Dussehra-2026-Indrakeeladri : దసరా వేళ.. Andhra Prabha Exclusive Story

Dussehra-2026-Indrakeeladri : దసరా వేళ.. Andhra Prabha Exclusive Story

  • సూప‌ర్ డ్యూటీ
  • ఇంద్ర‌కీలాద్రిపై అక‌స్మిక బ‌దిలీలు
  • సూపరింటెండెంట్లు, ఏఈఓలకు కొత్త బాధ్యతలు
  • కీలక విభాగాల్లో పునర్విభజన
  • అంతర్గత బదిలీలకు ఈఓ శ్రీ‌కారం
  • కమిషనర్‌ ఆదేశాలు తక్షణం అమ‌లు

( ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ )

దసరా నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతున్న వేళ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అధికారుల విధుల్లో భారీ మార్పులు జరిగాయి. దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు మెరుగైన పరిపాలన కోసం సూపరింటెండెంట్లు, సహాయ కార్యనిర్వహణాధికారుల (ఏఈఓ) స్థాయిలో అంతర్గత విధుల పునర్విభజన ను దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వి.కె.శీనా నాయక్‌ చేపట్టారు. సోమవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసి అంతర్గత బదిలీలను నిర్వహించారు. కొత్త బాధ్యతలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇప్పటికే జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్ల స్థాయిలో అంతర్గత విధుల మార్పులు చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు సూపరింటెండెంట్లు, ఏఈఓల బాధ్యతలను కూడా మార్చారు.

…ఉత్సవాల పర్యవేక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం..

సూపరింటెండెంట్‌ వై.హేమదుర్గాంబకు ఉత్సవాలు, పూజలు, ధర్మపథం, హిందూ ధర్మప్రచారం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రచార రథం, ఆడిట్‌, సాధారణ వ్యవహారాలు, సేవాదారుల నమోదు–విధుల కేటాయింపు, వసతి పర్యవేక్షణ, చీరల విభాగాలను అప్పగించారు. డి.వి.వి.సత్యనారాయణ, కె.శ్రీనివాసరావు (చందు)లకు ప్రోటోకాల్‌, దాతల విభాగం, కొండపై కౌంటర్ల పర్యవేక్షణ, డీసీఆర్‌, విధి సమయంలో నిల్వ రిజిస్టర్ల పరిశీలన బాధ్యతలు కేటాయించారు. వి.సూర్యనారాయణమూర్తికి దత్తత ఆలయాలు, వేదపాఠశాల బాధ్యతలు అప్పగించారు.

..అన్నదానం.. ప్రసాదం పై ప్రత్యేక దృష్టి

సూపర్ండెంట్ స్థాయిలో కె.హరికృష్ణకు ఎంవీ ఫారాలు, స్టేషనరీ, కనకదుర్గ ప్రభ, టోల్‌ఫ్రీ కౌంటర్‌ బాధ్యతలు ఇచ్చారు. బి.నాగేశ్వరరావుకు ప్రధాన ఆలయం, ఉప ఆలయాలు, పూలు–పండ్ల టెండర్లు, వాటికి సంబంధించిన దస్త్రాల వ్యవహారాలు, కొండపై గోశాల పర్యవేక్షణ అప్పగించారు. పి.సునీతకు ప్రసాదాల తయారీ, దిగువ కౌంటర్ల పర్యవేక్షణ, డీసీఆర్‌, నిల్వ రిజిస్టర్ల పరిశీలన బాధ్యతలు ఇచ్చారు. బి.కల్యాణికి నిత్యావసర వస్తువుల నిల్వలు, ఖాతాలు, సమాచార సాంకేతికత, వస్తు–సేవల పన్ను రిటర్నులు, పరిశీలన బాధ్యతలు కేటాయించారు. కేశఖండనశాల, పారిశుద్ధ్యం, దుర్గాఘాట్‌ నిర్వహణ, దుర్గాఘాట్‌, ఫెర్రీ ఘాట్‌ల హారతుల బాధ్యతలను కె.సతీష్‌కు అప్పగించారు.

…భద్రత.. న్యాయ వ్యవహారాలకూ..

సూపర్డెంట్ సి.హెచ్‌.వి.నరసింహరాజుకు ఎస్టాబ్లిష్మెంట్, మత, లౌకిక స్థాపన విభాగాలు, న్యాయ సేవా వ్యవహారాలు, రికార్డు గది, భద్రత, పారిశుద్ధ్యానికి సంబంధించిన దస్త్రాలు, బిల్లులు, ధర్మకర్తల మండలి వ్యవహారాలు అప్పగించారు. కూరెళ్ల శ్రీనివాసరావుకు ప్రధాన, ఉప ఆలయాల విధులు కేటాయించారు. కె.వి.వి.ఆర్‌.ఎస్‌.కిషోర్‌బాబుకు పంపిణీ విభాగం, ప్రథమ చికిత్స కేంద్రం బాధ్యతలు ఇచ్చారు. ఎం.శ్రీనివాసరావుకు అన్నదాన ట్రస్ట్‌, దిగువ కౌంటర్ల పర్యవేక్షణ, డీసీఆర్‌, నిల్వ రిజిస్టర్ల పరిశీలన బాధ్యతలు కేటాయించారు. దేవాదాయ శాఖకు సహకరించేందుకు ఎల్‌.శ్రీనివాసరావుకు ప్రధాన, ఉప ఆలయాల విధులతో పాటు వసతి పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చారు. పి.భాగ్యజ్యోతికి లీజులు, అనుమతులు, భూములు, లీజులు–అనుమతులు–భూములకు సంబంధించిన న్యాయ వ్యవహారాలు, ఆస్తుల రిజిస్టర్‌ నవీకరణ, సమాచార హక్కు చట్టం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవహారాలు అప్పగించారు. ఆమె సెలవు నుంచి విధుల్లో చేరిన అనంతరం ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.

…ఏఈఓలకూ కీలక విభాగాలు..

దేవస్థానంలోని సహాయ కార్యనిర్వహణాధికారుల స్థాయిలోనూ బాధ్యతలను పునర్విభజించారు. సహాయ కమిషనర్‌ సి.హెచ్‌.రంగారావుకు దాతృత్వ సంస్థలు, భూముల వ్యవహారాలు, న్యాయపరమైన సేవా–ఇతర వ్యవహారాలు, సమాచార హక్కు చట్టం, ప్రజా ఫిర్యాదులు, భద్రతా విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎం.తిరుమలేశ్వరరావుకు అన్నదాన ట్రస్ట్‌, ఖాతాలు, సమాచార సాంకేతికత, వస్తు–సేవల పన్ను వ్యవహారాలు కేటాయించారు. పి.చంద్రశేఖర్‌కు కేశఖండనశాల, వసతి గృహాలు, దుర్గాఘాట్‌, దుర్గాఘాట్‌ కృష్ణమ్మ, ఫెర్రీ ఘాట్‌ హారతులు, దత్తత ఆలయాలు, భూములు, లీజులు, అనుమతులు, వేదపాఠశాల, దిగువ కౌంటర్లు, పారిశుద్ధ్య పర్యవేక్షణ అప్పగించారు. పి.సుధారాణికి ప్రసాదాల తయారీ, ఎంవీ ఫారాలు, స్టేషనరీ, సాధారణ వ్యవహారాలు, పంపిణీ, రికార్డు గది, ఆడిట్‌, ప్రథమ చికిత్స కేంద్రం, సేవాదారుల నమోదు, విధుల కేటాయింపు–పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చారు.

.ప్రధాన ఆలయం నుంచి ప్రచారం వరకు..

దేవస్థానంలోని సహాయ కార్య నిర్వహణ అధికారి ఎన్‌.రమేష్‌బాబుకు ప్రధాన, ఉప ఆలయాలు, ధర్మకర్తల మండలి, మత–లౌకిక స్థాపన విభాగాలు, న్యాయ సేవా వ్యవహారాలు, కొండపై కౌంటర్ల పర్యవేక్షణ, భద్రతకు సంబంధించిన దస్త్రాలు, బిల్లుల వ్యవహారాలు అప్పగించారు. ఎన్‌.వి.ఎల్‌.ప్రసన్నకు భూములు, లీజులు, అనుమతులు, న్యాయ వ్యవహారాలు, కేంద్ర నిల్వల విభాగం, చీరల విభాగం బాధ్యతలు కేటాయించారు. ఏఈఓ హోదాలోని సంపాదకుడు కె.గంగాధర్‌కు ఉత్సవాలు, పూజలు, కనకదుర్గ ప్రభ, ప్రజా సంబంధాలు, ప్రోటోకాల్‌, దాతల విభాగం, ధర్మపథం, హిందూ ధర్మప్రచారం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రచార రథం, ప్రభుత్వ పథకాల సమన్వయం, అభిప్రాయ సేకరణ కౌంటర్ల పర్యవేక్షణ, సమాచార సాంకేతిక విభాగాల బాధ్యతలు అప్పగించారు. దసరా ఉత్సవాల్లో భక్తుల రద్దీ, సేవల నిర్వహణ, కౌంటర్ల పర్యవేక్షణ, భద్రత, అన్నదానం, ప్రసాదాల తయారీ వంటి కీలక విభాగాలు సజావుగా సాగేందుకు ఈ బాధ్యతల పునర్విభజన ప్రాధాన్యం సంతరించుకుంది.