- కాకినాడ జిల్లా వ్యవసాయ శాఖ జేడీ
పిఠాపురం, ఆంధ్రప్రభ : తుపాను ప్రభావం జిల్లా నుంచి పోయే వరకూ వరి కోతలు వాయిదా వేసుకోవాలని పిఠాపురం వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎన్ విజయకుమార్, ఏడీ స్వాతి రైతులకు సూచించారు. తుపాను నేపథ్యంలో పిఠాపురం మండలం కోలంక తదితర గ్రామాల్లో వ్యవసాయాధికారులు పర్యటించారు. రైతులతో మాట్లాడారు. వరి పంట పరిస్థితిని పరిశీలించారు. విజయకుమార్ మాట్లాడుతూ కోతలు కోయడానికి సిద్ధంగా ఉన్న వరి పంటను రైతులు వాయిదా వేసుకోవాలని సూచించారు.
పొలంలో ఏర్పాటు చేసిన మురుగు కాలువలు ద్వారా నీటిని వెంటనే తీసేయాలని, చెప్పారు. పంటకు పొడతెగులు రాకుండా ఎకరానికి ప్రొపికోనాజోల్ 25 ఈసీ 200ఎంల్ , లేదా హెక్స్కునజోల్ 5 ఎస్ సీ 400 ఎంల్ పిచికారి చేయాలని తెలిపారు. దీనివలన వరి గింజ రంగు మారకుండా, తెగులు ఆశించకుండా నివారించుకోవచ్చునని చెప్పారు. గాలులకు పంట పడిపోతో వాటిని నిలబెట్టి కట్టాలన్నారు. గింజ రంగు మారకుండా, మొలక రాకుండా ఐదు శాతం ఉప్పు ద్రావణమును పిచికారి చేసుకోవాలన్నారు.
ఆలస్యంగా నాటిన వరి పొలాల్లో దుబ్బు దశలో ఉన్న పొలాలలో నీరు తీసివేసిన తర్వాత ఎకరాకు యూరియా 20 కేజీలు పొటాష్ 20 కేజీలు వేసుకోవాలన్నారు. పిఠాపురం ఏవో వై గంగాధర్ గ్రామ సర్పంచ్ బుల్లిరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గౌరి, గ్రామ వ్యవసాయ సహాయకురాలు మౌనిక, వ్యవసాయ విస్తరణ అధికారి సూర్యనారాయణ మూర్తి, రైతులు పాల్గొన్నారు.

