Friday, November 22, 2024

మానవతకు మాయని మచ్చ

ఉత్తర ప్రదేశ్‌లో నేరాలకు, ఘోరాలకు పేరుమోసిన లఖింపూర్‌ఖేరీ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకున్నది. షెడ్యూల్డ్‌ కులానికి చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లపై ముగ్గురు అత్యాచారం చేసి హత్య చేయడమేగా వారి మృతదేహాలను చెట్టుకు వేలాడదీసిన ఉదంతం మానవతకు మాయని మచ్చే. గతంతో పోలిస్తే 2021లో ఉత్తర్‌ప్రదేశ్‌లో హత్యాచారాలవంటి ఘోర నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో కొద్ది రోజుల క్రితం తాజా నివేదికను విడుదల చేయగా ఇప్పుడు ఈ సంఘటన ఆ నివేదిక విశ్వసనీయతకు సవాలు విసిరినట్టయింది. తమకు రక్షణ కావాలంటూ ఎంతో కాలంగా వారు మొరపెట్టుకుంటున్న నేపథ్యంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తమ అభ్యర్థనలను యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పెడ చెవిన పెడుతున్నదని దళిత సంఘాలు పేర్కొంటున్నా యి. తాజాగా హత్యాచారానికి గురి అయిన దళిత సోదరీ లు ఇద్దరూ మైనర్లే. వారిని బుధవారం నాడు వాళ్లింట్లో ఉండగా ఈడ్చుకుని వెళ్లి అత్యాచారం చేశారని, తర్వాత హత్య చేసి ఒక చెట్టుకు వేలాడదీశారని స్థానికులు చెబుతున్నారు.

అయితే, పోలీసులు మాత్రం నిందితుల్లో ఒకడైన జునైద్‌ కథనాన్నే వల్లె వేసినట్లు వినిపిస్తున్నారు. ఈ సంఘటనలో బాధితులు ఇద్దరూ నిందితులకు పరిచ యస్తులేననీ, జునైద్‌ రమ్మనమంటే వారు స్వచ్ఛందంగా వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. కానీ మృతుల తల్లిదండ్రుల కథనం వేరేలా ఉంది. తమ కళ్ల ముందే బైక్‌లపై వచ్చిన నిందితులు తమ కుమార్తెలను ఎత్తుకెళ్లా రని చెబుతున్నారు. వివాహం చేసుకోవాలని ఇద్దరు నిందితులు అక్కచెల్లెళ్లను బెదరించారని, వారు తిరస్క రించడంతో అత్యాచారం చేసి హతమార్చి, మరికొందరి సహాయంతో చెట్టుకు మృతదేహాలు వేలాడదీశారని గ్రామస్థులు చెప్పారు. ఈ కేసులో అత్యాచారానికి పాల్ప డిన ఇద్దరు నిందితులతోపాటు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిజానికి ఇలాంటి సంఘటనలన్నింటిలో ఒకే రీతిలో ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు ధ్రువీకరిస్తున్నా రేమో అనిపిస్తోంది. యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి ఐదారు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే నేరస్థులను విడిచిపెట్టేది లేదనీ, ఎవరినీ విడిచిపెట్టబోమని యోగి ప్రతిసారిలా పాత కథనాన్నే వినిపిస్తున్నారు.

కొద్దినెలల క్రితం కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఆందోళన సాగిస్తున్న రైతుల మీద నుంచి వాహ నం నడపడంతో ఎనిమిదిమంది మరణించారు. ఆశిష్‌ మిశ్రాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికే నెలలు పట్టింది. అతడిని అరెస్టు చేసేందుకు మరింత సమయం పట్టింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో రెండేళ్ల క్రితం పందొమ్మి దేళ్ల బాలికపై అగ్రవర్ణాలవారు దాడి చేసి ఎత్తుకునిపోయి హత్యాచారం జరిపిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ సంఘటనలో కూడా నిందితులు అగ్రవర్ణాల కు చెందినవారే. వారిని అరెస్టు చేయడానికి యోగి ప్రభు త్వం ఎంతో కాలం తటపటాయించి చివరికి అన్నివర్గాల ఒత్తిడితో తల ఒగ్గింది. యోగి ఆదిత్యనాథ్‌ అధికారం లోకి వచ్చిన తర్వాత 8,016 హింసాత్మక సంఘటనలు జరిగాయి. 20 మందికి పైగా మరణించారు. మరో 400 మందికి పైగా గాయపడ్డారు. లాకప్‌డెత్‌లు, ఎన్‌కౌంటర్ల సంగతి చెప్పనవసరం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నిం టిలో ఉత్తర ప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉందన్న ఆరోపణ లున్నాయి. వీటిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ ఖండించడమే కాకుండా ఇలాంటి సంఘటనలు బీజేపీయేతర రాష్ట్రాలలోనూ జరుగుతున్నాయంటూ సమర్థించుకుంటున్నారు.

యూపీ పెద్ద రాష్ట్రం కనుక, దేశ ప్రధాన మంత్రులలో ఎక్కువ మందిని అందించిన రాష్ట్రం కనుక, ఆ రాష్ట్రం మీద దేశ ప్రజల దృష్టి కేంద్రీకృ తం కావడంలో విశేషం లేదు. అయితే, బీజేపీయేతర రాష్ట్రాలలో కూడా నేరాలు, ఘోరాలు పెచ్చుపెరుగుతు న్నమాట వాస్తవమే. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అల్లర్లు జరగనే లేదంటు యోగి బుకాయిస్తున్నా రు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో తాజా నివేదిక ప్రకారం ఉత్తర్‌ ప్రదేశ్‌లో గత ఏడాదితో పోలిస్తే తీవ్ర నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2021లో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌కు నేరాల పట్టిక లో 23వ స్థానం వచ్చిందని పేర్కొంది. కానీ లఖింపూర్‌ ఖేరీ జిల్లాలోని తాజా సంఘటన యూపీలో పరిస్థితికి అద్దం పడుతోంది. నేరాలను నిరోధించే విషయంలో చర్చించేందుకు వీలుగా పూర్వపు ప్రభుత్వాలు తరచూ జాతీయ భద్రతా మండలి సమావేశాలు నిర్వహించేవి. అంతర్‌ రాష్ట్ర దొంగలు, హత్యాచారానికి పాల్పడినవారి వివరాలను పరస్పరం మార్పిడి చేసుకునేవి. వీటిని నిరో ధించేందుకు ప్రణాళికలను అమలు చేయాల్సిన కేంద్ర హోంమంత్రి బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడం లో బిజీగా ఉన్నారన్నది విపక్షాల విమర్శ.

Advertisement

తాజా వార్తలు

Advertisement