దుర్గా నాగేశ్వర స్వామి కృపతో ప్రకృతి కరుణించాలి
వరుణ జపం, వరుణ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
మోపిదేవి, ఆంధ్రప్రభ : దుర్గా నాగేశ్వర స్వామి కృపతో ప్రకృతి కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. మంగళవారం మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో వరుణ అనుగ్రహం కోసం వరుణ జపం, వరుణ హోమం నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని, లోకకళ్యాణం కోసం వరుణ దేవుని అనుగ్రహం కలగాలని కోరుతూ స్వామివారి మూలవిరాట్టుకు సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థానంలోని అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నడకుదుటి జనార్ధనరావు, పీఏసీఎస్ చైర్మన్ అరజా రాధిక, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గొర్రెపాటి రమేష్‌చంద్రబాబు, ఏఎంసీ డైరెక్టర్ మెరకనపల్లి నరేష్, జనసేన పార్టీ నాయకులు గోళ్ల శ్రీనివాసరావు, బాదర్ల లోలాక్షు నాయుడు, గొర్రెపాటి దుర్గా నాగేశ్వరరావు, గోళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
