Friday, November 22, 2024

అమిత్‌షా కాశ్మీర్‌ వ్యూహం..!

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జమ్ము,కాశ్మీర్‌లో జరిపిన తాజా పర్యటన శాంతిభద్రతలను పర్యవేక్షించ డానికేనని అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ, అసెంబ్లి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ (డీ-లిమిటేషన్‌) పై అక్కడి పార్టీలనూ, ప్రజలనూ ఒప్పించడానికేనన్నది సుస్పష్టం,ఆయన తాను జరిపిన పర్యటనలో డీ లిమిటేషన్‌ అంశం గురించే ప్రధానంగా ప్రస్తావన చేశారు. డీలిమిటేషన్‌కి అంగీకరిస్తే అసెంబ్లి ఎన్నికలు జరిపిస్తామని ఆయన రాజౌరీ, బారాముల్లాలలో జరిగిన ర్యాలీల్లో ప్రకటించారు. కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణాన్ని రద్దు చేస్తే రాష్ట్రంలో రక్తం ఏరులై పారుతుందంటూ ప్రతిపక్షాలు అదే పనిగా ప్రచారం చేశాయనీ, నిజానికి ఉమ్మడి కాశ్మీర్‌లో కన్నా, ప్రజలు ఇప్పుడు నిశ్చింతగా జీవిస్తున్నారని ఆయన అన్న మాటల్లో పూర్తి వాస్తవం లేదు. రాష్ట్రంలో ఇప్పటికీ ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో పరిస్థితిపై కేంద్రానికి అంత నమ్మకం ఉంటే, కేంద్ర సాయుధ దళాలను ఇప్పటికీ ఎందుకు కొనసాగిస్తున్నదో స్పష్టం చేయాలి. నిజానికి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన జరిగిన తర్వాత జమ్ము, కాశ్మీర్‌లలో గతంలో కన్నా అశాంతి ఎక్కువైంది. అసెంబ్లి ఎన్నికలను జరిపించి కాశ్మీర్‌నికూడాతమ పార్టీ ఖాతాలో వేసుకోవాలన్న తహతహ బీజేపీ నాయకుల్లో ఎక్కువ కనిపిస్తోంది. సప్రధానమంత్రి నరేంద్రమోడీ జరిపిన కాశ్మీర్‌ పర్యటనలో డీ లిమిటేషన్‌ గురించే ఎక్కువ మాట్లాడారు.

డీ- లిమిటేషన్‌ వల్ల కాశ్మీరీలకు నష్టం కలుగుతుందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌,పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (పీడీపీ)లు వాదిస్తున్నాయి. డీ లిమిటేషన్‌ వల్ల జమ్ము- కాశ్మీర్‌ అసెంబ్లిdలో కాశ్మీర్‌ ప్రాంతం సీట్లు తగ్గుతాయని ఈ రెండు పార్టీలూ వాదిస్తున్నాయి. ఇందులో కొంత నిజం లేకపోలేదు. జమ్ము ప్రాంతంలో బీజేపీకి బలం ఉంది.ఆ బలాన్ని పెంచుకోవడానికి డీ లిమిటేషన్‌ ఒక మంచి అవకాశమని కమలనాథులు భావిస్తున్నారు.ఉమ్మడి కాశ్మీర్‌లో కూడా తనబలాన్ని పెంచుకునేందుకు బీజేపీ పలురకాల వ్యూహాలను అనుసరించింది.అయితే, కాశ్మీర్‌ లోయలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌,పీడీపీలకు ఎక్కువ బలం ఉండేది.ఈ రెండు పార్టీల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల బీజేపీ తన మాట నెగ్గించుకునేది. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేరుకి ఆమె ముఖ్య మంత్రిగా ఉన్నప్పటికీ,ఉపముఖ్యమంత్రిగా ఉండిన నిర్మల్‌ కుమార్‌ సింగ్‌ని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రం సంప్రదించేది. దీనిపై అప్పటి ముఖ్య మంత్రి,పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అభ్యం తరం తెలిపేవారు. అసలు రాష్ట్ర వ్యవహారాల్లో బీజేపీ కేంద్ర నాయకుల జోక్యం ఎక్కువ కావడం వల్లనే మెహబూబా బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. జమ్ములోని పలు ప్రాంతాల్లో పాఠశాలల్లో సిలబస్‌ ,పాఠ్య పుస్తకాల విషయంలో పీడీపీ,నేషనల్‌ కాన్ఫరెన్స్‌ జోక్యం చేసుకునేవి కావు.

అదే మాదిరిగా కాశ్మీర్‌ లోయలోని పాఠశాలల్లో విద్యాబోధన,విద్యా సంస్థల వ్యవహారాల్లో బీజేపీ నాయకులు జోక్యంచేసుకోరాదని ఈ రెండుపార్టీలు డిమాండ్‌ చేసేవి. 370 ,35-ఎ అధికరణాల రద్దు వల్ల స్థానికేతరులు సొంత ఆస్తులను కలిగి ఉండవచ్చునని కేంద్రం నమ్మబలికినప్పటికీ,ఆ హక్కు జమ్ము ప్రాంతానికే పరిమితం అయ్యేది, కాశ్మీర్‌లో తోటలు,భవనాల కొనుగోలు విషయంలో మాత్రం పీడీపీ,ఎన్‌సీ పార్టీలు అభ్యంతరం చెబుతూ ఉండేవి. అందువల్ల ఇప్పుడు మళ్ళీ అదే వివాదం తలెత్త వచ్చని రాజకీయ పార్టీయేతరులు ఆందోళన చెందు తున్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ప్రాబల్యం పెరగడానికి ముందు స్థానికేతరులు యథేచ్ఛగా ఆస్తులు కొను గోలు చేసుకునేవారు. బీజేపీ నాయకులు 370వ అధికరణంరద్దు వల్ల దేశమంతటికీ వర్తించే కేంద్ర చట్టాలు కాశ్మీర్‌లో కూడా వర్తిస్తాయని చెబుతున్నప్పటికీ అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఈ అంశం గురించి ఉద్దేశ్యపూర్వకంగానే విస్మరిస్తున్నారు, జమ్ములో సీట్ల సంఖ్య పెంచి వాటిలో మెజారిటీ సాధించడంద్వారా రెండు ప్రాంతాల్లో తమ బలాన్ని పెంచుకోవాలన్న కమలనాథుల వ్యూహాన్ని కనిపెట్టడం వల్లనే డీలి మిటేషన్‌ ప్రక్రియను పీడీపీ,నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వ్యతిరేకిస్తున్నాయి. డీలిమిటెషేన్‌ ప్రక్రియలో తమకు కూడా భాగం కల్పించినప్పుడే కాశ్మీర్‌కి న్యాయం జరుగు తుందని ఈ రెండు పార్టీలు వాదిస్తున్నాయి. అయితే, మోడీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా,370వ అధికరణం రద్దు విషయంలో చొరవ తీసుకున్నట్టు ఈ విషయంలో కూడా ఏకపక్షంగా ముందుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోందన్నది ఈ రెండు పార్టీల ఆరోపణ. ఈనేపథ్యంలోస్థానికుల అభిప్రాయాలను సేకరిం చడం పేరిట వారిలో చీలికలు తెచ్చేందుకే అమిత్‌ షా కాశ్మీర్‌లో పర్యటించారన్న పీడీపీ,నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ల భయ సందేహాలను పూర్తిగా తోసిపుచ్చలేం.

Advertisement

తాజా వార్తలు

Advertisement