Durgam Cheruvu | ప్రైవేట్ ఎస్టీపీలపై సమగ్ర సర్వే..
- శుద్ధి చేసిన నీటిని సమీప చెరువులకు మళ్లించే ప్రణాళిక
- 2047 అవసరాలకు తగ్గట్టు ట్రంక్ మెయిన్లు ఏర్పాటు చేయాలి
- వాటర్ బోర్డు ఎండీ కె.అశోక్ రెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలోని హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, ఎత్తెయిన భవనాలు, నివాస సముదాయాల్లో ఉన్న ప్రైవేట్ ఎస్టీపీలపై సమగ్ర సర్వే నిర్వహించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ కె.అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌కు ప్రతిష్ఠాత్మకమైన దుర్గం చెరువులోకి మురుగునీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా దుర్గం చెరువును శుక్రవారం సందర్శించిన ఎండీ అశోక్ రెడ్డి.. చెరువులోకి చేరుతున్న నాలాలు, మురుగునీటి ప్రవాహాలు, ఎస్టీపీలు, వర్షపు నీటి కాలువలు, పైప్‌లైన్లు, మురుగునీటి మళ్లింపు వ్యవస్థలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దుర్గం చెరువులోకి ఏయే మార్గాల ద్వారా ఎంత నీరు వస్తోంది.. అందులో మురుగునీరు ఎంత.. శుద్ధి చేసిన నీరు ఎంత.. వర్షపు నీరు ఎంత అనే అంశాలపై లెక్కలు పక్కాగా లెక్కించాలన్నారు. నాలాల ప్రారంభ స్థానం నుంచి చెరువు వరకు ఉన్న మొత్తం ప్రవాహ మార్గాలను గుర్తించి ఒకటి రెండు రోజుల్లో సమగ్ర ఫ్లో మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు.
ప్రతి ఎస్టీపీ సామర్థం ఎంత.. వాస్తవంగా ఎంత మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు.. శుద్ధి చేసిన నీటిని ఎక్కడ వినియోగిస్తున్నారు.. మిగిలిన నీటిని ఎక్కడికి విడుదల చేస్తున్నారనే వివరాలను సేకరించాలన్నారు.
మురుగు ప్రవాహానికి మూలంలోనే అడ్డుకట్ట..
వర్షం లేని రోజుల్లో నాలాల్లో మురుగునీరు ప్రవహించకుండా చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని ఎండీ స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న మురుగునీటిని మార్గమధ్యంలోనే అడ్డుకుని ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా ఎస్టీపీలకు తరలించే అవకాశాలను పరిశీలించాలన్నారు.
ప్రస్తుత మురుగునీటి పైప్‌లైన్ల సామర్థ్యం, ప్రవాహ స్థాయిలు, గ్రావిటీ ద్వారా నీటి తరలింపు, ఎస్టీపీల సామర్థ్యం తదితర అంశాలను అధ్యయనం చేసి అవసరమైన చోట కొత్త సీవరేజ్ లైన్లు, ట్రంక్ మెయిన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుత అవసరాలతో పాటు 2047 నాటికి పెరిగే మురుగునీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.
వర్షపు నీటి కాలువల్లోకి మురుగునీరు చేరుతోందా అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రైవేట్ ఎస్టీపీల నుంచి వెలువడే శుద్ధి చేసిన నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట ప్రవాహాన్ని కొలిచే మీటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
వేర్వేరుగా సీవరేజ్, స్టార్మ్ వాటర్..
మురుగునీటి వ్యవస్థ, వర్షపు నీటి వ్యవస్థలను పూర్తిగా వేరు చేయాలని ఎండీ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక సీవరేజ్ పైప్‌లైన్లు ఏర్పాటు చేసి వాటిని ప్రధాన ట్రంక్ మెయిన్‌కు అనుసంధానించే అవకాశాలను పరిశీలించాలన్నారు. వర్షాల సమయంలో నాలాల ద్వారా చెరువులోకి చేరే ప్లాస్టిక్, తేలియాడే చెత్త కారణంగా దుర్వాసన, కాలుష్య సమస్యలు తలెత్తకుండా చెత్త, మురుగునీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రారంభంలోనే గుర్తించి అడ్డుకోవాలన్నారు.
ప్రస్తుతం ఉన్న ఎస్టీపీల సామర్థ్యాన్ని అదనపు స్థలం, భారీ నిర్మాణాలు లేకుండానే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పెంచే అవకాశాలను అధ్యయనం చేయాలన్నారు. ఎస్టీపీలు పనిచేయని సందర్భాల్లో ప్రవేశ మార్గాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు మురుగునీరు తిరిగి కాలనీల్లోకి వెళ్లకుండా ప్రత్యామ్నాయ మళ్లింపు వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.
శుద్ధి చేసిన నీటితో..
ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వృథాగా వదలకుండా సమీప చెరువులకు మళ్లించి సహజ జలచక్రాన్ని, నీటి సమతుల్యతను కాపాడేలా చర్యలు చేపట్టాలని అశోక్‌రెడ్డి సూచించారు. ఎస్టీపీ వారీగా అందుబాటులో ఉన్న శుద్ధి చేసిన నీటి పరిమాణం, సమీప చెరువుల అవసరాలను అంచనా వేసి చెరువుల వారీగా ప్రత్యేక కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
నిధుల కంటే శాశ్వత పరిష్కారమే ముఖ్యమని, వర్షం లేని సమయంలో నాలాల్లో మురుగునీరు ప్రవహించకుండా.. మొత్తం మురుగునీటిని శుద్ధి కేంద్రాలకు తరలించేందుకు మూల స్థాయి నుంచి చెరువు వరకు సమగ్ర వ్యవస్థ ఉండాలని అధికారులను ఎండీ ఆదేశించారు. కార్యక్రమంలో సైబరాబాద్ ఈడీ సంతోష్, ఎస్టీపీ సీజీఎం పద్మజ, జీఎం హరిశంకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
