YSRCP MP | ఇళ్లల్లో ఈడీ సోదాలు…

దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఇండ్లలో సోదాలు
కడప జిల్లా పులివెందులలో హైటెన్షన్ వాతావరణం


YSRCP MP | పులివెందుల, ఆగస్టు 21 (ఆంధ్రప్రభ) : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు… హైదరాబాదులోని, పులివెందులలోని ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఇళ్లలో ఏకకాలంలో ఈడి అధికారులు శోదాలను శుక్రవారం నిర్వహించారు. వైఎస్ అవినాష్ రెడ్డి, ఇంటితోపాటు దేవిరెడ్డి… శివశంకర్ రెడ్డి… డ్రైవర్ దస్తగిరి… సునీల్ యాదవ్… ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగించారు.

హైదరాబాదులో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటిలో ఈడీ సోదాలలో కీలక ఆధారాలు ఏమీ దొరకలేదన్నట్లు సమాచారం. పులివెందులలో దాదాపు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటిలో ఐదు గంటల పాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక్కడ కీలక ఆధారాలు ఏమీ దొరకనట్టు తెలుస్తోంది. ఇదే టైంలో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించగా… 30వేల రూపాయల నగదు, ఒక బంగారు గొలుసు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని ఈడీ అధికారులు తిరిగి వారికే వెనక్కు ఇచ్చినట్లు సమాచారం. పులివెందులలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలియడంతో వైసీపీ నాయకులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

ఈడీ అధికారులకు భద్రత కల్పించేందుకు సీఆర్‌పీఎఫ్ బలగాలను రంగంలోకి దిగారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కోణంలో ఏమైనా కీలక ఆధారాలు లభించాయా, లేదా అనేది తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఇదే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.