిపోతున్నాయన్న ఆరోపణల్లో అసత్యంలేదు. నల్లధనం వెలికితీయడానికీ, మొండి బకాయిలను వసూలు చేయడానికి నరేంద్రమోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందనడానికి నీరవ్‌ మోడీని స్వదేశానికి రప్పించడాన్ని ఉదాహరణగా పేర్కొనవచ్చు. స్వదేశంలో ఉన్నఎగవేతదారులపై విచారణ విషయంలో కూడా ప్రభుత్వం తగినచర్యలు తీసుకుని తన చిత్తశుద్ధిని రుజువుచేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తే నరేంద్రమోడీ ప్రభుత్వం గొప్ప ఖ్యాతిని ఆర్జించినట్టు అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement