సామాన్య భక్తులే కేంద్రంగా దసరా ఉత్సవాల ఏర్పాట్లు

ఏఐ డిస్‌ప్లే బోర్డులు..
చైల్డ్ ట్యాగ్స్‌, బూమ్ బ్యారియర్లు..
3,500 మందితో పటిష్ఠ బందోబస్తు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, సౌకర్యాలు, సులభ దర్శనానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ, పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి. రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర, దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్‌ తెలిపారు. శనివారం వివిధ శాఖల అధికారులతో కలిసి సీతమ్మవారి పాదాలు, కేశఖండనశాల, హోల్డింగ్‌ ఏరియాలు, వినాయక టెంపుల్‌, రథం సెంటర్‌, టోల్‌గేట్‌, ఘాట్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో సంయుక్త తనిఖీలు నిర్వహించారు. భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీపడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొండపై నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వినూత్న కార్యాచరణ రూపొందించామని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. భక్తుల రాకపోకలు, దర్శనం, క్యూలైన్లు, పార్కింగ్‌, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ఏఐ ఆధారిత డిస్‌ప్లే బోర్డులు, 24 గంటలూ సేవలందించే కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఘాట్ల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నామని, పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్‌ మేళా జరగనున్నందున రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

2024 నుంచి సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ వినూత్న ప్రణాళికలతో ఏర్పాట్లు చేస్తున్నామని, ఈసారి మరింత పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని సీపీ రాజశేఖరబాబు తెలిపారు. బూమ్‌ బ్యారియర్లు, యాక్సెస్‌ కంట్రోలర్లు, చైల్డ్‌ ట్యాగ్స్‌ వంటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మొత్తం 22 పార్కింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశామని, 3,500 మంది సిబ్బందితో బందోబస్తు ఉంటుందని తెలిపారు. క్రౌడ్‌ అనలిటిక్స్‌ ద్వారా భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు చేపడతామన్నారు. వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర మాట్లాడుతూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను సమగ్రంగా కల్పిస్తున్నామని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామన్నారు. స్వచ్ఛ దసరా స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని చెప్పారు. దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్‌ మాట్లాడుతూ ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆలయంలో ఆధ్యాత్మిక శోభను ప్రతిబింబించేలా ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.