DSP |ఎల్లమ్మ టైటిల్‌ సాంగ్‌ కోసం డిఎస్పీ సరికొత్త ప్రయోగం

ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ (డీఎస్పీ) ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇన్నాళ్లూ తన మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆయన.. ఇప్పుడు హీరోగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఎల్లమ్మ’ తో కథానాయకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్‌ విషయం ఎంటంటే డీఎస్పీ ఈ హీరోగా నటించడమే కాకుండా, సంగీత బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు.

జస్ట్‌ టైటిల్‌ గ్లింప్స్‌తోనే పూనకాలు తెప్పించిన డీఎస్పీ.. ఈ సినిమాలో టైటిల్‌ సాంగ్‌ కోసం మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏకంగా 100 మంది జానపద కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. వారి గొంతులు, ప్రాంతీయ సంగీత శైలులు, సంప్రదాయ వాయిద్యాల సమ్మేళనంతో ఈ పాటను రూపొందిస్తున్నారు.

భారతదేశంలో ప్రతి ప్రాంతానికీ ప్రత్యేకమైన జానపద సంగీత సంప్రదాయం ఉంది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన లయ, స్వరం, వాయిద్యం, ప్రదర్శనా శైలి ప్రత్యేకతగా నిలుస్తాయి. అలాంటి భిన్నమైన సంగీత సంస్కృతులను ఒకే పాటలో మేళవించడం ద్వారా ‘ఎల్లమ్మ’ టైటిల్‌ సాంగ్‌కు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు డీఎస్పీ.

కథానాయకుడిగా డీఎస్పీ పరిచయం అవుతున్న సినిమా కావడం.. అందులోనూ దేశవ్యాప్తంగా 100 మంది జానపద కళాకారులు కలిసి టైటిల్‌ సాంగ్‌కు ప్రాణం పోస్తుండటంతో ‘ఎల్లమ్మ’పై అంచనాలు పెరుగుతున్నాయి. భారతీయ జానపద సంగీతంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా రూపొందుతున్న ఈ పాట త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా సినిమాను ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆసక్తిని పెంచుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లలో విడుదల కానుంది.