Monday, November 25, 2024

నేటి సంపాద‌కీయం – భార‌త్ ద‌న్ను.. చైనా క‌న్నెర్ర‌.!

హిందూ మహాసముద్రం ముఖద్వారంగా అభి వర్ణించబడే మాల్దివులు చిరకాలంగా భారత్‌తో మైత్రిని కోరుతోంది. భారత్‌ నుంచి ఆహారం, నిత్యావసర వస్తువులు దిగుమతి చేసుకుంటోంది. మాల్దివులకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. అయితే, కరోనా కారణంగా పర్యాటకులసంఖ్య తగ్గడంతో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. మాల్దివులతో మైత్రిని పురస్కరించుకుని ఇప్పటికీ ఆ దేశాన్ని మన దేశం ఆదుకుంటోంది. మాల్దివులు భారత్‌తో సాన్నిహిత్యంగా ఉండటం చైనాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆ మాటకొస్తే ఆసియాలోని దేశాల్లో అత్యధికం భారత్‌ వైపు మొగ్గుచూపడాన్ని కూడా చైనా జీర్ణించుకోలేకపోతున్నది. చైనా ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత చిన్న దేశాలను కబళించే కార్యక్రమం మొదలు పెట్టింది. చైనా అనుసరిస్తున్న ఈ ధోరణికి ఎక్కువగా నష్టపోతున్నది శ్రీలంక కాగా, ఇప్పుడు మాల్దివులు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత జరిపిన తొలి విదేశీ పర్యటన మాల్దివులే.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం చిన్నదేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని మాల్దివుల అధ్యక్షుడు ఇబ్రహీం సలేహ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. భారత్‌ నుంచి మాల్దివులు 20వేల కోట్ల రూపాయిల వరకూ సాయాన్ని పొందింది. ఇంకా మాల్దివుల భద్రతా దళాలకు భారత్‌ శిక్షణ ఇస్తోంది. చేపల పట్టడంలో అధునాతన విధానాలను కూడా అక్కడి మత్స్యకా రులకు అందిస్తోంది. 2004లో సంభవించిన సునామీలో మాల్దివులు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నది. అప్పడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కూడా మాల్దివులను ఇదే మాదిరిగా ఆదుకుంది. శ్రీలంకలో రేవుల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టి ఆ రేవుల్లో వాటా కోరినట్టే మాల్దివుల్లో పెట్టుబడులకు చైనా ముందుకు వచ్చినప్పుడు మాల్దివుల ప్రభుత్వం నిరాకరించింది.

తమ దేశం స్వశక్తిమీద ఆధారపడేందుకు సాయం చేస్తే తీసుకుం టామనీ, శాశ్వతంగా పరాన్నభుక్కుగా మారేందుకు అందించే సాయం అవసరం లేదని మాల్దివుల అధ్యక్షుడు చాలా నిర్మొహమాటంగా స్పష్టం చేశారు. చైనా కడుపు మంటకు కారణం ఇదే. మాల్దివుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ అంతకు ముందు అధికారాన్ని వెలగ బెట్టినప్పుడు చైనాకు దాసోహం అయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు తటస్థంగా ఉంటున్నారు. మాల్దివుల రాజధాని మాలీలో విమానాశ్రయం కాంట్రాక్టును భారత కంపెనీ దక్కించుకుంటే దానిని రద్దు చేయించి చైనా కంపెనీకి కట్టబెట్టిన ఘనుడు యమీన్‌. ఇంకా అనేక విధాలుగా చైనా కంపెనీలకు తమ దేశంలో కాంట్రాక్టులు అప్పగించి మాల్దివుల స్వతంత్రతకు భంగం కలిగే రీతిలో వ్యవహరించాడు. అతడి హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై దర్యాప్తులో భాగంగానే అతడు జైలుకి వెళ్ళాడు. మూడునెలల క్రితం తిరిగి బయటికి వచ్చిన యమీన్‌ తిరిగి ఉద్యమాల పేరిట జనాన్ని సమీకరిం చడమే కాకుండా భారత కంపెనీలు వెళ్ళిపోవాలన్న నినాదాన్ని ఇచ్చాడు. దీనికి చైనా ప్రోద్బలం ఉందనేది జగమెరిగిన సత్యం. చైనా కంపెనీల ప్రతినిధులు మాల్దివుల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని ప్రస్తుత అధ్యక్షుడు సలేహా తీవ్రంగా వ్యతిరేకిం చారు.

అంతేకాకుండా 2018లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చైనా అప్పుల ఊబి నుంచి మాల్దివులను గట్టెక్కించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందుకు భారత్‌ సంపూర్ణ సహకారం అందిస్తోంది. అది కూడా చైనాకు కన్నెర్రగా ఉంది. మాల్దివుల జీడీపీ కన్నా ఆ దేశానికి చైనా ఎక్కువ సాయం అందించిన మాట నిజమే కానీ, చైనా ఉచ్చులోంచి మాల్దివులు బయటికి రావడం అసాధ్య మయ్యే పరిస్థితులను యమీన్‌ సృష్టించారు. ప్రస్తుత అధ్యక్షుడు సలేహ్‌ ప్రభుత్వ వ్యయంలో పొదుపును పాటిస్తూ, ఆదాయ వనరులను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పర్యాటకరంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. భారత్‌తోపాటు ఇరుగు పొరుగు దేశాల నుంచి వచ్చే పర్యాటకుల వల్ల పర్యాటక రంగం క్రమంగా పుంజుకుంటోంది. భారత్‌ సినీ తారలు థాయిలాండ్‌ తదితర ప్రాంతాలకు గతంలో వెళ్ళేవారు. కరోనా కారణంగా మాల్దివుల్లో భద్రంగా ఉంటుందని భావించి అక్కడికి ఇప్పుడు వెళ్తున్నారు. విదేశాంగ మంత్రి జై శంకర్‌ మాల్దివుల్లో పర్యటించినప్పుడు భారత్‌ అందించే సాయం ఎప్పుడూ పారదర్శకంగా ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్య చైనా భారత్‌పై ద్వేషాన్ని పెంచు కుంది. భారత్‌ వెళ్ళిపో వాలంటూ మాల్దివుల్లో సాగుతున్న ఆందోళన వెనుక చైనా హస్తం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement