Captain Smith | ఫ్లైదుబాయ్ హీరో కెప్టెన్‌ స్మిత్‌ను కలిసిన దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌..

దుబాయ్‌, ఆంధ్రప్రభ : ఫ్లైదుబాయ్‌ విమానానికి సంబంధించిన ఎఫ్‌జెడ్‌1073 ఘటనలో విధులు నిర్వర్తించిన ఇండియ‌న్ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ను యూఏఈ డిప్యూటీ ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ పరామర్శించారు. కెప్టెన్‌ స్మిత్‌ ప్రస్తుతం చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సామాజిక మాధ్యమంలో స్పందించిన షేక్‌ హమ్దాన్‌.. అత్యున్నత స్థాయి ధైర్యం, బాధ్యత, శ్రద్ధను కెప్టెన్‌ స్మిత్‌ ప్రదర్శించారని ప్రశంసించారు.

దేశ నాయకత్వం తరఫున కెప్టెన్‌ స్మిత్‌కు పూర్తి అభినందనలు, ప్రశంసలు అందిస్తున్నామని షేక్‌ హమ్దాన్‌ పేర్కొన్నారు. ఆయన తమ బృందంలో భాగం కావడం, యూఏఈ కథలో భాగం కావడం పట్ల గర్వంగా ఉందన్నారు. కరుణ, శాంతి, ప్రాణాలను కాపాడే విలువలకు యూఏఈ ప్రతీకగా నిలుస్తుందని.. ఆ విలువలను కెప్టెన్‌ స్మిత్‌ ప్రతిబింబించారని పేర్కొన్నారు.

మరోవైపు కెప్టెన్‌ స్మిత్‌ ఆరోగ్యం మెరుగుపడుతోందని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం ఆయనకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని, కోలుకుంటున్నారని పేర్కొంది. ఆయన కుటుంబ సభ్యులు, స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నామని వెల్లడించింది. కెప్టెన్‌ స్మిత్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. ఆయనకు అందుతున్న వైద్య సహాయానికి యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.