జీహెచ్‌ఎంసీలో డబుల్‌ బిల్లింగ్‌.. అసలు లెక్క ఇదే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో డబుల్‌ బిల్లింగ్‌ పేరుతో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందంటూ వచ్చిన వార్తలపై జీహెచ్‌ఎంసీ అధికారిక వివరణ ఇచ్చింది. కొన్ని మీడియా కథనాల్లో పేర్కొన్నట్లు రూ.100 కోట్లకు పైగా, రూ.200 కోట్ల స్థాయిలో ఎలాంటి ఆర్థిక అక్రమాలు జరగలేదని స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ విభాగం నిర్వహించిన ప్రాథమిక విచారణలో 78 ఈఆర్‌పీ ఇన్వాయిస్‌లకు సంబంధించి రూ.6.92 కోట్ల మేర మాత్రమే వ్యత్యాసాలు గుర్తించినట్లు తెలిపింది.

ఈ వ్యవహారానికి సంబంధించి వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుంచేందుకు జీహెచ్‌ఎంసీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వార్తల్లో వచ్చిన కొన్ని అంకెలు, అంచనాలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని పేర్కొంది. ముఖ్యంగా వందలాది మంది కాంట్రాక్టర్లు, వందల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

జీహెచ్‌ఎంసీయే గుర్తించిన వ్యవహారం

డబుల్‌ బిల్లింగ్‌ అంశాన్ని బయట వ్యక్తులు గుర్తించలేదని.. జీహెచ్‌ఎంసీ అంతర్గత వ్యవస్థల పరిశీలనలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ సందర్భంగా ఆన్‌లైన్‌ చెల్లింపుల విధానం, ఖాతాల విభజన, ఆర్థిక లావాదేవీలపై అదనపు కమిషనర్‌ (ఫైనాన్స్‌) నిర్వహించిన సమీక్షలో భాగంగా కొన్ని చెల్లింపుల్లో వ్యత్యాసాలు గుర్తించినట్లు వివరించారు. జీహెచ్‌ఎంసీ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు చేపట్టిన పరిశీలనలో భాగంగానే ఒకే పనికి సంబంధించిన ఇన్వాయిస్‌లు రెండుసార్లు ప్రాసెస్‌ అయిన అంశాలు బయటపడినట్లు పేర్కొన్నారు. ఈ విషయం గుర్తించిన వెంటనే సంబంధిత విభాగాలు చర్యలు ప్రారంభించాయని తెలిపారు.

రూ.6.92 కోట్లలో దాదాపు మొత్తం రికవరీ..

డబుల్‌ చెల్లింపులుగా గుర్తించిన మొత్తంలో దాదాపు మొత్తం తిరిగి వసూలు చేసినట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. మొత్తం 78 ఈఆర్‌పీ ఇన్వాయిస్‌లకు సంబంధించి రూ.6,92,11,434 మేర వ్యత్యాసాలు గుర్తించగా.. అందులో 74 ఇన్వాయిస్‌లకు సంబంధించిన రూ.6,83,75,773 ఇప్పటికే రికవరీ చేసినట్లు తెలిపింది. మిగిలిన నాలుగు ఇన్వాయిస్‌లకు సంబంధించి రూ.8,35,661 డిమాండ్‌ డ్రాఫ్టుల రూపంలో అందాయని, ఆ మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ జనరల్‌ ఫండ్‌లో జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. నిధుల రికవరీ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని, అధికారిక ప్రక్రియ ద్వారానే మొత్తం వసూలు చేస్తున్నామని స్పష్టం చేసింది. వ్యత్యాసాలు గుర్తించిన వెంటనే సంబంధిత వెండర్లను జీహెచ్‌ఎంసీ ఈఆర్‌పీ వ్యవస్థలో బ్లాక్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.

జూలైలోనే విచారణకు ఆదేశాలు

ఈ వ్యవహారంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. జూలై 27న ఈ అంశాన్ని సమగ్ర విచారణ కోసం విజిలెన్స్‌ విభాగానికి అప్పగించినట్లు వెల్లడించారు. విజిలెన్స్‌ విభాగం అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించడంతో పాటు.. లావాదేవీల్లో భాగమైన అధికారులను, సిబ్బందిని, అధిక మొత్తాలు పొందిన కాంట్రాక్టర్లను కూడా విచారించినట్లు తెలిపారు. విచారణలో ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌, సూపరింటెండెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, అప్పటి అదనపు కమిషనర్‌ (ఫైనాన్స్‌), చీఫ్‌ ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ తదితరుల నుంచి వివరాలు సేకరించినట్లు పేర్కొన్నారు.

మేకర్‌–చెకర్‌ వ్యవస్థలో లోపాలు

ప్రాథమిక విచారణలో కొన్ని సాంకేతిక, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. ముఖ్యంగా మేకర్‌–చెకర్‌ నియంత్రణ వ్యవస్థను అధిగమించడం, మూడు టీఆర్‌ఈడీఎస్‌ ప్లాట్‌ఫారమ్‌లు, జీహెచ్‌ఎంసీ ఈఆర్‌పీ, జనరల్‌ ఫండ్‌ మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల కొన్ని డబుల్‌ చెల్లింపులు జరిగినట్లు గుర్తించినట్లు పేర్కొంది. టీఆర్‌ఈడీఎస్‌ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వచ్చిన ఇన్వాయిస్‌లను పరిశీలించే విధానంలో మరింత పటిష్టమైన నియంత్రణ అవసరమని గుర్తించినట్లు తెలిపింది. ఒకే ప్లాట్‌ఫారమ్‌లో లేదా వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే ఇన్వాయిస్‌ మళ్లీ అప్లోడ్‌ అయిన సందర్భాలను ప్రస్తుత వ్యవస్థ పూర్తిగా నిరోధించలేకపోయిందని సంబంధిత సంస్థలు అంగీకరించినట్లు వివరించింది.

బాధ్యులపై చర్యలు కొనసాగుతున్నాయి

ఈ వ్యవహారంలో బాధ్యత ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులపై చర్యలు ప్రారంభించినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. సర్వీస్‌ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించింది. ఒక అధికారి ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నా.. గతంలో జరిగిన బాధ్యతల నుంచి తప్పించుకునే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అయితే విజిలెన్స్‌ నివేదిక ప్రాథమిక విచారణ మాత్రమేనని, దానిని తుది నేర నిర్ధారణగా పరిగణించలేమని అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం అభియోగాలు నమోదు చేయడం, వివరణ కోరడం, శాఖాపరమైన విచారణ నిర్వహించడం, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. దురుద్దేశం, నేరపూరిత ఉద్దేశం ఉన్నట్లు ప్రత్యేక విచారణలో తేలితే క్రిమినల్‌ చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.

ప్రత్యేక ఆడిట్‌కు ప్రతిపాదన

రూ.6.92 కోట్ల వ్యత్యాసాల గుర్తింపు ప్రాథమిక దశలో ఉన్న అంచనా మాత్రమేనని జీహెచ్‌ఎంసీ తెలిపింది. టీఆర్‌ఈడీఎస్‌ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని లావాదేవీలపై ప్రత్యేక ఆడిట్‌ నిర్వహించాలని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 196 ప్రకారం ఈ ప్రత్యేక ఆడిట్‌ చేపట్టాలని సూచించినట్లు పేర్కొంది. ఆడిట్‌లో మరిన్ని వ్యత్యాసాలు బయటపడితే వాటిని కూడా పూర్తిగా వసూలు చేస్తామని స్పష్టం చేసింది.

కమిషన్‌, జీఎస్టీ ఆరోపణలపై స్పష్టత

కొన్ని వర్గాలు ప్రస్తావించిన 10 శాతం కమిషన్‌, 18 శాతం జీఎస్టీ అంశాలు ప్రస్తుతం జరిగిన విచారణలో నిర్ధారణ కాలేదని జీహెచ్‌ఎంసీ తెలిపింది. ప్రజాధనానికి సంబంధించిన ఏ అంశంలోనూ అక్రమాలను సమర్థించబోమని స్పష్టం చేసింది. జీఎస్టీకి సంబంధించి అవసరానికి మించి చెల్లింపులు జరిగితే వాటిని తిరిగి పొందే విధానం ఉందని తెలిపింది. ఇక కమిషన్‌ పేరుతో ఎవరైనా లంచాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే వాటిని విజిలెన్స్‌ విభాగానికి అందించాలని కోరింది. ఆధారాలు అందితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

చెల్లింపుల వ్యవస్థలో మార్పులు

ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జీహెచ్‌ఎంసీ చెల్లింపుల వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది. ఒకసారి చెల్లింపు పూర్తయిన ఈఆర్‌పీ వోచర్‌ను మళ్లీ ప్రాసెస్‌ చేయకుండా సాంకేతిక నియంత్రణలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రతి చెల్లింపు బ్యాచ్‌ విడుదలకు ముందు ఈఆర్‌పీ, టీఆర్‌ఈడీఎస్‌, జనరల్‌ ఫండ్‌, ఆడిట్‌ రికార్డుల మధ్య తప్పనిసరి సమన్వయం ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రజాధనంలో ఒక్క రూపాయి కూడా నష్టం కాకుండా చూడటం తమ ప్రధాన లక్ష్యమని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగినా బాధ్యతను నిర్ధారించి చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ తెలిపారు.