water | హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు అంతరాయం
- 36 గంటల పాటు నీటి కష్టాలు.. ఈ ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం!
- కృష్ణా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో కీలక మరమ్మతు పనులు
- అక్టోబర్ 5 ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 6 సాయంత్రం 6 గంటల వరకు పనులు
- పలు ప్రాంతాల్లో పూర్తిగా, పాక్షికంగా సరఫరా నిలిచే అవకాశం.. మరికొన్ని చోట్ల లో-ప్రెషర్
హైదరాబాద్, అక్టోబర్ 4 (ఆంధ్రప్రభ): నగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించిన కీలక మరమ్మతు పనుల నేపథ్యంలో పలు ప్రాంతాల ప్రజలకు నీటి ఇబ్బందులు తప్పవు. హైదరాబాద్ మహానగరానికి కృష్ణా జలాలను సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (KDWSP) ఫేజ్–IIలో భాగంగా ప్రధాన పైప్‌లైన్‌పై అత్యవసర పనులు చేపట్టనున్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో 36 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
పైప్‌లైన్‌పై మరమ్మతులు
నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ వాల్వులు, ఇతర వాల్వుల మార్పిడి పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీని అరికట్టేందుకు కూడా మరమ్మతులు చేయనున్నారు. ఈ పనులు అక్టోబర్ 5, సోమవారం ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 6, మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా సరఫరా జరిగే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో లో-ప్రెషర్‌తో నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతాల్లో ప్రభావం
ఆదిబట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్, ఉప్పల్, నాచారం, హెచ్ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్ (పాక్షికం), హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్ (పాక్షికం), పద్మారావునగర్, బేగంపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, పట్టిగడ్డ, నల్లగుట్ట, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, సీతాఫల్మండి, మెట్టుగూడ, వైశాలీనగర్, మీర్పేట్, బడంగ్పేట్, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎన్పీఏ, శంషాబాద్, మధుబన్, ప్రశాసన్‌నగర్ (పాక్షికం) ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం పడనుంది.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
మరమ్మతు పనుల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల వినియోగదారులు ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. 36 గంటల వ్యవధిలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. పనులు పూర్తయిన అనంతరం పరిస్థితిని బట్టి సాధారణ నీటి సరఫరాను పునరుద్ధరించనున్నారు.
