Saturday, November 23, 2024

అమెరికా ద్వంద్వ నీతి!

అమెరికాపై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడి జరిపిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై పోరు ప్రారంభించిన ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ పాక్‌కి రెండు వందల బిలియన్‌ డాలర్ల సాయాన్ని అందించారు. ఆనాటి పాక్‌ అధ్యక్షుడు ముషార్రఫ్‌ ఒడుపుగా అమెరికా సాయాన్ని ఉపయోగించుకుని ఉగ్రవాద సంస్థల కోసమే ఖర్చు చేశారు.ఈ విషయాన్ని ముషార్రఫ్‌ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకున్నారు. అంతటి ఘన కీర్తి గల పాకిస్తాన్‌కి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరు కోసంమళ్ళీ సాయపడటం ఎవరిని మోసం చేయడం కోసం? అన్న విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రశ్న సబబు గానే ఉంది. అమెరికాకి ఇంగితం ఉంటే ఈ ప్రశ్నకు తలదించుకోవాలి. అమెరికా గతంలో తాను సరఫరా చేసిన ఎఫ్‌-16 విమానాల కు 450 మిలియన్‌ డాలర్ల విలు వైన విడిభాగాలను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా పేరు మోసిన పాకిస్తాన్‌ ఇప్పటికీ ఉగ్రవాద సంస్థలకు నారువేసి నీరు పోస్తున్నది. ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాద సంస్థలపై వేటు పడకుండా చైనా అండకోరుతోంది. ఒక వైపు చైనాని ఎదుర్కోవ డానికి భారత్‌ వంటి దేశాల సాయం అవసరమంటూ దీర్ఘాలు తీసే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ చైనా ఉగ్ర వాద సంస్థలకు ఎలా కాపుకాస్తారు? పాక్‌, చైనాల మధ్య అనైతిక, అక్రమ దౌత్య సంబంధాలను ప్రోత్సహిస్తున్న అమెరికా ఉగ్రవాదంపై పోరు కోసమే ఇదంతా చేస్తున్న ట్టు ప్రకటించడం వితండం కాక మరేమిటి? అంతేకా కుండా ఈ చర్యతో అమెరికా ప్రపంచ దేశాలను తెలివి తక్కువగా అంచనా వేయాలనుకుంటోందని జైశంకర్‌ అన్న మాటలు ఎంతో సముచితంగా ఉన్నాయి.

అమెరికా అంతర్జాతీయంగా వివిధ దేశాలతో అనుసరిస్తున్న వైఖరి, సంబంధాల్లో హేతుబద్దత లేశమాత్రమైనా లేదని జైశంకర్‌ అన్నమాటలు అక్షర సత్యం. అమెరికాది మొద టి నుంచి అవకాశవాదమే. అసలు ఉగ్రవాదంపై అమెరి కా చేస్తున్నపోరులో నిజాయితీ ఉందా అన్న ప్రశ్న ఇప్పటికే ప్రపంచ దేశాలు వేస్తున్నాయి. విదేశాంగ విధానాన్ని వాణిజ్యంతో ముడిపెట్టి ప్రపంచాన్ని మభ్యపెట్టే ప్రయత్నం అమెరికా చేస్తోంది. అలాగే, అమెరికా మీడియా భారత్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. భారత్‌లో మానవహక్కుల గురించి అమెరికా మీడియా అదే పనిగా అసత్యాలను ప్రచారం చేస్తోంది. పాక్‌ని ప్రసన్నం చేయడానికే కాశ్మీర్‌ అంశాన్ని పదే పదే ప్రస్తావన చేస్తోంది. కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణాన్ని రద్దు చేయడాన్నీ, లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని అమెరికా మీడియా కూడా తప్పు పడుతోంది. ఈ విషయంలో చైనావైఖరిని అమెరికా మీడియా సమర్ధిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఉగ్రవాద సంఘటనలకు మతంతో ముడిపెట్టే ప్రయత్నమూ జరుగుతోంది. అగ్రరాజ్యం సంకుచిత రాజకీయాలకు అతీతంగా వాస్తవాల ఆధారంగా వార్తలనూ, కథనాలను ప్రపంచానికి అందించాలి.

అమెరికాలోని పత్రికలు ఈ ఇంగితాన్ని పాటించడం లేదంటూ జైశంకర్‌ చేసిన విమర్శ ఎంతో సముచితంగా ఉంది. కాశ్మీర్‌ ద్వైపాక్షి అంశమనీ, ద్వైపాక్షిక చర్చల ద్వారానే భారత్‌, పాక్‌లు పరిష్కరించుకోవాలని 50 ఏళ్ల క్రితం రెండు దేశాల ప్రధానులు సివ్లూలో చేసుకున్న ఒప్పందం చారిత్రాత్మక మైనదన్న విషయం అగ్రరాజ్యానికి తెలియదని అనుకో వాలా? అమెరికా భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలు, వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటోంది. అటువంటప్పుడు భారత్‌, పాక్‌ల మధ్య కుదిరిన ఒప్పందం తెలియదన్నట్టుగా వ్యవహరించడం అమెరికా మీడియాకి తగునా అని జైశంకర్‌ ప్రశ్నించడం కూడా సబబుగానే ఉంది. అమెరికా కోరుతున్నది స్నేహం కాదు, స్నేహం ముసుగులో వాణిజ్య ప్రయోజనాలు. పోనీ అలా తీసుకున్నా పాకిస్తాన్‌ నుంచి అమెరికా ఏం ఆశిస్తోంది? పాకిస్తాన్‌ దివాళా తీసిన దేశంగా ముద్రవేయించుకోవ డానికి వడిగా అడుగులు వేస్తోంది. సౌదీ అరేబియా వంటి అస్మదీయ దేశాలే పాకిస్తాన్‌ని దూరంగా పెడుతున్నాయి. అయినా ఉగ్రవాదంపై పోరుచేసే శక్తి పాకిస్తాన్‌కి ఎక్కడుంది? పక్కనున్న తాలిబన్లు పాక్‌ సైనికాధికారులు, మతాధిపతులను శాసించే పరిస్థితి అక్కడ ఉంది.

తాలిబన్లను అణచివేయడానికి పాకిస్తాన్‌కి గతంలో అమెరికా అందించిన డాలర్లన్నీ బూడిదలో పోసిన పన్నీ రయ్యాయి. ఇప్పుడు కొత్తగా అందించే నిధులు కూడా ఉగ్రవాద సంస్థలకూ,వాటి కార్యకలాపాలాకు చేరవన్న గ్యారంటీ ఏముంది? జార్జి బుష్‌, ట్రంప్‌ వంటి రిపబ్లికన్‌ నాయకులకు భిన్నంగా ఉదారంగా ఉంటారనుకున్న బిడెన్‌ వంటి డెమోక్రాటిక్‌ నాయకుడు కూడా పాకిస్తాన్‌కి సాయం చేయబూనడం భారత్‌నే కాకుండా,ప్రపంచ దేశాలను విస్మయ పరుస్తోంది. భారత్‌తో మైత్రి చేస్తూ పాక్‌కు సాయం చేయడం ఎంతవరకు సమంజసం.

Advertisement

తాజా వార్తలు

Advertisement