మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మిద్దాం
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: సీఐ మన్మధకుమార్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మధకుమార్ సూచించారు. అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పాత రచ్చబండ ఆవరణలో సర్పంచ్ సుర్వి మల్లేష్‌గౌడ్ అధ్యక్షతన పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సీఐ మన్మధకుమార్, ఎస్‌ఐ నర్సిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై గ్రామ ప్రజలు, యువతకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. చిన్న గ్రామంలో ప్రజల శ్రేయస్సు కోసం పెద్ద ఎత్తున అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన సర్పంచ్ మల్లేష్‌గౌడ్‌ను సీఐ అభినందించారు.
గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలు, జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, సామాజిక మాధ్యమాల మోసాల కారణంగా యువత విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సీఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి కేసు నమోదు అయితే భవిష్యత్తులో ఉద్యోగాలు, పాస్‌పోర్టు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై అంకిరెడ్డిగూడెం గ్రామాన్ని మాదకద్రవ్యాల రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
సర్పంచ్ సుర్వి మల్లేష్‌గౌడ్ మాట్లాడుతూ పోలీసుల సూచనలు, సలహాలు పాటిస్తూ అంకిరెడ్డిగూడెంను సురక్షిత, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. గ్రామంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా తనకు తెలియజేయాలని కోరారు. అనంతరం పోలీసు అధికారులను సర్పంచ్ శాలువాలతో సన్మానించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ వలందాస్ మహేష్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి గంగాపురం పాండుగౌడ్, వార్డు సభ్యులు బత్తుల అనుష, పాలం వెంకటేశంగౌడ్, ముద్దం లింగస్వామిగౌడ్, దొడ్ల అండాలు, దండుగల వెంకటేశం, బొమ్మని శ్రావణి, రాపోలు రేణుక, మహిళా సంఘం అధ్యక్షురాలు పెండం లక్ష్మి, యాంటీ డ్రగ్స్ కమిటీ సభ్యులు పర్ని శ్రీధర్‌రెడ్డి, భీమగోని మల్లేశంగౌడ్, పర్మి శ్రీనివాస్‌రెడ్డి, బత్తుల జంగయ్యగౌడ్, బొమ్మను స్వామిగౌడ్, సుర్వి విజయ్‌గౌడ్, యాట శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
