AP | డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి.. !

AP | డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి.. !

గురజాలలో ఘటన..
కోడిగుడ్లు, కర్రలతో దాడి చేసిన మహిళ కుటుంబసభ్యులు


గురజాల, అక్టోబర్‌ 4 (ఆంధ్రప్రభ): పల్నాడు జిల్లా గురజాలలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి ఘటన చోటుచేసుకుంది. మాచర్లకు వెళ్తున్న బస్సును మాడుగుల అడ్డరోడ్డు వద్ద ఆపాలని ఓ మహిళ కోరగా.. అక్కడ బస్సు ఆపకుండా కొంత ముందుకు వెళ్లిన తర్వాత డ్రైవర్‌ బస్సును నిలిపినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ, ఆమె కుటుంబసభ్యులు తిరుగు ప్రయాణంలో ఉన్న అదే బస్సును అడ్డుకుని డ్రైవర్‌, కండక్టర్‌పై దాడికి పాల్పడినట్లు తెలిసింది.

బస్సును అడ్డుకున్న అనంతరం కోడిగుడ్లు, కర్రలతో ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో మరో ట్విస్టు చోటుచేసుకుంది. దాడి జరిగిన సమయంలో విధుల్లో ఉన్న డ్రైవర్‌, కండక్టర్‌.. మొదట బస్సులో ప్రయాణించిన సిబ్బంది కాకుండా డ్యూటీ మారిన వారు కావడం గమనార్హం.

ఈ ఘటనపై కండక్టర్‌ సోమయ్య గురజాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి దారితీసిన పరిస్థితులు, ఘటనలో పాల్గొన్న వ్యక్తుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గురజాల ప్రాంతం పల్నాడు జిల్లాలోని మాచర్ల పరిధితో సంబంధం కలిగి ఉంది.