Secretariat| సచివాలయంలో తాగునీటి కటకట
- బిల్లులు చెల్లించలేదని వాటర్ క్యాన్ల సరఫరా నిలిపివేత
- రూ.50 లక్షల బకాయిలతో వాటర్ క్యాన్ల సరఫరా బంద్
- పనిచేయని ఫిల్టర్లు.. సొంతంగా నీళ్లు తెచ్చుకోవాలంటున్న అధికారులు
- వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, సందర్శకులకు ఇబ్బందులు
హైదరాబాద్, అక్టోబర్ 5 (ఆంధ్రప్రభ): రాష్ట్ర పాలనకు కేంద్రంగా ఉన్న తెలంగాణ సచివాలయంలో తాగునీటి కొరత నెలకొన్నట్లు సమాచారం. తాగునీటి క్యాన్లను సరఫరా చేస్తున్న ఏజెన్సీలకు బకాయిలు చెల్లించకపోవడంతో వారు సరఫరాను నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో నిత్యం సచివాలయానికి వచ్చే వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, సందర్శకులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.
రూ.50 లక్షలు బకాయిలు
సచివాలయానికి తాగునీటిని సరఫరా చేస్తున్న నాలుగు ఏజెన్సీలకు ప్రభుత్వం సుమారు రూ.50 లక్షల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. సచివాలయంలోని వివిధ విభాగాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఈ మొత్తం పేరుకుపోయినట్లు తెలిసింది. బకాయిలు చెల్లించకపోవడంతో ఏజెన్సీలు నీటి సరఫరాను నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ఫిల్టర్లు, కూలర్లు కూడా పనిచేయక..
మరోవైపు సచివాలయ ప్రాంగణంలోని కొన్ని వాటర్ ఫిల్టర్లు, కూలర్లు కూడా పనిచేయకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ఉద్యోగులు, సిబ్బంది ఇళ్ల నుంచే తాగునీటి బాటిళ్లు తెచ్చుకోవాలని అధికారులు సూచించినట్లు తెలిసింది.
ఉద్యోగుల్లో అసంతృప్తి
ఒకవైపు తాగునీటి సరఫరా నిలిచిపోవడం.. మరోవైపు అంతర్గత ఫిల్టర్లు పనిచేయకపోవడంతో సచివాలయానికి వచ్చే ఉద్యోగులు, సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
