Saturday, November 23, 2024

అజాత శత్రువు.. అందరివాడు

తెలుగు చలనచిత్ర సీమలో పాత తరం దర్శకులు వందేమాతరం వంటి దేశభక్తి ప్రపూరితమైన చిత్రాలను నిర్మించారు కానీ, మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు కథను తెరకెక్కించే సాహసం ఎవరూ చేయలేదు. ఆ కథ చాలా క్లిష్టమైనదే కాకుండా, వివాదాస్పదమైనది. ఆ రోజుల్లో సీతారామరాజు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా సాగించిన సాయుధ పోరాటాన్ని సొంతం చేసుకోవడానికి రాజకీయాల్లో కొన్ని వర్గాలు ప్రయత్నించాయి. ఎటు వైపు నుంచి మొదలు పెట్టినా వివాదాలు తప్పవన్న ఉద్దేశ్యంతో ఉద్దండులైన దర్శకులు, నిర్మాతలు సైతం దాని జోలికి వెళ్లలేదు. ఆ సమయంలో అప్పుడే పరిశ్రమలో పేరు తెచ్చుకుంటున్న హీరో కృష్ణ సాహసించి అల్లూరి సీతారామరాజు కథను తెరకెక్కించారు. ఏ వర్గాన్నీ నిరుత్సాహపర్చకుండా, అగౌరవపర్చకుండా, చారిత్రకాం శాలను కథరూపంలో మలిచి చిత్రాన్ని నిర్మించిన సాహ సికుడు, అజాత శత్రువు సూపర్‌స్టార్‌. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సాహసాలు చేసిన మొనగాడు ఆయన. మొనగాళ్ళకు మొనగాడు. ఆయన ఏభై ఏళ్ల పైచిలుకు సినీ జీవితంలో ఆయన 352 చిత్రాల్లో నటించారు. వాటిల్లో కొన్నింటికి దర్శకత్వం వహించారు. ఇవన్నీ ఒక ఎత్తు. అల్లూరి చిత్రాన్ని నిర్మించడం మరొక ఎత్తు. తూర్పుగోదావరి, విశాఖ ఏజెెన్సీ ప్రాంతాల్లో వాతావరణం మైనస్‌ డిగ్రీకి పడిపోయే లంబసింగి వంటి ప్రాంతాలకు, వందల మందిని తీసుకుని వెళ్ళి ఈ చిత్రా న్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్టులైన మహాకవి శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు వంటి కవులు ఆ చిత్రం కోసం రాసిన గీతాలు ఇప్పటికీ వింటుంటే తెలుగు వారి రక్తం మరుగుతుంది.

వాటిల్లో శ్రీశ్రీ రాసిన తెలుగువీర లేవరా! దీక్షబూని సాగరా!! అనే గీతం మకుటాయమానం. సీతారామరాజు గురించి కథలు, కథనాలే తప్ప ఎలా ఉంటాడో తెలియని ఆ మహావీరుణ్ణి ఊహించుకుని ఆ పాత్రకు రూపకల్పన చేసిన ఆర్టిస్టుల నుంచి ఆ పాత్ర చేత పిడుగుల్లాంటి సంభాషణలు పలికింపజేసిన త్రిపురనేని మహారథి వరకూ అందరూ దీక్షతో తపస్సు మాదిరిగా భావించి తమ విధులను నిర్వహించడం వల్లనే సీతా రామరాజు కృష్ణ రూపంలో తెలుగు ప్రజల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ చిత్రాన్ని నిర్మించిన కృష్ణ అన్ని వర్గాల ప్రజల మన్ననలను అందుకున్నారు. సాహసానికి మారుపేరుగా చరిత్రకెక్కారు. తెలుగు చలనచిత్ర రంగంలో తొలి సినిమా స్కోప్‌ చిత్రంగా సీతారామరాజు తెలుగు ప్రేక్షకులను అలరించింది. కృష్ణ అంటే సీతా రామరాజు… సీతారామరాజంటే కృష్ణ అనేంతగా మంచిపేరు ఈ చిత్రం ద్వారా కృష్ణకు దక్కిం ది. అలాగే, తెలుగులో తొలి కౌబాయ్‌ చిత్రాన్ని అందించి కృష్ణ మరో రికార్డును నెలకొల్పారు. కృష్ణ ఏ సినిమా తీసినా, ఏ పాత్ర పోషించినా సంచలనమే. అందుకే, ఆయన చిత్రం వస్తోందంటే ఆ రోజుల్లో ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూసేవారు. సినిమాని ప్రయోజనాత్మ కంగా, సందేశా త్మకంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష కృష్ణ నిర్మించిన పాడి పంటలు, ఈనాడు వంటి చిత్రాల్లో ప్రస్ఫుటమవుతుంది. దాదాపు ఐదున్నర దశాబ్దాల క్రితం అంతా నూతన నటీనటులతో ఆదుర్తి సుబ్బారావు తీసిన తేనెమనసులు చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన కృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో ఇంత వేగంగా పైకి రావడానికి ఆయనలోని దృఢదీక్ష, పట్టుదల, కష్ట సహిష్ణుత ముఖ్యమైనవి.

- Advertisement -

హీరోగా ఆయన నటించిన తొలి సినిమాల్లో సంభాషణ లను పలకడంలో లోపాలను బహిరంగంగానే ఎత్తి చూపేవారు. దానికి ఆయన ఏమాత్రం బిడియ పడకుండా, ఎవరిపైనా కోపం తెచ్చుకోకుండా, సంభాష ణా చతురతను సాధించి రూపానికి తగినట్టుగా పిడుగులు కురిపించే సంభాషణలను పలికించేవారు. ఆ రోజులలో అంతటి పటిష్టమైన భాషను, పదాలను అందించిన సంభాషణా రచయితలు ఉండటం కూడా ఆయన అదృష్టం. తెలుగు సినీ రంగానికి ఆధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని పరిచయం చేసిన వ్యక్తిగా కృష్ణ పేరు చిరస్థాయి గా నిలిచిపోతుంది. ద్విపా త్రాభినయానికే పరిమితమైన తెలుగు సినీరంగంలో త్రిపాత్రాభినయం చేసిన ఘనత కృష్ణకే దక్కుతుంది. ఆయన నిర్మించిన చిత్రాల్లో ఎక్కువగా గ్రామీణ వాతావరణానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. గ్రామాల్లో నీటి తగాదాలు, వడ్డీ వ్యాపారుల చేతిలో రైతు లు అనుభవించే కడగండ్లు వంటి కథాంశాలపై చిత్రాలు అప్పటికే వచ్చినా సరికొత్త రీతిలో వాటిని ప్రేక్షకుల ముందు ఉంచేవారు. పాత తరానికి చెందిన సీనియర్‌ నటుల దగ్గర నుంచి కొత్త వారి వరకూ అందరినీ కుటుం బ సభ్యులుగా పరిగణించి వారి ద్వారా తాను ఆశించిన పని నాణ్యతను రాబట్టుకునే వారు. సినీ ఉద్దండులతో కలిసి నటించిన చరిత్ర ఆయనది. తనతో పాటు అందరూ బతకాలనే సిద్ధాంతాన్ని ఆయన ఆచరణలో చూపారు. అందుకే, కృష్ణ ఇక లేరన్న వార్త వినగానే తమ సొంత రక్త సంబంధీకులను కోల్పోయామన్న రీతిలో యావత్‌ తెలుగు సినీలోకం విలపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement