చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూయడంతో చైనాలో ఒక శకం ముగిసింది. చైనాను ఆర్థికంగా నిలబెట్టిన నాయకునిగా జెమిన్ పేరు సంపా దించుకున్నారు.ఆయన మంచి వ్యూహకర్త,గొప్ప దౌత్య వేత్త. చైనా చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయిన తియానన్మెన్‌స్క్వేర్ ఘటన తర్వాత డెంగ్ షావోపింగ్ నుంచి అధికారం చేపట్టారు. ఆనాటి పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో ఇప్పుడు ఆయన కన్నుమూసే సమయానికి కూడా దేశంలో అంతటి క్లిష్ట పరిస్థితి నెలకొంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్ జీరో కోవిడ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్ధులు, యువకులు, అన్ని వర్గాల వారు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు ప్రారంభించారు. తియాన్మన్‌స్క్వేర్ ఘటన తర్వాత అధికారాన్ని చేపట్టిన జియాంగ్ జెమిన్ దేశాన్ని గాడిలో పెట్టేందుకు చాలా కష్టపడ్డారు.దెబ్బతిన్న చైనా పరపతిని పునరుద్ధరిం చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనాకు సభ్యత్వం లభించేట్టు చేశారు. అమెరికాతో సంబంధాల విషయంలో ఎంతో నేర్పుగా వ్యవహరించారు.
ఆయన పదవీ విరమణ చేసే నాటికి చైనా సూపర్ పవర్ హోదాని అందుకుంది.ఒలింపిక్ బిడ్స్‌ని సాధించడంలో ఆయన చాతుర్యంగా వ్యవహ రించారు. చైనా అధ్యక్షునిగా పదవీ విర మణ చేసిన తర్వాత కూడా తన స్వస్థలమైన షాంఘై నగరంలో ఉంటూ దేశాభివృద్దికి అవవసరమైన సూచనలు చేశారు. ఆయనకు కమ్యూనిస్టు పార్టీలో కూడా మంచి అనుచర గణం ఉంది. ఆయన మరణాన్ని తట్టుకో లేకపోతున్నట్టు కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది.ఆర్థిక సంస్కరణలకు పునాది పడింది ఆయన హయాంలోనే. చైనా కుబేరుల్లో ఒకరైన ఆలీబాబా సంస్థ అధినేత జాక్ మా వాణిజ్య వేత్తగా ప్రపంచ ప్రసిద్ధి చెందడంలో జియాంగ్ ప్రోత్సాహం ఉంది.అయితే, జిన్‌పింగ్ అధి కారంలోకి వచ్చిన తర్వాత జియాంగ్ వర్గాన్ని అణచి వేశారన్న ఆరోపణలున్నాయి. ఆయనకు సన్నిహితుడైన జాక్ మా దేశం విడిచి వెళ్లడానికి ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్ అనుసరించిన అణచివేత విధానాలే కారణ మన్న ఆరోపణలూ వచ్చాయి.
జాక్ మాకి చెందిన ఆలీ బాబా సంస్థపై బిలియన్ డాలర్ల జరిమానాను విధించింది.ఈ కారణంగా ఆయన హాం కాంగ్‌లో కొంత కాలం గడిపి తర్వాత జపాన్ చేరుకున్నట్టు సమా చారం.అయితే,ఆర్థిక సంస్కరణల అమలులో జియాంగ్‌కు ఎంతో తోడ్పడిన జాక్ మా ఉన్నదిఉన్నట్టు మాట్లాడటమే ఆయన చేసిన నేరం. చైనా ఆర్థిీక విధానాల్లో మార్పులను జియాంగ్ జెమిన్ సూచించి నందుకు ఆయననూ, ఆయన సమర్ధించే జాక్ మా వంటి వారిని జిన్‌పింగ్ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేసింది. ఆర్థికంగా చైనా నిలబడటానికి ఎంతో శ్రమించిన జియాంగ్ జెమిన్‌పై జిన్‌పింగ్ ఎన్నో నిరాధారమైన ఆరోపణలు చేయడం జాక్ మా వంటి ఆర్థిక వేత్తలు సరిపెట్టుకోలేకపోయారు.దేశ ఆర్థిక విధానాల్లో మార్పు అవసరమే కానీ, అవి ఎంతో కాలంగా కొనసాగుతున్న మౌలిక పరిస్థితులను దెబ్బతీయకుండా చూసుకోవా లన్నది జియాంగ్ జెమిన్ ఉద్దేశ్యం.నిజానికి 96 ఏళ్ళ వయసు గల జెమిన్ వంటి అనుభవం ఉన్న నాయకుడి సలహాలనూ స్వీకరించడానికి బదులు జిన్‌పింగ్ ఆయనను ఎన్నో విధాల అవమానించారు.జిన్‌పింగ్ ధోరణి వేరు. అణచివేత ద్వారా పాలన సాగించా లనుకు న్న మావోవిధానానికి దగ్గరగా ఉంది. తియానన్మెన్ స్క్వేర్ ఘటనలో పాల్గొన్న విద్యార్ధులు, యువకులను దారికి తేవడంలో జియాంగ్ చాలా దృఢమైన వైఖరిని అనుసరించారు.
అదే సమయంలో జియాంగ్ ప్రజాస్వామ్యానికీ,మానవ హక్కులకూ విడదీయ రాని సంబంధం ఉందని విశ్వసించడమే కాకుండా దానిని అమలులో పెట్టేందుకు ప్రయత్నిం చారు. అదే సందర్భంలో అంతర్గతంగా అసమ్మతిని అణచివేశారు. ఫౌలంగ్ గాంగ్ అనే ఆధ్యాత్మిక ఉద్య మాన్ని కూడా అణచివేశారు.ఆయన తన హయాంలో అమెరికాలో ఎన్నో సార్లు పర్యటించారు.యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఆయన జరిపిన పర్యటన వివాదాస్పదమైం ది. ఆర్థికవిధానాల్లో ఆయనది ఉదారవాదమని చాలా మంది వ్యాఖ్యానించేవారు. ఆయన దూకుడుకు డెంగ్ బ్రేకులు వేసేవారనీ,లేని పక్షంలో ఆయన హయాంలోనే మరిన్ని సంస్కరణలు అమలు జరిగి ఉండేవని విశ్లేషకులు వ్యాఖ్యాని స్తుంటారు. జియాంగ్ చేయా లనుకున్న పనులు చేసేసే వారనీ,అదే సందర్భంలో నిర్లిప్తతను సహించేవారు కారని వారు పేర్కొంటారు. జియాంగ్ చైనా చరిత్రలో ఒక స్థిరమైన ముద్ర వేశారని వారు స్పష్టం చేశారు.