Eatala vs Bandi | బండికి ఈట‌ల స్ట్రాంగ్ కౌంట‌ర్.. ఇక నేరుగానే యుద్ధం

బీజేపీలో స్థానిక పోరు!
బండి సంజ‌య్ కుమార్ x ఈట‌ల రాజేంద‌ర్‌
శామీర్‌పేట‌కు చేరిన హుజురాబాద్ రాజ‌కీయం
ఈట‌ల ఇంటి వ‌ద్దకు చేరిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు
బండి వ‌ర్గం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఈట‌ల వ‌ర్గం మండిపాటు
కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మైన‌ ఈట‌ల.. అనంత‌రం మీడియా స‌మావేశం
మ‌న‌కు వీధి పోరు వ‌ద్దు అంటూ హిత‌వు
అబద్ధాల పునాదులపై కొందరు బతుకుతున్నారు…
ప్ర‌తి పంచాయ‌తీలోనూ స‌ర్పంచ్‌, వార్డు మెంబ‌ర్ మ‌న వాళ్లే ఉంటారు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : స్థానిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీలో వ‌ర్గ‌పోరు ప్రారంభ‌మైంది. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రారంభ‌మైన రాజ‌కీయ వ‌ర్గ‌పోరు శామిర్‌పేట‌కు చేరుకుంది. ఇంత‌వ‌ర‌కు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్‌, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ వ‌ర్గాల మ‌ధ్య ఉన్న పోరు ఇప్పుడు బ‌హిర్గ‌త‌మైంది. శామీర్‌పేట‌కు చేరుకున్న బీజేపీ శ్రేణుల‌తో ఈట‌ల స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. త‌న‌పై జ‌రుగుతున్న కుట్ర‌ల‌ను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు. ప్ర‌తి పంచాయ‌తీలోనూ స‌ర్పంచ్‌, వార్డులోని వార్డు మెంబ‌ర్ మ‌న వాళ్లే ఉంటార‌ని పార్టీ శ్రేణుల‌కు భ‌రోసా ఇచ్చారు.

ఈట‌ల వ‌ర్గీయులు మండిపాటు
హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో తనకు తక్కువ ఓట్లు రావాలని కొంత మంది పని చేశారని, అలాంటి వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమంటారా అని ప్రశ్నించారు. బీజేపీలో వర్గాలు ఉండవు.. ఉండకూడదని, అలాంటి వారికి పార్టీలో స్థానం లేదని, ఎవరైనా వ‌ర్గవిభేదాలు చేయాలని అనుకుంటే అది వారి మూర్ఖత్వమే అవుతుందని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లనే ఆదరిస్తాం, ఆదుకుంటాం.. నిధులు ఇస్తామని, అలా కాదని కొందరు గిరి గీసుకొని మరీ వర్గాలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక నుంచి అలాంటివి సహించమని హెచ్చరించారు. అయితే బండి సంజయ్ కుమార్‌ ఈ వ్యాఖ్యలు ఈట‌ల వ‌ర్గంలో పెద్ద దుమారం రేపింది. అలాగే ఈటల వర్గీయుడు గౌతం రెడ్డి పార్టీకీ రాజీనామా చేశారు.

గ‌త కొంత కాలంగా అసంతృప్తిలో ఈట‌ల వ‌ర్గీయులు
మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ వ‌ర్గీయులు గ‌త కొంత‌కాలంగా అసంతృప్తిలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకు దక్కబోతుందన్న టాక్ బలంగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో రామచందర్ రావు పేరు ఖ‌రారైంది. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమ‌యింది. ఈ అసంతృప్తిలో ఉన్న కార్య‌క‌ర్త‌ల‌కు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ వ్యాఖ్య‌లు ఆజ్యం పోసింది. దీంతో తాడోపేడో తేల్చుకోవ‌డానికి ఈట‌ల వ‌ర్గీయులు సిద్ధ‌మైన‌ట్లు ప‌లువురు భావిస్తున్నారు.

ఈ వార్తను చదవండి – Flood Flow | జూరాలకు వ‌ర‌ద పోటు .. 23 గేట్లు ఎత్తివేత

శామీర్‌పేట‌కు చేరిన హుజురాబాద్ రాజ‌కీయం
హుజూరాబాద్‌లోని అసంతృప్తిలో ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ వ‌ర్గీయ‌లు శ‌నివారం ఉద‌యం శామీర్‌పేట‌లో ఉన్న ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఇంటికి కార్య‌క‌ర్త‌లు చేరుకున్నారు. ఈట‌ల వెంట సుమారు 20 ఏళ్లుగా ఉంటున్న త‌మ‌కు బీజేపీలో ప్రాధాన్య‌త లేద‌ని, ప‌ద‌వులు ఇవ్వ‌డం లేద‌ని, ఇప్పుడు త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఉండాల‌ని రాజేంద‌ర్‌కు కోరారు. అధిక సంఖ్య‌లో కార్య‌క‌ర్తలు శామీర్‌పేట చేరుకున్నారు. ఉద‌యం నుంచి ఈట‌ల ఇంటి వ‌ద్ద కార్య‌క‌ర్త‌ల సంద‌డి నెల‌కొంది.

అబద్ధాల పునాదులపై కొందరు బతుకుతున్నారు…
గత 20 ఏళ్లుగా హుజూరాబాద్ కార్యకర్తలు తన వెంటనే నడుస్తున్నారని, రాజకీయాల్లో అబద్ధాల పునాదులపై కొందరు బతుకుతున్నారని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. వీధి పోరాటాలు తమకు అవసరం లేదని అన్నారు. తమపై జరుగుతోన్న కుట్రలను తిప్పికొడదామని నాయకులు, కార్యకర్తలకు ఈటల పిలుపునిచ్చారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా కూడా ఎన్నో కుట్ర‌లు జ‌రిగాయ‌ని చెప్పారు. త‌నపై దుష్ప్ర‌చారం చేసే వారు కురచ మ‌న‌స్త‌త్వ‌మ‌ని అన్నారు. క‌చ్చితంగా తనపై జరగుతోన్న కుట్రలను పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానని ఈటల రాజేందర్ అన్నారు.

నేనొచ్చాకే బీజేపీకి క్యాడ‌ర్‌
తాను హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి రాక ముందు బీజేపీ క్యాడ‌ర్ లేద‌ని, తాను వ‌చ్చాక బీజేపీ క్యాడ‌ర్ వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. తాను వ‌చ్చాక క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో 50 వేలు మెజార్టీ వ‌చ్చింద‌ని తెలిపారు. హుజూరాబాద్ సెగ్మెంట్‌లో బీజేపీకి ఎక్కు ఓట్లు వ‌చ్చాయ‌ని చెప్పారు. హుజూరాబాద్ త్యాగాలకు మారు పేరని.. తెలంగాణ ఉద్యమంలో హుజూరాబాద్ బిడ్డలు వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. తాను పదవుల కోసం ఏనాడు పార్టీలు మారలేదని అన్నారు. 2021 ఉప ఎన్నికల్లో కొందరునాయకులు అమ్ముడుపోయినా.. హుజూరాబాద్ ప్రజలకు తనను గెలిపించారని తెలిపారు.

ప్ర‌తి పంచాయ‌తీలోనూ స‌ర్పంచ్‌, వార్డు మెంబ‌ర్ మ‌న వాళ్లే ఉంటారు
స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో బీఫార‌మ్ అవ‌స‌రం లేద‌ని, ప్ర‌తి పంచాయ‌తీలోనూ మ‌న‌వాళ్ల‌ను పోటీలో పెడ‌దామ‌ని ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న మ‌ద్ద‌తుదారుల అంద‌రినీ గెలిపిస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. ప్ర‌తి పంచాయ‌తీలోనూ స‌ర్పంచ్‌, వార్డులోనూ వార్డుమెంబ‌ర్‌ మ‌న‌వాళ్లే ఉంటార‌న్నారు. స్థానిక ఎన్నిక‌ల‌ను అసెంబ్లీ ఎన్నిక‌లా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటాన‌ని చెప్పారు.

Leave a Reply