సికింద్రాబాద్, ఆంధ్రప్రభ : భావి భారత పౌరులు రూపుదిద్దుకునేది పాఠశాలల్లోనే! అంతటి పవిత్రమైన పాఠశాలను డ్రగ్స్ తయారీకి వేదికగా మార్చాడు ఓ వ్యక్తి. బోయిన్‌పల్లి పరిధిలోని ఒక స్కూల్ లోపలే పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారీ జరుగుతుందని సమాచారంపై ఈగల్ టీం దాడి చేసింది. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
పేద విద్యార్థులకు…
జయప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి నర్సరీ నుండి 10 వ తరగతి వరకు ఒక హై స్కూల్ నడుపుతున్నాడు. జీ+2 బిల్డింగ్ లో కేవలం ఆరు గదుల్లోనే పాఠశాల నిర్వహిస్తున్నారు. 2018 నుండి నడుస్తున్నఈ స్కూల్ రెండేళ్ల కిందట స్కూల్ కు వచ్చిన జయప్రకాష్ గౌడ్.. అప్పటి నుండి అన్ని తానై నిర్వహిస్తున్నాడు.
చుట్టుపక్కల ఉండే పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో పాఠశాలలో చేర్పించుకుంటున్నాడు. ఐదు రూంలలో క్లాస్ లు నిర్వహిస్తూ… మరో వైపు క్లాస్ రూమ్ లు, మరో వైపు డ్రగ్స్ తయారీకి పాల్పడుతున్నాడు. ఒక రూమ్ లో అల్ప్రాజోలం డ్రగ్స్ తయారీ చేస్తున్నాడు.
ఈగల్ టీమ్ దాడి…
పాఠశాలలో తయారు చేస్తున్న డ్రగ్స్‌ను సెలవు రోజుల్లో జయప్రకాష్ గౌడ్ విక్రయిస్తున్నాడు. ఈరోజు కూడా జయప్రకాష్ విక్రయిస్తుండగా ఈగల్ టీమ్ దాడి చేసింది. ఈగల్ టీమ్ కూడా విస్తూ పోయిన విషయాలు వెలుగు చూశాయి.
బోయినపల్లి లోని ఒక స్కూల్ ఫస్ట్ ఫ్లోర్ లో పెద్ద సంఖ్యలో రియాక్టర్లు ఉన్నాయి. డ్రగ్స్ తయారీ కోసం ఫ్యాక్టరీ స్టైల్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఎనిమిది రియాక్టర్లు ఏర్పాటు చేసుకున్న జయప్రకాష్ డ్రగ్స్ తయారు చేయిస్తున్నారు. అచ్చం ఫ్యాక్టరీని తలపించేలా ఉన్న రూమ్ లోకి ఎవరు రాకుండా జయప్రకాష్ జాగ్రత్తలు తీసుకున్నట్లు గుర్తించారు.
పాఠశాల అనుమతులు రద్దు
బోయిన్‌పల్లి పరిధిలోని మేధా హై స్కూల్ లోపలే పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారీ జరుగుతుందని సమాచారంపై ఈగల్ టీం దాడి చేసింది. ఆ పాఠశాలలో పది కిలోల డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు.
ఆ పాఠశాలను ఈగల్ టీం సీజ్ చేసింది. నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్‌ను అరెస్టు చేశారు. దీంతో విద్యాశాఖ రంగంలోకి దిగి ఆ పాఠశాల అనుమతులను రద్దు చేశారు. అక్కడ విద్యార్థులను వేరే పాఠశాలలో చేర్పించారు.
తెలంగాణ వ్యాప్తంగా…
తెలంగాణ వ్యాప్తంగా ఈగల్ టీమ్(Eagle Team) దూకుడు పెంచింది. పోలీసుల సహాకారంతో డ్రగ్స్(Drugs) కేంద్రాలు, ముఠాలపై తనిఖీలు చేపట్టారు. రైళ్లు, పారిశ్రామిక వాడలపై ప్రముఖంగా దృష్టి సారించారు. ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 91 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
రైళ్లలో గంజాయి తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా 32 కిలోల గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్‌లో మరో 214 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డిలో అల్ఫాజోలం తయారీ యూనిట్ గుట్టురట్టు చేశారు. ములుగు జిల్లా వాజేడులో 30 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇలాగే తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల పోలీసుల సహాకారంతో ఈగల్ టీమ్ దాడులు చేస్తోంది.

