భూమి ఖండాల మార్పుల వెనుక శాస్త్రం

భూమి ఖండాల మార్పుల వెనుక శాస్త్రం

అమ్ స్టర్ డామ్ : లక్షల సంవత్సరాల క్రితం మీ ఇల్లు ఎక్కడ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? కోట్ల సంవత్సరాలుగా భూమిపై ఖండాల స్వరూపం మారుతూ వస్తోంది. టెక్టోనిక్ ఫలకాల కదలికల కారణంగా ఖండాలు అనేక మార్పులకు లోనై, ప్రస్తుతం ఉన్న రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ మార్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఖండాల ఆకృతి మారే అవకాశం ఉంది.

ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం సుమారు 320 మిలియన్ (32 కోట్ల) సంవత్సరాల క్రితం ఎక్కడ ఉండేదో తెలుసుకోవడానికి నెదర్లాండ్స్‌లోని ఉట్రెక్ట్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఒక ఆన్‌లైన్ టూల్‌ను రూపొందించారు. ఈ సాధనాన్ని ఉపయోగించి, మన ప్రస్తుత స్థానం (అక్షాంశం) ఆధారంగా అది గతంలో ఏ ఖండంలో, ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు. సుమారు 32 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మొత్తం ‘పాంగేయా’ అనే ఒకే ఖండంగా ఉండేది. తరువాత టెక్టోనిక్ ఫలకాల కదలికల వల్ల అది విభజితమై, నేడు ఉన్న ఏడు ఖండాలుగా మారింది.

ఉట్రెక్ట్ యూనివర్శిటీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ ప్రాజెక్టు పురా-భౌగోళిక నమూనాలపై ఆధారపడి ఉంది. పురాతన శిలల్లో నిక్షిప్తమై ఉన్న అయస్కాంత సంకేతాలను విశ్లేషించడం ద్వారా ఈ నమూనాను రూపొందించారు. ఈ సంకేతాలు భూమి అయస్కాంత ధ్రువాలకు సంబంధించి శిలలు ఎక్కడ ఏర్పడ్డాయో సూచించే దిక్సూచిలా పనిచేస్తాయి. ఈ టూల్ ద్వారా గతంలో జరిగిన వాతావరణ మార్పులు, సామూహిక విలుప్తతలకు జీవ వైవిధ్యం ఎలా స్పందించిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే, శిలాజాలు ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవడం ద్వారా తీవ్ర వేడి లేదా చలి కాలాల్లో వన్యప్రాణులకు ఏ ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయో కూడా శాస్త్రవేత్తలు గుర్తించగలుగుతారు. భూమి యొక్క సుదీర్ఘ చరిత్రను సాధారణ ప్రజలకు దగ్గర చేయడంలో ఈ సాధనం ఉపయోగపడుతుందని పరిశోధకులు ఆశిస్తున్నారు.