AP CM | హలం పట్టుకుని పొలానికి వెళ్లాలి..!
AP CM | హలం పట్టుకుని పొలానికి వెళ్లాలి..!
‘మీ భూమి.. మీ హక్కు.. హక్కు కాపాడే బాధ్యత మాది’
40.58 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశాం: సీఎం చంద్రబాబు
రూ.166 కోట్లతో పోతుల చెంచయ్యపాలేరు రిజర్వాయర్.. 9,500 ఎకరాలకు సాగునీరు
AP CM | నర్సింగోలు, అక్టోబర్ 9 (ఆంధ్రప్రభ): రైతు అర్జీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరగకుండా.. హలం పట్టుకుని పొలానికి వెళ్లేలా పాలన ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల భూములకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నర్సింగోలులో శుక్రవారం పర్యటించిన సీఎం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ‘మీ భూమి–మీ హక్కు’ గ్రామ సభలో పాల్గొని లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు.
‘‘మీ భూమి.. మీ హక్కు.. భూమి మీదే.. హక్కు మీదే. ఆ హక్కును కాపాడే బాధ్యత మాది. ఇది సీబీఎన్ మార్క్’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. రైతులు తమ భూముల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40.58 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశామని సీఎం తెలిపారు. ఒక్క అక్టోబర్‌లోనే 793 గ్రామాల్లో 4.58 లక్షల మందికి పాస్‌పుస్తకాలు అందించామన్నారు. ప్రకాశం జిల్లాలో 24,116 పాస్‌పుస్తకాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పాస్‌పుస్తకాల పంపిణీకి అధికారులకు లక్ష్యాలు నిర్దేశించామని, నిర్దేశిత టార్గెట్‌ను పూర్తి చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోతుల చెంచయ్యపాలేరు రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. సుమారు రూ.166 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. రిజర్వాయర్ ద్వారా 9,500 ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు.
కొండపి నియోజకవర్గంలోని నర్సింగోలులో రూ.27.85 కోట్లతో ముప్పాళ్ల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే పోతుల చెంచయ్యపాలేరు రిజర్వాయర్ స్పిల్‌వే, ప్రధాన తూముల నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు.
గత ప్రభుత్వ పాలనపై చంద్రబాబు విమర్శలు చేశారు. ‘‘గత ఐదేళ్లలో ఎక్కడ చూసినా విధ్వంసమే. అప్పట్లో ఇంట్లో ఉన్నప్పుడు భద్రత ఉందా? మీ భూములకు భద్రత ఉందా?’’ అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖ వివాదాలకు కేంద్రంగా మారిందని, భూకబ్జాలు, ఆక్రమణలు, అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
పాత పట్టాదారు పాస్‌పుస్తకాలను పరిశీలిస్తే కొన్నింటిలో భూ యజమానులకు బదులు ఇతరుల ఫొటోలు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. ‘‘మీ ఆస్తిపై బొమ్మ ఇంకెవరిదో.. అది న్యాయమా?’’ అని ప్రశ్నించారు. భూ యజమానుల హక్కులను పరిరక్షించేందుకే కొత్త విధానాలను తీసుకొచ్చామని తెలిపారు.
దీపావళి పండుగ ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ చెడును ప్రోత్సహించకూడదని సీఎం అన్నారు. మంచి వ్యక్తులకు అండగా నిలిచినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తోందని చంద్రబాబు తెలిపారు. ‘‘నాకు అనుభవం ఉంది.. పవన్ కల్యాణ్‌కు తపన ఉంది.. ప్రధాని మోదీ అండ ఉంది. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పాం’’ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు ఎనిమిది మంది కేంద్ర మంత్రులను కలిశానని తెలిపారు. ‘‘నాకు భేషజాలు లేవు. నా ప్రజల కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తా. నా ప్రజల కోసం ఎవరిని కలవడానికైనా సిద్ధమే’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రకాశం జిల్లాలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న గర్భ కండ్రిక భూ సమస్యలను పరిష్కరించి రైతులకు హక్కు పత్రాలను సీఎం అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్‌తో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
