AP | కూకట్ పల్లిలో తీగె లాగితే.. తిరుపతిలో బయటపడ్డ  డ్రగ్స్ డొంక

తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : తెలంగాణలో బద్దలైన ప్రాణాంతక మాదక ద్రవ్యాల రాకెట్ మూలాలు తిరుపతి పుణ్యక్షేత్ర పరిసరాల్లో బయటపడడం సంచలన చర్చనీయాంశమవుతోంది. డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రముఖ డ్రగ్స్ ముఠా సభ్యులతో చేతులు కలిపిన ఇద్దరు ఏఆర్ పోలీసులు ఉద్యోగాలు కోల్పోయి జైలు పాలు కాగా, నిర్లక్ష్యం కారణంగా ఏఆర్ విభాగం డి ఎస్ పిపై బదిలీ వేటు పడింది.

ఈవ్యవహారంలో ఇప్పటి వరకు నిందితులుగా తేలిన 10 మందిలో  8మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. దిగుమతి అయిన అవలక్షణాల్లో భాగంగా కొన్ని దశాబ్దాలుగా దేశంలోని పలు నగరాల్లో వివిధ వర్గాల్లో గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాల వినియోగం గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే అంశం అవుతోంది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న డ్రగ్స్ ఆధారిత నేరాలను తుదముట్టించడానికి ప్రభుత్వాలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా పుణ్యక్షేత్రమైన తిరుపతి ప్రాంతాల్లో గంజాయి రవాణాపై పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపడానికి శాయాశక్తులా  ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో డ్రోన్ టెక్నాలజీ ద్వారా రాత్రింబవళ్ళు కొనసాగిస్తున్న వేట మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగురోజుల క్రితం హైదరాబాద్ నగర పరిధిలోని కూకట్ పల్లి పోలీసుల దాడిలో పట్టుబడిన డ్రగ్స్ ముఠా మూలాలు తిరుపతి ప్రాంతంలో ఉన్నట్టు తేలడం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. అందులో తిరుపతి ప్రాంతంలోని ఆర్మడ్ రిజర్వ్ (ఏఆర్) విభాగానికి చెందిన ఇద్దరు పోలీసులు కీలక పాత్ర పోషించినట్టు తెలియడం సంచలన చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం మేరకు మొత్తం వ్యవహారం వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి సమీపంలోని పీలేరు ప్రాంతానికి చెందిన ఈశ్వర రెడ్డి కి అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయి.

తాజాగా ఎఫిడ్రిన్ అనే డ్రగ్ ను రవాణా చేసేందుకు తమ ప్రాంతానికే చెందిన సురేంద్ర రెడ్డితో కలిసి ప్లాన్ రచించాడు. అందులో పోలీసుల సహకారం ఉంటే తమ వ్యాపారం మరింత సులభం అవుతుందని ఆలోచించిన వారికి తిరుపతి ప్రాంతంలో పనిచేసే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర ను సంప్రదించి అతని సలహా మేరకు గుణశేఖర్ అనే మరో ఏఆర్ కానిస్టేబుల్ తో చేతులు కలిపి ఒక ముఠాగా ఏర్పడ్డారు. పథకం ప్రకారం గత నెలాఖరున కొనుగోలు చేసిన ఎఫిడ్రిన్ డ్రగ్ ను వివిధ ప్రాంతాల వారితో రవాణా చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే కొందరితో కలిసి విక్రయించడానికి యత్నిస్తూ గుణశేఖర్ తదితరులు ఈనెల 2వ తేదీన కూకట్ పల్లి పోలీసులకు పట్టుబడ్డారు. దర్యాప్తులో భాగంగా తిరుపతికి వచ్చి కొందరిని అదుపులో తీసుకోడానికి కూకట్ పల్లి పోలీసుల ద్వారా మొత్తం వ్యవహారం వెలుగుచూసింది.

వెంటనే స్పందించిన తిరుపతి జిల్లా ఎస్ పి హర్షవర్ధన్ రాజు డ్రగ్స్ దందాలో భాగస్వాములైన గుణశేఖర్ ను, రామచంద్రలను వెంటనే సర్వీస్ నుంచి తొలగించే చర్యలు తీసుకున్నారు. తన విభాగంలో జరుగుతున్న వ్యవహారాన్ని పసిగట్టడంలో విఫలమైన ఏఆర్ విభాగం డిఎస్పి రవీంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి పిర్యాదు చేశారు. ఫలితంగా రవీంద్రా రెడ్డిని విజయనగరం వీఆర్ కు బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు ఏఆర్ పోలీసులు గుణశేఖర్, రామచంద్రలను రిమాండ్ కు తరలించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకు 10మంది నిందితులు ఉన్నట్టు తేలగా, అందులో 8మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.

Leave a Reply